లాభాల పంట పండించే అంకాపూర్ వ్యవసాయ విధానాలకి దేశ వ్యాప్తంగా పేరుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మురు మండలంలో ఉన్న ఈ గ్రామానికి అంతటి పేరు రావడానికి కారణం ఆ ఊరి మహిళల కృషే. 40 ఏళ్ల క్రితం అంకపూర్ మిగతా పల్లెల మాదిరిగానే సాధారణ గ్రామం. ఇప్పుడు… ఆ ఊరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 800 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అడుగుతీసి అడుగు వేస్తే అధునాతన భవనాలే దర్శనమిస్తాయి. ఇంటికొ కారు ఉంటుంది. ఈ గ్రామం నుంచి 200 మందికి పైగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. ఈ గ్రామానికి చెందిన మహిళా రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లలోని తన ఫాంహౌస్ కు పిలిపించి వారి వ్యవసాయ విధానాలను అడిగి తెలుసుకొని ప్రశంసించారు.
కొత్తవిధానాలతోనే మార్పు…
గ్రామంలో 450 కుటుంబాలుంటే అందులో 350 కుటుంబాలు వ్యవసాయమే చేస్తున్నాయి. అని కుటుంబాల్లోనూ మహిళలే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పంటలు పండిస్తారు. యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ విధానం పై పూర్తిగా అవగాహన పెంచుకొని… మార్కెట్లో డిమాండు ఉన్న పంట సాగుచేసి ఆర్థిక పురోగతి సాధిస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు వేస్తూ ఎకరాకు సగటున రూ. లక్ష ఆదాయం అర్జస్తారు. మూస విధానాలకు స్వస్తిపలికి కొత్త పద్ధతులు అందిపుచ్చుకొని సాగును మొదలు పెట్టారు. ఎక్కువగా మొక్కజొన్న, పసుపు, సజ్జ, ఎర్రజొన్న, కూరగాయలు పండిస్తారు. సగటున ఒక్కో మహిళా రైతుకు ఐదు నుంచి పది ఎకరాల వరకు ఉంటుంది. ప్రతి క్షేత్రానికి నీటి నిల్వ ట్యాంకు ఉంటుంది. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తారు. పంట మార్పిడి పక్కగా పాటిస్తారు. పొలం గట్లపైన కంది, కూరగాయలు వేస్తారు. గ్రామంలో మార్కెటింగ్ సౌకర్యం ఉండటం వారికి అదనపు బలం. అంకాపూర్ మార్కెట్కే ఇతర జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసుకొని వెళ్తారు. వీరిని ఆదర్శంగా తీసుకొని అనేక గ్రామాల్లో మహిళలు సొంతంగా వ్యవసాయం చేస్తుండటం మరో విశేషం.