Watermelon మూస పద్ధతికి స్వస్తి పలికి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అరుదైన ఫలితాలు సాధిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన గాడి తిరుపతిరెడ్డి. మల్చింగ్ పద్ధతిలో పుచ్చ సాగు చేసి 75 రోజుల్లో ఐదు లక్షలు ఆర్జించారు ఆ రైతు.
తనకున్న పదెకరాల సొంత భూమితో పాటు మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని గతేడాది నవంబర్‌లో వసుధ రకం పుచ్చను రెండు దఫాలుగా విత్తారు తిరుపతిరెడ్డి. 20 ఎకరాల్లో మల్చింగ్ (పాలిథిన్ కవర్ కప్పు) పద్ధతిలో సాగుచేసి డ్రిప్ అమర్చాడు. దీనికిగాను ఒక్కో ఎకరానికి పెట్టుబడిగా విత్తనాలు, పేపర్, డ్రిప్, వేపపిండి, ఆముదం పిండి, పొటాష్, డీఏపీ, యూరియా మొత్తం రూ.70 వేలు ఖర్చయింది. మల్చింగ్ విధానంలో కూలీల ఖర్చుతోపాటు ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గింది. 75 రోజుల అనంతరం ఎకరానికి మొదటి విడతగా 15 టన్నుల పంట దిగుబడి వచ్చింది.
పదెకరాలలో తొలి విడతగా 150 టన్నులు పంట దిగుబడి వచ్చింది. ప్రస్తుత మార్కెట్‌లో టన్ను రూ. ఏడు వేలు ఉండగా, పంట అమ్మగా రూ.10 లక్షలు వచ్చాయి. ఖర్చులు పోను ఐదు లక్షలు నికర లాభం ఆర్జించారు ఈ రైతు. మండల వ్యాప్తంగా ములకలపల్లి, కమలాపురం, జగన్నాథపురం, తిమ్మంపేట, రాజుపేట తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో రైతులు పుచ్చ పంట సాగు చేశారు. వారందరిలో తిరుపతిరెడ్డి ఒక్కరే మల్చింగ్ విధానంలో సాగుచేసి లాభం గడించడం విశేషం.
వసుధ రకం పుచ్చ సాగుకు ఎకరానికి ఐదు ట్రక్కుల పశువుల ఎరువు, 50 కేజీల వేపపిండి, 50 కేజీల ఆముదం పిండి, 50 కేజీల పొటాష్, 50 కేజీల డీఏపీ, యూరియా 100 కేజీలు వాడాను. డ్రిప్, మల్చింగ్ విధానంతో ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పంట దిగుబడి వచ్చింది. సాధారణ పద్ధతిలో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పంట మాత్రమే దిగుబడి వస్తుందన్నారు ఆ రైతు.