రైతులువార్తలు

Poultry Diseases During Monsoon: వర్షా కాలంలో కోళ్ళలో వచ్చే వ్యాధులు – నివారణ

1
Poultry Diseases During Monsoon
Poultry

Poultry Diseases During Monsoon: కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించి వాణిజ్య పంతాలో సాగుతుంది. అయితే కాలానుగుణంగా కోళ్లలో అనేక వ్యాధులు వస్తుంటాయి. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలం కోళ్ల పరిశ్రమకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎడతెరిపిలేని వర్షాలు, ఫారాల చుట్టు పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. తడిచే దాణా,పెరిగే తేమ కారణంగా కోళ్లలో నిమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర తెగులు వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి వర్షాకాలంలో ప్రబలే రోగాలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవాలి.

Poultry Diseases During Monsoon

Poultry

వైరస్‌ వల్ల కలిగే వ్యాధులు:

కొక్కెర తెగులు (రానికట్):

పార మిక్సో వైరస్ వల్ల సోకుతుంది. ఏ వయసు కోళ్ళలోనైనా రావచ్చు. వర్షాకాలంలో ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోతాయి. రోగానికి గురైన కోళ్ళు ముడుచుకొని ఉండి రెక్కలు వేలాడదీస్తాయి. పక్షవాతపు లక్షణాలు కనిపిస్తాయి.మెడ వెనక్కి వాలుతుంది. విరేచనాలు తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి.శ్వాసలో కూడా ఇబ్బంది కలుగుతుంది. సన్నని రక్తపు గడ్డల చుక్కలు గిజర్డు,పెరికార్డియంలో కనిపిస్తాయి.పేగులో పొరలు ఎర్రబారటం, సీకా జంక్షన్లో రక్తపు జీరలుంటాయి.పేగుల్లో అల్సర్స్‌ ఉండవచ్చు. నివారణకు మొదటి వారం, 4వ వారం, ఆ తరువాత 6-8 వారాల మధ్య మరొకసారి, చివరిగా 20వ వారం టీకాలు వేయటం వల్ల చాలా వరకు కోళ్ళను ఈ రోగం నుంచి రక్షించుకోవచ్చు.

అమ్మ తల్లి లేదా కోళ్ళ మశూచి (ఫౌల్ ఫాక్స్):

కోళ్లలో అమ్మ తల్లి ఏవి పాక్స్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ దోమలు, రక్తాన్ని పీల్చే ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో ఫారాల చుట్టూ నీళ్లు నిలువబడి ఉండడం వల్ల, లిట్టర్ లో తేమ అధికమవడం వల్ల దోమల సంఖ్య పెరిగి కోళ్లలో ఈ మశూచి వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం అవుతాయి. ఈ వ్యాధి వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం లేదా కోళ్ళు చనిపోవటం జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద, తుమ్మెలకు, కనురెప్పల చుట్టు పోక్కులు ఏర్పడతాయి. అప్పడప్పడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. మొదటిసారిగా 6-7 వారాల వయస్సులో, మరలా 16-17 వారాల మధ్య టీకాలు వేయాలి.

గoబోరో వ్యాధి:

