GREEN GRAM: పెసరలో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకొని మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఎకరాకు అయిదారు క్వింటాళ్ల దిగుబడులు పొందే వీలుంటుంది. పెసరలో సాగుచేసే రకాన్ని బట్టి రెండు నుంచి రెండున్నర మాసాల్లోనే పంటవస్తుంది. తేలిక పాటి నేలల్లో కూడా పెసర సాగుచేసుకోవచ్చు. ఇది పప్పుధాన్యపు పంట గనుక నెలలో నత్రజనిని స్థిరీకరించడం వల్ల భూసారం పెంపొందుతుంది. తెలంగాణాలో మధిర, వరంగల్ పరిశోధనా స్థానాల్లో పెసర పంటపై పరిశోధనలు జరుగుతున్నాయి. అందువల్ల రైతులు అక్కడి శాస్త్రవేత్తలను సంప్రదించి సిఫారసు చేసిన వంగడాలు ఎంచుకొని, సరైన యాజమన్య పద్ధతులు చేపడితే రెండు, రెండున్నర నెలల్లోనే మంచి దిగుబడి, ఆదాయం పొందే వీలుంటుంది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్న రకాలు, వాటి గుణగణాలు ఇలా ఉన్నాయి.
అనువైన రకాలు:
పెసర పంటను యాసంగి(రబీ)లో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. తెలంగాణాలో యాసంగిలో సాగుకు ఎం.జి.జి.-385, ఎం.జి.జి.351, ఎం.జి.జి.-347, ఎం.జి.జి.-348, ఎం.జి.జి.-295, డబ్ల్యు.జి.జి.-42, ఐ.పి.ఎం. 2 -14, టి.ఎం.96-2 వంటి రకాలను ఎంపిక చేసుకోవచ్చు.
రకాల లక్షణాలు:
>ఎం.జి.జి.-385: ఈ రకం మొక్కలు గుబురుగా పెరుగుతాయి. కాయలు, గుత్తులుగా మొక్కల పైభాగాన వ్యాపించి ఉంటాయి. ఒకేసారి కాయ కోతకు వచ్చే రకం. గింజలు మధ్యస్థ లావుగా, ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మొవ్వుకుళ్ళును, ఆకుముడతను సమర్థంగా తట్టుకుంటుంది.
>ఎం.జి.జి.- 295: ఈ రకం పైరులో కాపు మొక్క పైభాగాన ఉంటుంది. గింజలు మధ్యస్థ లావుగా, సాదాగా ఉంటాయి. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. మొవ్వుకుళ్ళును కొంత వరకు తట్టుకుంటుంది.
>ఎం.జి.జి.-351: పొడవైన కాయలు కలిగిన సాదా గింజ రకం. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
>ఎం.జి.జి.-347: ఈ రకం మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయలు మొక్క పైభాగాన ఉంటాయి. గింజలు లావుగా ఉంటాయి. సాదా గింజ రకం. మొవ్వుకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది.
>ఎం.జి.జి.-348: ఈ రకం మొక్కలు పొట్టిగా ఉంటాయి. అంతర పంటగా సాగుకు అనువైన రకం.
>డబ్ల్యు.జి.జి.-42: ఈ రకం 60 రోజుల్లోనే పంట వస్తుంది. కాయలు పొడవుగా ఉంటాయి.గింజలు లావుగా మెరుపుతో ఉంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
>టి.ఎం.96-2: అధిక తేమను, బూడిద తెగులును తట్టుకుంటుంది. ఐ.పి.ఎం. 2 -14: ఈ రకం మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. పాలిష్ రకం. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
ALSO READ:Redgram: కంది పంటలో నిప్పింగ్ చేస్తే అధిక దిగుబడి !