రైతులువార్తలు

Processing Of Pulses: పప్పుధాన్యాల ప్రాసెసింగ్ తో ఆదాయం, ఆరోగ్యం

0
Processing Of Pulses
Pulses

Processing Of Pulses: అపరాల సాగుతో నేల ఆరోగ్యం, కర్బన ఉద్గారాల తగ్గింపుతో పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ విలువ జోడింపుతో గ్రామీణ ఉపాధి, విరివిగా వివిధ రకాల పప్పు ధాన్యాలతో తయారుచేసిన ఆహార ఉత్పత్తులు తినడం ద్వారా ప్రజలకు పోషకాహార భద్రత, ఆరోగ్యం దొరుకుతుంది. మన దేశంలో సుమారు 31.03 మిలియన్ హెక్టార్లలో వివిధ రకాల పప్పుధాన్యాల పంటలను సాగు చేస్తున్నాం. తద్వారా సుమారు 27.69 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. తెలంగాణలో సుమారు 1.5 మిలియన్ హెక్టార్లలో వివిధ రకాల అపరాలు సాగు జరుగుతోంది. వీటిలో ముఖ్యంగా కందులు, శనగలు,పెసర్లు, మినుములు, ఇతర అపరాలు సాగు చేస్తున్నారు. తద్వారా సుమారు ఒక మిలియన్ టన్నుల అపరాల ఉత్పత్తి జరుగుతుంది. సంవత్సరానికి దేశంలో తలసరి అపరాల వినియోగం సుమారు 8.76 కిలోలు. తెలంగాణలో సంవత్సరానికి అవసరం సుమారు 18.3 కిలోలు ఉండగా, తలసరి అపరాల లభ్యత సుమారు 7.06కిలోలు మాత్రమే ఉంది. మరోవైపు భారత వైద్య పరిశోధనా మండలి సూచించిన తలసరి పప్పు వినియోగం సంవత్సరానికి సుమారు 29.2 కిలోలు. పై విషయాన్ని మనం పరిశీలించినట్లయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ (25%) జిల్లా అపరాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్ నగర్ (16.1%), మెదక్ (15.3%), వరంగల్ (12%), నల్లగొండ(8%), రంగారెడ్డి (6%) జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ఆహారశుద్ధి పారిశ్రామిక మండలిలో ఈ ఉమ్మడి జిల్లాల్లో అపరాల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పినట్లయితే రైతులకు చేయూత అందిస్తూ, పప్పుధాన్యాల పారిశ్రామిక అభివృద్ధి జరిగినట్లయితే రాష్ట్ర వినియోగానికి కావలసిన వివిధ అపరాలతో పాటు పోషకాహార భద్రత కూడా సాధ్యపడుతుంది. అపరాలు సాగు చేసే ప్రాంతాల్లో భారీ, చిన్న, మధ్య తరహా పప్పు మిల్లులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పప్పు ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకతలో మనదేశం ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తుంది. సులభంగా లభ్యమయ్యే పప్పులతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, భోజనాలు, స్నాక్స్ కు భవిష్యత్తులో మంచి డిమాండ్ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో పప్పులతో తయారు చేసిన ప్రోటీన్లు ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంది.

Also Read: Groundnut: వేరుశనగలో జిప్సం వేస్తె అధిక దిగుబడులు !

అపరాలు లేదా పప్పుధాన్యాలకు ఆహారశుద్ధి ద్వారా విలువ జోడించడం వల్ల దిగువ ప్రయోజనాలున్నాయి.

