Woman Farmer Success Story: ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి ట్రాక్టర్ ఉన్న ఒక అతనిని నేను సాయం అడిగాను. అప్పటికే ఊరిలో అందరూ విత్తనాలు వేసేశారు. వెనకబడిన నేను ఉదయం 7 గంటలకే విత్తనాలు తీసుకుని పొలం వద్దకు వెళ్ళాను. కానీ ట్రాక్టర్ తో అడిగిన అతను సాయంత్రం వచ్చాడు. దాంతో మేము రాత్రి సమయంలో విత్తనాలు నాటాము. నాకు అప్పుడు అనిపించింది. ఎవరి మీద ఆధారపడకుండా నేను ఒక ట్రాక్టర్ కొనాలని అనుకున్నాను. చివరికి కొనగలిగాను అంటున్నారు మహారాష్ట్ర మహిళా రైతు జ్యోతి.
మహారాష్ట్ర, అకోలా జిల్లాలోని కటియర్ గ్రామంలో నివసిస్తున్నారు జ్యోతి. ఆమెది వ్యవసాయ కుటుంబం. ఆమె భర్త, మరిది, మామ అందరూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ జ్యోతి మాత్రం వ్యవసాయంపై ఆశ వదులుకోలేదు. జ్యోతి ప్రస్తుతం 29 ఎకరాలు సాగు చేస్తున్నారు. పొలంలో అవసరమైన పనులన్నీ ఆమె చేసుకుంటారు. జ్యోతి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడటంతో పొలం అమ్ముకొమ్మని ఆమెకు ఎంతోమంది సలహా ఇచ్చారు. దేశ్ ముఖ్ కుటుంబంలోని మహిళలు పొలం పనులు చేయకూడదు అంటూ చాలా మంది జ్యోతికి చెప్పేవారు. కానీ అవేం పాటించుకోలేదు జ్యోతి. తర్వాత జ్యోతి తనకు తానుగా పొలం పనులు నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక మహిళా తల్చుకుంటే వ్యవసాయం ఎంత చక్కగా చేయగలదో ఆమె చెప్తున్నారు.
వ్యవసాయం మీకు ఏమిచ్చింది అని ఆమెను అడిగితే.. వ్యవసాయం నాలో ఉన్న భయాన్ని పోగొట్టింది అని జ్యోతి చెప్తున్నారు. మొదట్లో నేను చాలా పిరికితనంతో ఉండేదాన్ని. అందరికీ భయపడిపోతుండేదాన్ని. నేను వ్యవసాయం ప్రారంభించాక ఇప్పుడు నాకు అసలు భయం అనేదే లేదని చెప్తున్నారు జ్యోతి. మహారాష్ట్రలో మూడు నెలల లక్డౌన్ సమయంలో 1198 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మా కుటుంబం కూడా ఉంది. మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు జనం నన్ను ఎన్నో మాటలు అన్నారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. గతంలో మా పాత ఇంటిపైన ఉన్న మంగుళూరు టైల్స్ ఎవరో దొంగిలించారు. దాంతో వర్షాకాలం ఇల్లు అంతా కురుస్తుండేది. అందుకే నేను కొత్త ఇల్లు కొన్నాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. కంప్యూటర్ ఇంజినీర్ చదివాడు. ప్రస్తుతం నా కొడుకు పూణేలో ఒక సంస్థలో పని చేస్తున్నాడు అని చెప్పారు ఆదర్శ మహిళా రైతు జ్యోతి.