కోళ్ళలో ఈ వ్యాధినే ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్, ఇన్ఫెక్షియస్ బర్సెటిస్ అని కూడా అంటారు. ఇది చిన్న కోడి పిల్లల్లో తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్ కలుగచేసే ఒక వైరల్ అంటువ్యాధి.ఈ వ్యాధికి ముఖ్యంగా 3- 15 వారాల వయసు గల కోడి పిల్లలు ఎక్కువగా లోనవుతాయి. ఎక్కువ మొత్తంలో కోడి పిల్లలు చనిపోతాయి. ఈ వైరస్ సోకినపుడు కోళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రధానంగా ఎడిస్ అనే దోమలు వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. ఫారంలోని వ్యక్తులు, ఉపకరణాల ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. గాలి ద్వారా కూడా వైరస్ సోకుతుంది. వ్యాధి సోకిన కోళ్ళ నుంచి ఇతర కోళ్ళకు వ్యాధి వ్యాప్తిస్తుంది. ఒకసారి ఫారంలో వ్యాధి ప్రబలిన తర్వాత ఆ ప్రదేశంలో వైరస్ 52-155 రోజుల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన కోళ్ళు ఒత్తిడికి గురై, ఆకలి మందగించి, ఈకలు ప్రకాశవంతం కోల్పోయి ఉంటాయి. నీళ్ళ విరేచనాలు, తోక భాగంలో ఈకలు రాలిపోవటం,గాయాలవటం,పెరుగుదల రేటు తగ్గిపోవటం, డీహైడ్రేషన్, సక్రమంగా నడవలేకపోవటం,చలి, వణుకుతో చివరగా కోళ్ళు శక్తిని కోల్పోయి మరణిస్తాయి. కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర వ్యాధులకు లోనవుతాయి. కొన్ని సందర్భాలలో వాక్సిన్ ఫెయిల్యూర్ అవుతుంది. గంబోరో వ్యాధిని వాటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయవచ్చు. చనిపోయిన కోళ్ళకు శవ పరీక్ష నిర్వహించి వ్యాధి తాలుకు ప్రస్ఫుట చిహ్నాలను గుర్తించటం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. గంబోరో వ్యాధికి చికిత్స లేదు. కాని కోళ్ళలో ఒత్తిడి వల్ల కలిగే ఇతర వ్యాధులను నివారించేందుకు ఉపయోగించే యాంటిబయాటిక్, ఒత్తిడిని నిరోధించే మందులను వాడవచ్చు.వాణిజ్య సరళిలో పెంచే కోళ్ళు, బ్రీడర్ కోళ్ళు, దేశవాళీ కోళ్ళకు వ్యాధి రాకుండా 14వ రోజు, 21వ రోజు గంబోరో వ్యాధి టీకాలను ఇవ్వాలి. ఫారంలో శాస్త్రీయ పద్ధతులను, బయోసెక్యూరిటీ ప్రమాణాలను పాటించాలి.

బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు:

సాల్మొనెల్ల పుల్లోరం: చిన్న కోడి పిల్లలు (నాలుగు వారాల లోపు వయసు) ఎక్కువగా గురవుతాయి. ఈ వ్యాధి తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడటం, భారంగా శ్వాసతీయడం, రెక్కలు వాల్చడం గమనించవచ్చు. తెల్లని రెట్ట మలద్వారం వద్ద అంటుకొని ఉంటుంది. గుండె, గిజర్డ్‌, కాలేయం,పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయాటిక్‌ మందులు వాడాలి.

కొలిబాసిల్లోసిస్:షెడ్డు లోపల పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, లిట్టర్ లో తేమ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. బ్రాయిలర్‌ పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంటుంది. ఈశ్చరీషియా కొలై బాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధితో బ్రాయిలర్స్‌లో బరువు సరిగ్గా రాకపోవడం వల్ల నష్టం వాటిలుతుంది.వ్యాధి సోకిన కోడి పిల్లలు నీరసంగా ఉండి మేత సరిగా తినవు. మరణించిన కోడి పిల్లల పేగులు ఉబ్బి ఉంటాయి.యాంటిబయోటిక్స్‌ మందులు మేతలో, నీటిలో వాడితే ఈ వ్యాధి సోకిన పిల్లలను కాపాడవచ్చు.తాగు నీటితో పాటు సానిటైజర్‌ మందును కోళ్ళకు ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.

