Success Story: మన రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతుల్లో ఎక్కువ శాతం సన్న, చిన్న కారు రైతులే. వీరు తమకు ఉన్న ఒకటి, రెండు ఎకరాలలో వరి మరియు వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కూలీలు లభించకపోవడం మరియు అధిక సాగు ఖర్చు లాంటి సమస్యల వలన ఆశించిన ఆదాయం రావట్లేదు. రైతుల శ్రమ వృధాగా మారుతుంది. ఈ క్రమంలో బోరు కింద పత్తి, మిరపకు బదులుగా అధిక సాంద్ర జామ ధామ పంటను సాగు చేస్తూ ఎక్కువ నికర ఆదాయం సాధించవచ్చు అని మహబూబాబాద్ మండలం, మల్యాల గ్రామానికి చెందిన గోగుల వెంకన్న నిరూపించారు.
గోగుల వెంకన్న 2వ తరగతి వరకు చదువుకున్నారు. మొదట తనకున్న మూడు ఎకరాల భూమిలో పత్తి పంటను సాగు చేసేవారు. చీడ పీడల బెడద, కూలీల సమస్యలతో భూమిని కౌలుకు ఇచ్చి తాను భవన నిర్మాణ కార్మికుడిగా వుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కాని వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో తనకున్న 3 ఎకరాలలో 2 ఎకరాలలో అధిక సాంద్ర దామ్ జామను పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. కృషి విజ్ఞాన కేంద్రం, మల్యాల శాస్త్రవేత్తల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు, ఎరువులు, నీటి యాజమాన్యాన్ని డ్రిప్, ఫెర్టిగేషన్ ద్వారా అందిస్తున్నాడు. రైతు వెంకన్న మొదట వేసవి దుక్కుల తరువాత నేలను ట్రాక్టరుతో దున్ని రోటావేటరుతో నేలను చదును చేసుకొని, పొలంలో 3 ట్రక్కుల పశువుల ఎరువును వేసుకున్నారు. బెడ్ పైన 8I8 అడుగుల దూరంలో ఎకరాకు సుమారు 1,000 మొక్కలను అధిక సాంద్ర పద్ధ్దతిలో నాటుకున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను అందిస్తున్నారు. కలుపు నివారణకు పవర్ వీడర్‌తో అంతరకృషి చేస్తున్నారు. సస్యరక్షణలో భాగంగా పండు ఈగ నివారణకు పండు ఈగ ఆశించిన పండ్లను చెట్ల నుండి తొలగించి మలాథియాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసారు. రైతు 18 నెలు వయసుగల మొక్కలను నాటుకోవడం జరిగింది. నాటిన 6 నెలల నుండి కాత కాయడం మొదలైంది. ప్రతి రెండు నెలలకోసారి కాయ కోతనాంతర కొమ్మ కత్తిరింపులు చేస్తే ఏడాదిలో 6 సార్లు కొమ్మ కత్తిరింపుల వల్ల కొత్త కొమ్ములపై చిగుళ్ల మొగ్గల నుండి కాయలు వస్తాయి. ఇప్పటి వరకు ఎకరాకు 9 టన్నుల దిగుబడిని సాధించారు. తన తోట జిల్లా కెేంద్రం దగ్గరగా ఉండటం వల్ల చిరు వ్యాపారులు తోట దగ్గరికే వచ్చి తీసుకెళ్తున్నారు.
Also Read: పశు గ్రాస పంచాంగము
జామ సాగు ఖర్చు ఎకారాకు రూపాయల్లో (Guava Cultivation)
దుక్కి దున్నడం, బోదెలు 8,500/`
మొక్కల ధర 25,000/`
గుంటలు చేయుట, మొక్కలు నాటుట 13,000/`
అంతర కృషి 2,500/`
ఎరువులు 24,000/`
పరుగు మందులు 5,050/`
కొమ్మ కత్తిరింపులు 6,000/`
84,000/`
దిగుబడి 9 టన్నులు
స్థూల ఆదాయం 2,25,000/`
నికర ఆదాయం 1,41,000 /`
ఎన్. కిషోర్ కుమార్, ఎస్. మాలతి, ఇ రాంబాబు, బి. క్రాంతి కుమార్,
ఎ. రాములమ్మ, డి. ఉషి శ్రీ
కృషి విజ్ఞాన కేంద్రం, మల్యాల, మహబూబాబాద్ జిల్లా.
Also Read: వ్యవసాయ ఉత్పత్తికి గ్రీన్ హౌస్ టెక్నాలజీ