Thummala Nageswara Rao: వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మరియు వాటికి సంబంధించిన తీసుకోవాల్సిన సన్నాహాక చర్యలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, సీసీఐ సీఎండి శ్రీ లలిత్ కుమార్ గుప్త, వారి బ్రాంచ్ మేనేజర్లు, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ ఉదయ్ కుమార్, వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపీ, డైరెక్టర్ పరిశ్రమలు శ్రీ మల్సూర్, డైరెక్టర్ అగ్నిమాపక శాఖ శ్రీ నారాయణరావు, జాయింట్ కమిషనర్ రవాణాశాఖ శ్రీ రమేష్, వేర్ హౌసింగ్ చైర్మన్ శ్రీ రాయల నాగేశ్వరరావు, కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రవీందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీ రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గారు తెలంగాణలో మరియు దేశంలో ప్రత్తి సాగు వివరాలు, దిగుబడి వివరాలు, గత సంవత్సరం జరిగిన విక్రయాలు, ఎదుర్కొన్న సమస్యలు మున్నగువాటిని వివరించారు. ఎండీ, సీసీఐ గారు మాట్లాడుతూ, తెలంగాణలో కొనగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలు, ట్రాన్స్ పోర్టులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తావిస్తు, తాము ప్రత్తిని సేకరించేందుకు ప్రభుత్వ సూచనల ప్రకారం పనిచేస్తామని, కొనుగోలులో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు.
అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, సీసీఐ వారు తీసుకొచ్చిన వెయిటేజ్ పద్దతుల్లో (కొత్త విధానం) ఫలితంగా జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారు అమలుచేసే పద్దతి వల్ల రైతులు 5 కి.మి నుండి 10 కి.మి దూరం పైగా వెళ్ళి విక్రయాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈసారి మద్ధతు ధర 500 రూపాయలు పెరిగింది, కావున కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశముందని, రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవల్సిందిగా సూచించారు.
Also Read: Insects in Cotton Crop: పత్తి పంటలో రసం పీల్చు పురుగుల సమస్య – నివారణ
గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ, సీసీఐ మరియు కాటన్ అసోసియేషన్ సభ్యులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం తీసుకునేవిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా, చట్టం పరిధిలో కల్పించే అన్ని వసతులు కల్పిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఇంతకుముందున్న స్టేట్ కాటన్ వెల్పేర్ మరియు జిల్లా కమిటీలలో అసోసియేషన్ ప్రతినిధులను, రైతుల ప్రతినిధులను కూడా చేర్చుకోవల్సిందిగా సూచించారు.
సీసీఐ ఎండీ గారు మాట్లాడుతూ వెయిటేజ్ లేదా గ్రేడింగ్ అనేది జిన్నింగ్ మిల్లులకు ప్రాధాన్యతా క్రమంలో పత్తిని కేటాయించడానికే కానీ, అంతకంటే మంచి పద్ధతి ఏమైనా ఉంటే దానిని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
మంత్రివర్యులు స్పందిస్తూ, ప్రభుత్వం చట్టం ప్రకారం ఉన్న రూల్స్ ను పాటిస్తూ, మానవీయకోణంలో పనిచేయాలని, ఏ శాఖ పనిచేసిన రైతుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని అందరికి సూచించారు.
అంతేగాక ఈ సంవత్సరం సాంకేతికంగా తీసుకొచ్చే మార్పులు అనగా payment tracking systemతో రైతులకు మరియు mobile app సౌకర్యాలతో మిల్లర్లకు కొనుగోళ్ళలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.