ఇన్ఫెక్షియస్ కొరైజ :

వర్షాకాలంలో కోళ్ల లిట్టర్ లో తేమ అధికమవడం వల్ల, గాలి, నీరు ద్వారా హీమోఫిల్లస్ పార గాల్లినెరమ్ బ్యాక్టీరియా వృద్ధి చెంది ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోడి పిల్లలు సరిగా నీటిని, మేతను తీసి కోక బరువును కోల్పోతాయి.ముక్కు, కళ్ళనుంచి నీరు కారడం, కళ్ళల్లో ఉబ్బి తెల్లని చీము గడ్డలుగా తయారవుతాయి. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్ లకు ఈ రోగం వస్తూనే ఉంటుంది. ఒక బ్యాచ్లో ఈ వ్యాధి వచ్చినప్పడు కొద్ది రోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లో లాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్‌, ఫినాయిల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి జల్లివేయాలి. లిట్టరు ఎల్లప్పడు పొడిగా ఉండేలా చూడాలి. రోగం సోకిన పిల్లలకు యాంటిబయాటిక్‌ మందులు విటమిన్లతో కలిపి వారం రోజులు వాడిన తర్వాత పూర్తిగా నయమవుతుంది.

శిలీంద్రాల వల్ల కలిగే వ్యాధులు:

అస్పరిజిల్లోసిస్ లేదా అస్పరిజిల్లస్ నిమోనియా:

ఇది అస్పరిజిల్లస్ ఫ్యూమిగేటస్ వల్ల కలిగే వ్యాధి. వర్షాకాలం, చలి కాలంలో అధిక తేమ కారణంగా, దాణా, లిట్టర్లు తడిసిపోయి తద్వారా ఫంగస్ పెరగడానికి, వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కోళ్ళు అస్పరిజిల్లస్ స్పోరులను పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో గాయాలను కలుగచేసి శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి.ఇంటెన్సివ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో కోళ్ళు అధిక సాంద్రతతో ఉండడం,వెంటిలేషన్ సరిగా ఉండక పోవడం వల్ల వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నిస్సత్తువగ ఉండటం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, సైనోసిస్ (నీలం/ఊదా రంగు కోంబ్), స్వరంలో మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసకోశ రేటు పెరుగడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం గమనించవచ్చు. పొడి, మంచి నాణ్యమైన లిట్టర్, పరిశుభ్రమైన దాణా అస్పరిజిల్లోసిస్ ను నివారించడంలో సహాయపడుతాయి. సమర్థవంతమైన యాంటీ ఫంగల్ యాంటిసెప్టిక్‌తో పర్యావరణ స్ప్రే చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.యాంఫోటెరిసిన్-బి, నిస్టాటిన్ వ్యాధి ని తగ్గించడంలో సహాయపడుతాయి.

అంతర పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధి:

కాక్సీడియోసిస్‌ (రక్తపారుడు రోగం):

ప్రోటోజోవా వల్ల సోకే ఈ వ్యాధితో తరచు బ్రాయిలర్‌ కోళ్ళ పరిశ్రమ తీవ్ర నష్టానికి గురవుతుంది. బ్రాయిలర్స్‌ అధిక సంఖ్యలో మరణించడం, రోగం నుంచి కోలుకున్న పిల్లల్లో బరువు సరిగా రాకపోవడం జరుగుతుంది.మేతలో కాక్సిడియోస్టాట్స్‌ సరైన మోతాదుల్లో వాడనప్పుడు, అసలు వాడక పోయినా ఈ వ్యాధి వస్తుంది. 11వ రోజు నుంచి 8వ వారం లోపల ఎప్పుడైనా ఈ వ్యాధి బ్రాయిలర్‌ పిల్లలకు సోకవచ్చు. రోగం సోకిన పిల్లలు మూలలకు గుమిగూడి సుస్తిగా ఉంటాయి. ఎరుపు వర్ణం గల రెట్టను చూడవచ్చు.మేత, నీరు తక్కువ తీసుకొంటాయి. మరణించిన పిల్లల పేగులు ఉబ్బి రక్తం కలిగి ఉంటాయి.మేతలో, నీటిలో కాక్సీడియోస్టాట్‌ మందులు తగు మోతాదులో వాడితే ఈ రోగాన్ని నివారించవచ్చు.

