Rain season crops: ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని రైతులు ప్రత్యామ్నయ పంటలైన జొన్న, కొర్ర (సుర్యనంది, మహానoది), సజ్జ, ఉలవ పంటలను ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
* వేరుశనగ పంటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని అంతరకృషి చేసుకోవాలి. అలాగే గరిష్ట పూత దశ లేదా 30 -35 రోజుల వయస్సు పంటలో ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును మొక్కల మొదళ్ళలో వేసి కలియబెట్టాలి.
* రైతులు ఆముదం పంటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని పై పాటుగా ఎకరాకు 6 కిలోల నత్రజని (యూరియా రూపంలో 13 కిలోలు) ఎరువును 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 6 కిలోల నత్రజని 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరొక 6 కిలోల నత్రజనిని విత్తిన 90 నుంచి 95 రోజులకు వేసుకోవాలి. విత్తిన 40-60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. తరువాతి దశలో వచ్చే కలుపును అంతర కృషి చేసి నివారించుకోవాలి.
* ప్రస్తుతo పత్తి పంట పూత దశ నుంచి కాయ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతo అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని నత్రజని, పోటాష్ ఎరువులను ఎకరాకు 10 కిలోల చొప్పున 30, 60 , 90 రోజుల దశలో వేసుకోవాలి. పత్తిలో మెగ్నీషియం లోపాన్ని సవరించడానికి 10 గ్రా.మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున లీటరు నీటికి కలిపి 45 , 75 రోజుల దశలో పిచికారి చేయాలి.
* ప్రస్తుతం నేలలోని తేమను వినియోగించుకుని రైతులు మొక్కజొన్న పంటలో కలుపు యాజమాన్యo చేపట్టాలి. అలాగే 30-35 రోజులకు, 50-55 రోజుల మద్యలో నత్రజని ఎరువును పై పాటుగా వేసుకోవాలి.
* ప్రస్తుతం వరి నాట్లు చేపడుతున్న రైతులు సిఫారసు చేసిన ఎరువులలో ఒకటవ వంతు నత్రజని, మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు చివరి దమ్ములో వేయాలి. నాట్లు వేసిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు వేసుకోవడం వల్ల ఎరువులు వేయటానికి, పిచికారి పనులు చేయడానికి వీలుగా ఉంటుంది.
* అరటి, చీని తోటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి.
డా. ఎం. విజయ్ శంకర్ బాబు
డా. జి. నారాయణ స్వామి
డా. జి.డి. ఉమాదేవి
వ్యవసాయ పరిశోధన స్థానం
అనంతపురం