  •  రాష్ట్రంలో రైతులను పంట వైవిధ్యం కోసం పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించడం
  •  ఇతర రాష్ట్రాల నుంచి పప్పుధాన్యాల దిగుమతులను తగ్గించడం
  • పప్పు ధాన్యాల దిగుబడులు అధిక మొత్తంలో మార్కెట్లోకి వచ్చిన సమయంలో సరైన గిట్టుబాటు ధర రైతులకు లభిస్తుంది.
  •  మార్కెట్లో పప్పుల ధరల అధిక రిటైల్ ధరల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి
  •  వివిధ రకాల పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి చేసే విధంగా ఎదగడం
  • పప్పు ధాన్యాల ద్వారా పోషకాహార భద్రత కోసం వివిధ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, అధిక లాభాన్ని గడించడం.
  •  క్షేత్రస్థాయిలో దాల్ మిల్లింగ్ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన, సహకార రైతు సంఘాలను ప్రోత్సహించడం.
  •  అల్ట్రా మోడల్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా నాణ్యమైన పప్పు,శెనగపిండి, స్నాక్స్, ఇనిస్టెంట్ ఆహార పదార్థాలు, సంప్రదాయ తినుబండారాలు తయారుచేయడం ద్వారా అధిక లాభాలను గడించడం.
    పప్పు ధాన్యాల సాగు, ఆహారశుద్ధి ఎందుకు అవసరం ?
  •  పప్పుధాన్యాలు అన్ని స్థాయిలలో ఆహారం, పోషక భద్రతకు దోహదం చేస్తాయి.
  •  గ్రామీణ జనాభాకు కావలసిన ముఖ్యమైన పోషకాలు, ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు, విటమిన్లు అందించడంలో ఎంతో దోహదపడతాయి.
  •  దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయం నివారణకు పప్పుధాన్యాలు సిఫార్సు చేస్తున్నారు.
  •  పప్పుధాన్యాలు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి. వాతావరణ మార్పులను తట్టుకుంటాయి
  •  తక్కువ నీటి అవసరంతో ఎక్కువ మోతాదులో సాగుచేయవచ్చు. పప్పుధాన్యాలు అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇతర ప్రోటీన్ల ఉత్పత్తికయ్యే నీటి వినియోగంతో పోలిస్తే అపరాల ప్రోటీన్ల ఉత్పత్తికి కేవలం 10 శాతం మాత్రమే నీటిని వినియోగించుకుంటాయి.
  •  పప్పుధాన్యాలలోని పోషక విలువలు తగ్గకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు
  •  అపరాల సాగు ద్వారా పంట మార్పిడి చేపట్టడం వల్ల నేల కోత, భూసార క్షీణత తగ్గించి ఆరోగ్యమైన నేల తయారీకి ఉపయోగపడతాయి.
  •  ముఖ్యమైన పంటల్లో అంతర పంటగా, పంట మార్పిడిలో ప్రధాన పంటగా అపరాలు సాగు చేసినట్లయితే ఎక్కువ మట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
  •  పప్పు ధాన్యాలు సాగు చేసినట్లయితే నేలలో జీవవైవిద్యం మెరుగుపడుతుంది. సూక్ష్మజీవుల ద్వారా నేలలో నత్రజని స్థాపన కూడా జరుగుతుంది.

పప్పుధాన్యాల ప్రాసెసింగ్:

Processing Of Pulses

Processing Of Pulses

అపరాల ప్రాసెసింగ్ లో ప్రధానమైనది పప్పు మిల్లింగ్. దీనిలో భాగంగా వివిధ రకాల అపరాలను చెత్తాచెదారం లేకుండా ఫ్రీ క్లీనింగ్ యంత్రం ద్వారా శుభ్రపరిచి గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత పప్పు మిల్లింగ్ లో మొదటి దశ ఫ్రీ ట్రీట్మెంట్. తరువాత పొట్టు తీయడం.పప్పుగా విడగొట్టడం. విడిపోయిన పప్పును పాలిష్ చేసి ప్యాకింగ్ చేయడం. ముఖ్యంగా పప్పుధాన్యాలలో తేమశాతం 14-16% కంటే ఎక్కువగా ఉండరాదు. అపరాలను పప్పుగా మార్చిన తర్వాత కూడా పప్పులో తేమ శాతం 14 కంటే మించరాదు. ఒక శనగపప్పులో మాత్రమే 16% కన్నాఎక్కువ తేమ ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతుల్లో వివిధ అపరాలను ఫ్రీ ట్రీట్మెంట్ లో భాగంగా తడి లేదా పొడి పద్ధతి ద్వారా స్టోన్ చెక్కి (ఇసురాయి)తో పప్పు తయారు చేస్తారు. తడి పద్ధతిలో పప్పుధాన్యాన్ని నిర్దిష్ట కాలం పాటు నీటిలో నానపెట్టడం, మిల్లింగ్ కు ముందు ఎండబెట్టడం వల్ల ధాన్యం పొట్టు వదులుగా మారి మిల్లింగ్ సమయంలో సులభంగా ఊడిపోతుంది. పొడి పద్ధతిలో పప్పు మిల్లింగ్ కు ముందు పప్పుధాన్యాన్ని మెల్లగా దంచి కొద్దిగా ఆయిల్, నీటితో ఫ్రీ ట్రీట్మెంట్ చేసి కొద్దికాలం పాటు కండిషనింగ్ చేస్తే కూడా ధాన్యంపైన ఉన్న పొట్టును సులభంగా తీయవచ్చు. ఇటువంటి శాస్త్రీయ ప్రామాణికంని తీసుకొని వివిధ సామర్థ్యం కలిగిన అల్ట్రా మోడల్ పప్పు మిల్లు యంత్రాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య విలువచేసే మిల్లు ద్వారా రోజుకు ఒక టన్ను పప్పు ఉత్పత్తి చేయవచ్చు. శనగపప్పు తయారు చేసిన తరువాత దాని నుంచి మనం శెనగపిండి తయారుచేసి మార్కెట్ చేసినట్లయితే మరింత ఆదాయం లభిస్తుంది.

ఎ. పోశాద్రి, డి.మోహన్ దాస్, జి. శివ చరణ్, కె. రాజశేఖర్, ఎం. సునీల్ కుమార్, వై. ప్రవీణ్ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్.

Also Read: Redgram: కంది పంటలో నిప్పింగ్ చేస్తే అధిక దిగుబడి !

Leave Your Comments

Soyabean: సోయాచిక్కుడులో పల్లాకు తెగులు..

Previous article

Kharif Crops: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల్నిఏయే చీడపీడలు ఆశిస్తున్నాయి ? తీసుకోవాలిసిన జాగ్రత్తలు?

Next article

You may also like