రైతులువ్యవసాయ పంటలు

Heavy Damages To Crops: అకాల వర్షాలు, వడగళ్ల వానలు ఈదురుగాలులు వల్ల వివిధ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

1
Heavy Damages To Crops Due to Rains
Heavy Damages To Crops Due to Rains

Heavy Damages To Crops: ఇరు తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా పండిరచే వరి, మొక్కజొన్న, సజ్జ, వేరుశనగ, నువ్వులు, కూరగాయ పంటలైన టమాట, సొరకాయ , బీరకాయ మొదలగు మరియు పండ్ల పంటలైన మామిడి, జామ, నిమ్మ, కర్బూజా, పుచ్చకాయ మొదలగు పంటలలో అకాల వర్షాలు, వడగళ్ల వలన, ఈదురుగాలులు వలన వివిధ పంటల్లో నష్టం జరిగినది. పూతదశలో ఉన్న పంటల్లో పూత రాలిపోయింది, బలమైన ఈదురుగాలులతో కాయలు, పండ్లు, గింజలు రాలిపోయాయి. ముఖ్యంగా పంటల్లో చీడపీడలు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడినది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వివిధ పంటలలో తెగుళ్లు, పురుగులు వ్యాప్తిచెందే అవకాశం ఉన్నది కావున తెగుళ్లు మరియు పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి ఈ కింది చెప్పే పంటలలో రైతులు తెలుసుకోవలిసిన ఆవశ్యకత ఏంతో ఉంది.

1. వరి పంట :
ప్రస్తుతము ఈ పంట వివిధ దశలలో ఉన్నది. మొదటిగా నాటు వేసిన రైతుల పొలాల్లో గింజలు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ఎక్కువ నీటిని బయటికి తీసివేయవలెను. ఈ నేలలో ఎక్కువ నీరు ఉండడం వల్ల నేల ద్వారా వ్యాపించే తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచు పురుగు, అగ్గితెగులు, మానిపండు తెగులు, కాండంకుళ్లు మరియు గింజ మచ్చ తెగులు వచ్చే అవకాశము ఉన్నది. ఈ కాండంకుళ్లు తెగులును నివారించడానికి 3 గ్రాముల కాపర్‌ అక్షీక్లోరైడ్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి మొదలు తడిచే విధంగా పిచికారి చేయవలెను. అగ్గి తెగులు లక్షణాలు వలన ఆకులపైన నూలుకండాకారంలో మచ్చలు, ఈనిక దశలో నల్లని మచ్చలు, గింజలుపైన నల్లని మచ్చలు ఏర్పడతాయి.

ఈ మచ్చల ఉధృతి గుర్తించిన వెంటనే రైతులు ఒక లీటరు నీటిలో 0.6 గ్రాముల ట్రైసైక్లోజోలును కలిపి పిచికారి చేయవలెను. రెండవసారి 1.5 మి.లీటర్లు ఐసోప్రోథియోలిన్‌ కలిపి పిచికారి చేయవలెను. వెన్ను దశలో వరి పంట ఉన్నప్పుడు మానిపండు తెగులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మానిపండు తెగులు నివారణకు లీటరు నీటికి ఒక మి.లీ. ప్రొపికోనజోల్‌ను కలిపి పిచికారి చేయవలెను. గింజ మచ్చ తెగులు రాకుండా ఉండడానికి ఒక లీటరు నీటిలో 1.0 గ్రాము కార్బెండజిమ్‌ లేదా ఒక మిల్లీలీటర్‌ ప్రొపికోనజోల్‌ ను కలిపి పిచికారి చేయవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు కూడా వచ్చే అవకాశం ఉన్నది . కావున ఒక లీటరు నీటిలో 0.3 మి.లీటర్లు క్యూరోజిన్‌ కలిపి పిచికారి చేయవలెను. కోత దశలో ఉండి పడిపోయిన వరి పంటను పైకి లేపి కట్టలుగా కట్టుకోవాలి. 5 శాతం ఉప్పు నీటిని ఒక లీటరులో కలిపి పిచికారి చేయవలెను అలా చేసిన ఎడల గింజలు మొలకెత్తకుండా ఉంటాయి.