కోళ్లలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు:

పైన పేర్కొన్న రోగాల తీవ్రతను ఈ వర్షాకాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు.

⦁ వర్షాకాలంలో ఏర్పడే తేమ మూలంగా కోళ్లకు పెట్టె దాణా మొక్కజొన్న, చేపల పొడి వంటి పదార్థాలు శిలీంద్రాల వల్ల బూజుపట్టి ఆఫ్లోటాక్సిన్ల ప్రభావానికి లోనై కోళ్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉంటుంది.ఈ ఆఫ్లోటాక్సిన్ ప్రభావానికి గురైన కోళ్లలో గుడ్ల ఉత్పత్తి పడిపోతుంది. అదేవిధంగా బ్రాయిలర్ కోళ్లలో ఎదుగుదల తగ్గిపోతుంది కాబట్టి దాణా దినుసులు జాగ్రత్తగా భద్రపరచుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
⦁ కోళ్ల పెరుగుదలకు 50-55% తేమ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైనప్పుడు కోళ్లలో చర్మ సంబంధమైన సమస్యలు రావడంతో ఈకలు ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వర్షాకాలంలో కోళ్ల షెడ్డుకు ఇరువైపులా పరదాలను వేయాలి.

⦁ డీప్ లిట్టర్ లో లిట్టర్ ముద్ద కట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ లిట్టర్ తడిసిపోయి ముద్దలు కట్టినట్లయితే పొడి సున్నం కలిపి కలియదున్నితే ఆ లిట్టర్ లోని తడిని పొడి సున్నం పీల్చుకొని లిట్టర్ ను పొడిగా ఉండేలా చూస్తుంది. తద్వారా శ్వాస సంబంధమైన అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా తాగే నీటిలో మూడు రోజులు టెట్రాసైక్లీన్ లేదా నియోడాక్స్ ప్రతి లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కోళ్లకు ఇవ్వాలి. కోళ్ల దాణా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోకుండా రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి తయారు చేసుకున్నట్లయితే దాణా లో శిలీంధ్రాలు పెరుగకుండా తద్వారా అప్లోటాక్సిన్ భారిన పడకుండా చూసుకోవచ్చు

⦁ కేజస్ కింద లేయర్ కోళ్ల రెట్ట పోగై వర్షoతో తడిసినప్పుడు ఈగలు,దోమల పెరుగుదలకు కారణమవుతుంది.వీటి వల్ల కోళ్లు అవిశ్రాంతంగా ఉండడం, అలసటకు లోనై గుడ్ల ఉత్పత్తి పై ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ లిట్టర్ పైన ఈగలు, దోమలు చేరకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.షెడ్డులోపల ప్రతి లీటర్ నీటిలో 3-4 మిల్లీలీటర్లు బ్యూటాక్స్ కలిపి పిచికారి చేసి ఈగలు, దోమలను నిర్మూలించుకోవచ్చు.

⦁ షెడ్డులో ఏవైనా కొన్ని కోళ్లకు అంటువ్యాధి సోకినప్పుడు కోళ్ల మొత్తానికి ఒకేసారి చికిత్స లేదా టీకా అందించినట్లయితే అంటూ వ్యాధి ప్రబలకుండా, ఎక్కువ మరణాలు సంభవించకుండా ఉంటుంది.

డా. జె. శశాంక్, డా. ఎన్. రాజన్న, డా. జె. సాయికిరణ్
కె.వి.కె., పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
ఫోన్: 9866922336

Leave Your Comments

Paddy Cultivation in Saline soils: చౌడు భూముల్లో వరిసాగు

Previous article

Rajma Farming: రాజ్మా చిక్కుళ్ల సాగు – విత్తనోత్పత్తి

Next article

You may also like