Tribal Farmer Success Story: వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపికయిన వినీత – వృధాగా పోతున్న జలాన్ని ఒడిసి పట్టి వినియోగిస్తున్న వైనం దేశీయ విత్తనాలను అభివృద్ధి చేస్తున్న కృషీవలుడు- ఏడాది పాటు పంటలతో ఆర్థికంగా లాభపడుతూ ఆధర్శంగా మారిన గిరి రైతు అందమైన భానోదయాలు, ఆహ్లాదకరమైన పచ్చని కొండల్ని పెనవేసుకుపోయిన మంచు తెరలు.. స్వర్గమే భువికి దిగినట్టు మైమరిపించే అందాలు.. ఎదురుగా వచ్చి పలకరించే మేఘ మాలికలు.. వీటిని ఆనుకుని ఉంది ఒక ఆదివాసీ పల్లె.. ఆ గ్రామ సమీపంలో విస్తరించి ఉన్న సారవంతమైన భూములు. ప్రకృతి ప్రసాదించిన ఆ భూముల్లో సిరులు పండిస్తోంది గిరిజన రైతు వినీత. వృధాగా పోతున్న జలాన్ని ఒడిసి పట్టి, ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా పలు పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పోషకాలు పుష్కలంగా ఉండే దేశీయ విత్తనాలను తన సాగులో వినియోగిస్తూ, గ్రామంలోని రైతులకూ అందజేస్తోంది. ఇలా తను ఆర్థికంగా లాభపడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వినీతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం “వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని” అందించి, తన ప్రతిభను చాటి చెప్పింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, దుంబ్రిగుడ మండలం, బయలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు వినీత. తనకు భర్త బాలకృష్ణతో పాటు ఇద్దరు పిల్లలు, అత్తమామలున్నారు. వీరికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ ప్రాంతం వర్షాధారం కావడంతో ఏటా ఖరీఫ్ లో పంటలు సాగు చేసి, రబీలో భూమిని ఖాళీగా వదిలేసేవారు. దీంతో అంతంత మాత్రంగా ఆదాయం రావడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడేది. ఖాళీగా ఉండే భూమిపై నేరుగా సూర్యరశ్మి తగలడం వల్ల సారవంతాన్ని కోల్పోతుండేది.
ఇదే సమయంలో రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తూ చర్యలు తీసుకుంది. సాగులో వారికి సలహాలు అందజేసింది. ఏడాది పాటు పంటలు సాగు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించి తోడ్పాటునందించింది. దీనిని అందిపుచ్చుకున్న వినీతా బాలకృష్ణ దంపతులు కిలోమీటర్ దూరంలో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు నిర్ణయించారు. కొంత ఆర్థిక భారమైనా వెనుకంజ వేయకుండా పైపులు ఏర్పాటు చేసుకుని నేరుగా పంట భూమికి నీరు అందేలా చర్యలు తీసుకున్నారు.
సాగుకు అవసరమైన నీటి లభ్యత ఉండటంతో నిరంతరం పలు పంటలు సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఒక పంట పూర్తయిన తర్వాత దానిని ఖాళీగా వదిలేయకుండా వేరే పంటను సాగు చేస్తూ ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఈ సాగుకు పోషకాలు అధికంగా ఉండే దేశీయ విత్తనాలను అనుసంధానం చేస్తున్నారు. ఇలా సంవత్సరమంతా వివిధ రకాల పంటల నుంచి వచ్చిన దిగుబడులను తన కుటుంబ అవసరాలకు వినియోగించుకుని, మిగిలిన ఉత్పత్తులను విక్రయిస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వినీత దంపతులు సాగులో వినియోగిస్తున్న దేశీయ విత్తనాలను గ్రామస్తులకు అందించి, పరోక్షంగా వాటిని అభివృద్ధి చేసేందుకు దోహదం చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టి వచ్చిన ఉత్పత్తులను తమ ఇంటి అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా ఏటా లక్ష రూపాయల వరకు ఆదా చేస్తున్నారు. రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ కారణంగా కుటుంబం మొత్తం మెరుగైన ఆరోగ్యం పొందడమే కాకుండా పోషకాలతో కూడిన భూమిగా మార్చకుని పరోక్షంగా ప్రకృతి ప్రగతికి దోహదం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఏటా అందించే వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్ మెంట్ పురస్కారానికి వినీతను ఎంపిక చేసి సత్కరించింది.