2. మొక్కజొన్న :
మొక్కజొన్న పంటలో అకాల వర్షాల వలన , ఈదురుగాలులు వలన మొక్కజొన్న పంట కింద పడటం జరిగినది. కంకులు ఏర్పడ్డ మొక్కజొన్న నుంచి కంకులు వేరు చేసి గాలిలో ఆరబెట్టవలెను. ఎక్కడ నీరు నిలువ లేకుండా పొలం నుండి తీసివేయవలెను. నీరు ఉండడం వల్ల కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ కాండం కుళ్ళు తెగులు తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ లేదా ఒక గ్రాము కార్బన్డిజం కలిపి మొదలు తడిచే విధంగా పిచికారి చేయవలెను. అధిక వర్షాల వల్ల పంట నష్టపోకుండా పైపాటుగా 40 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ కలిపి ఒక ఎకరానికి వేసుకోవలెను. మొక్కజొన్న పంట నేల మీద పడ్డచో ఆ మొక్కజొన్న కర్రలను వేరు చేసి పశుగ్రాసంగా లేదా వర్మి కంపోస్టుగా వాడవచ్చు. ఎక్కడైతే పూర్తిగా పడిపోయి కంకులు ఏర్పడి ఉంటే ఆ కంకులు తీసివేసి దెబ్బతిన్న పంటను పక్కకు తీసివేయవలెను. వీలైతే తక్కువ దెబ్బతిన్న పంటను పైకి లేపి ఆకులతో చుట్టి నిలబెట్టవలెను.ఈ అధిక వర్షాల వల్ల మొక్కజొన్న పంటలో ఆకు మచ్చ తెగులు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. కావున ఒక లీటరు నీటిలో ఒక మిల్లి లీటరు ప్రొపికోనజోల్‌ కలిపి పిచికారి చేయవలెను.

3.నూనె గింజ పంటలు :
నూనె గింజలు పంటలైన వేరుశనగ మరియు నువ్వు పంటలలో అకాల వర్షాల వలన కొన్ని రకాల తెగులు వచ్చే అవకాశం ఉన్నాయి. వేరుశెనగలో తిక్కాకుమచ్చ తెగులు ఉధృతిని తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్‌ లేదా ఒక గ్రామం కార్బెండజిమ్‌ కలిపి పిచికారి చేయవలెను. కాండంకుళ్ళు తెగులు ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఏక్కువ నీళ్లను పొలం నుండి తీసివేయవలెను. ఈ కాండంకుళ్ళు తెగులు తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ లేదా 1.5 గ్రాము థయోఫనేట్‌ మిథైల్‌ను మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేయవలెను.

4.నువ్వు పంట :
నువ్వు పంటలో ఆకుమచ్చ తెగులు, కాండం, వేరుకుళ్లు తేగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఆకుమచ్చ తెగులు ఉధృతిని తగ్గించుకోవడానికి ఒక లీటరు 2.5 గ్రాముల మాంకోజెబ్‌ లేదా ఒక 4 గ్రామం కార్బెండజిమ్‌ కలిపి పిచికారి చేయవలెను. కాండంకుళ్ళు, వేరుకుళ్లు తెగులు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే నీళ్లను పొలం నుండి తీసివేయవలెను. ఈ తెగులు తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ను మొక్కలు మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేయవలెను .

5. పండ్ల తోటలు :
పండ్ల పంటలో ముఖ్యమైన మామిడి ,జామ, నిమ్మ ,పుచ్చ మరియు కర్బుజా పంటలలో నష్టం జరిగినది.

Also Read: Raja Varaprasad: రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్.!

Heavy Damages To Crops

Heavy Damages To Crops

మామిడి :
మామిడి పంటలో ఈదురుగాలుల వలన కాయలు, కొమ్మలు కింద పడటం జరిగినది. ఈ కాయలను నుంచి మంచి కాయలను వేరుచేసి పాడైపోయిన కాయలను ఒక దగ్గర వేసి కాల్చివేయవలెను. ఎక్కడైతే మామిడి కొమ్మలు విరిగాయో, ఆ కొమ్మలను తీసివేయవలెను . ఎక్కడైతే కొమ్మలకు దెబ్బలు తగిలిన చోట, ఒక లీటరు నీటిలో కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ను కలిపి గాయాలను పూడ్చవలెను. ఈ కాయలను వేరు చేయకపోవడం వలన మామిడి పంటలో ఉంచినట్లైతే మామిడి కాయలకు పండుఈగ వచ్చే అవకాశం ఉన్నది. మామిడిలో తామరపురుగు మరియు తేనే మంచు పురుగుల నివారణకు ఫిప్రోనిల్‌, ఎసిటామిప్రిడ్‌ంవేప నూనేతో కలిపి పిచికారి చేయవలెను.

