Woman Farmer Sucess story: మునుముందు వ్యవసాయరంగం కీలకం కానుంది. పై చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు సైతం వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలను వదులుకుని వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకుంటుంది ప్రస్తుత యువత. సంప్రదాయ సాగుకు ఫుల్ స్టాప్ పెట్టి సేంద్రియ పద్దతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాశ్మీరుకు చెందిన ఇన్షా రసూల్ దక్షిణ కొరియాలో PHD అభ్యసిస్తుంది. అయితే తాను చదువుకునే కాలేజీ యాజమాన్యం ఆమెను ఆపేందుకు ప్రయత్నించారట. దీంతో నాకు 6 నెలల సమయం ఇవ్వాలని, సేంద్రియ వ్యవసాయంలో విజయం సాధించకపోతే మళ్ళీ తిరిగి కాలేజీలో చేరుతానని చెప్పి 2018 లో దక్షిణ కొరియా నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని తన స్వస్థలమైన బుద్గామ్‌కు తిరిగి వచ్చింది. ఆమెకు వ్యవసాయంపై ఇష్టం కారణంగా ఆమె తన phd ని వదులుకుని స్వదేశానికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమె సేంద్రీయ కూరగాయలను విక్రయించే హోమ్‌గ్రీన్స్ పేరుతో ఓ సంస్థను కూడా ప్రారంభించింది.
ఆమెకు ఉన్న 3.5 ఎకరాలు భూమిలో ఇంట్లో వాడుకునేందుకు కూరగాయల పంటలను సాగు చేయడం మొదలు పెట్టింది. వ్యవసాయంలో మెళుకువలు తెలుసుకునేందుకు ఆమె అందుబాటులో ఉండే రైతుల వద్దకు వెళ్లి వివరాలు తీసుకునేది. అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువును కొనుగోలు చేయడం, వ్యవసాయ పనులను చేయడానికి కూలీలను నియమించడం చేసింది. మొదట్లో అనేక రకాల విత్తనాలతో పంటలు పండించే క్రమంలో ప్రయోగాలు చేసింది. అయితే అనేక వైఫల్యాలు ఎదుర్కొంది. కొన్ని సార్లు విత్తనాలు కూడా మొలకెత్తలేదని చెప్తుంది ఇన్షా. కొనుగోలు చేసిన ఎరువు పనిచేయదు. విత్తనాలు తప్పుడు సీజన్ లో నాటడం ఇలా అనేక ప్రయోగాలు చేస్తూ ఆరునెలలు దాటిపోయాయి. అయినప్పటికీ తిరిగి చదువు కోసం దక్షిణకొరియా వెళ్ళాలనుకోలేదు.. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ప్రారంభంలో వ్యవసాయంలో నష్టపోయినప్పటికీ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందులో భాగంగా విదేశీయులు పండించే పంటలను ఎంచుకుని సేద్యంలోకి దిగింది. రొటీన్ పంటలకు బదులుగా ఇతర పంటలను టచ్ చేసింది. త్వరగా పెరిగే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, మూలికలు, మెంతులు మొదలైన పంటలతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది ఇన్షా. ఇక తెగుళ్ల నివారణకు అంతర పంటల పద్ధతిని కూడా అవలంబించింది, కూరగాయల మధ్య వెల్లుల్లి, సాధారణ రేగుట వంటి తెగుళ్లను నియంత్రించే మొక్కలను పెంచడం మొదలు పెట్టింది.
ఇన్షా సేంద్రియ పద్ధతినే ఎంచుకోవడం వలన ఆమె సొంతంగా మందులు తయారు చేయడం ప్రారంభించింది. పురుగుల మందులుగా వేపనూనె, మిరపకాయ, ఉల్లిపాయలు , వెల్లుల్లి వంటి వాటిని పులియబెట్టిన మిశ్రమాన్ని తయారు చేసి పంటలకు ఉపయోగిస్తుంది. పండిన పంటను ఇన్షా తన ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ పేద్వారా విక్రయిస్తుంది . పోస్ట్‌ను అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే చాలా వరకూ అమ్ముడవుతున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఆమె మాట్లాడుతూ… నేను గత నవంబర్ డిసెంబర్‌లలో దాదాపు 8 లక్షలు సంపాదించాను. ఫ్రెంచ్ బీన్స్,బఠానీల ద్వారా అధిక లాభాలు వచ్చాయి. ఆమె రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. తాజా వ్యవసాయ పద్ధతులలో రైతులకు శిక్షణ ఇస్తుంది. గతంలో రైతులు బ్రకోలీని కిలో రూ.30కి అమ్మేవారు. ఇప్పుడు వారు రూ. 100 ఆదాయాన్ని పొందుతున్నారు. ఇన్షా త్వరలో పౌల్ట్రీ విభాగాన్ని ప్రారంభించాలని, మరిన్ని పంటలను పండించాలని భూమిని కొనుగోలు చేయాలనీ భావిస్తోంది.