నిమ్మ :
నిమ్మలో ఈదురుగాలుల వలన కాయలు కింద పడడం జరిగినాయి. ఈ కాయలను నుంచి మంచి కాయలను వేరుచేసి పాడైపోయిన కాయలను ఒక దగ్గర వేసి కాల్చివేయవలెను .

కర్బూజా మరియు పుచ్చ పంటలు :
ఈ కర్బూజా మరియు పుచ్చ పండ్లు వర్షాల వలన పాడైపోయిన, పగిలిన కాయలను ఒక దగ్గర వేసి కాల్చివేయవలెను. ఈ పంట లో నీళ్లు నిల్వ లేకుండా కాలువలు తీసి బయటికి పంపవలెను. ఈ పంటలు పై 19: 19 :19 లేదా 13: 0 :45 కలిపి పిచికారి చేయవలెను.

6. కూరగాయ పంటలు :
కూరగాయ పంటలైన మిర్చి, టమాట, సొరకాయ మొదలుగు పంటల్లో కాయలు దెబ్బలు తినడం జరిగినాయి. మిర్చి పంటలో ఈదురు గాలులు , వడగళ్ల వానవల్ల కాయలు మరియు పూత కూడా రాలడం జరిగినది. అధిక వర్షాల వల్ల పొలంలో నీళ్లు లేకుండా తీసివేయవలెను. ఎక్కడైతే రైతులు కాయలను కోసి కళ్ళాల్లో ఆరబెట్టిన చోట నష్టం జరగడం జరిగినది . ఆ కాయలకు బూజు పట్టకుండా మరియు అఫ్లాటాక్సిన్‌ రాకుండా రైతులు ఎండలో గాలి తగిలేతట్టు ఆరబెట్టవలెను. అధిక తేమ శాతం ఉండడం వల్ల మిర్చి పంటలో కాయకుళ్ళు తెగులు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది కావున ఈ తెగులు తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటిలో ఒక మి.లీ.హెక్సాకోనజోల్‌ను కలిపి పిచికారి చేయవలెను.

అకాల వర్షాల వల్ల, ఈదురుగాలుల వలన కాయలు దెబ్బ తినడం జరిగినది, ఈ కాయలకు ఆస్పరిజిల్లస్‌ లాంటి శిలీంద్రాలు ఆశించడం వలన అఫ్లాటాక్సిన్‌ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కోత తర్వాత తెగులు, పురుగులు ఆశించిన కాయలను, విరిగిన కాయలకు తొలగించకపోవడం, కాయలు కళ్ళాల్లో ఎండుతున్నప్పుడు అకాల వర్షాలు పడినప్పుడు, కాయలు సరిగా ఎండనప్పుడు, తేమ శాతం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో బూజు పట్టడం, అధిక వర్షాల వలన కాయలు తడువడము వలన అఫ్లాటాక్సిన్‌ అబివృద్ధి చెంది మార్కెట్లో రైతులకు తక్కువ ధర పలికే అవకాశం ఉన్నది. కావున రైతులు తడిసిన మిర్చిని ఎండకు మరియు గాలి తగిలేటట్టు విధంగా ఆరబోయవలెను.

కూరగాయ పంటలల్లో నారుకుళ్లు /వేరుకుళ్లు మరియు ఆకుమచ్చ తేగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఆకుమచ్చ తెగులు ఉధృతిని తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారి చేయవలెను.

నారుకుళ్లు /వేరుకుళ్లు తెగులు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే నీళ్లను పొలం నుండి తీసివేయవలెను. ఈ నారుకుళ్లు /వేరుకుళ్లు తెగులు తగ్గించుకోవడానికి ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీిక్లోరైడ్‌ను కూరగాయ మొక్కల మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేయవలెను .

పైన చెప్పిన విధంగా వివిధ పంటలలో వీలైనంత త్వరలో ఎక్కువగా ఉన్న నీటిని కాల్వల ద్వారా బయటికి తీసి వేయవలెను మరియు ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటల్లో తెగుళ్లు, పురుగులు వ్యాప్తిచెందే అవకాశం ఉంది కావున రైతులు తొలిదశలో గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లతై అధిక దిగుబడులను పొందవచ్చు.

Also Read: Mamnoor Kisan Mela 2023: మామునూరు కెవికె ఆధ్వర్యంలో కిసాన్‌ మేళ.!

Leave Your Comments

Raja Varaprasad: రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్.!

Previous article

Watermelon Seeds Health Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

Next article

You may also like