Kharif Crops: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో(సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు) తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు:
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలి. టమాట పంటను స్టేకింగ్ చేయడం ద్వారా మొక్కలు కింద పడిపోకుండా ఉండి పంట నాణ్యత బాగా ఉంటుంది. వర్షాధార పంటల్లో ఎకరాకు 20-25 కిలోల యూరియా, 10-15 కిలోల పొటాషియం ఎరువులను పైపాటుగా వర్షాలు ఆగిన తర్వాత ఆదించడం ద్వారా అధిక తేమ వల్ల పంటకు కలిగిన ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. ఆలస్యంగా విత్తిన వర్షాధార పంటల్లో అవసరాన్ని బట్టి అంతరకృషి చేసుకోవాలి.
వరి పంటలో:
ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండంతొలుచు పురుగు నివారణకు పైరు పిలకలు వేసే లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు, పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున దీని నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుంచి నీటిని తీసివేయాలి. ప్లాటామైసిన్ 0.2గ్రా. + కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా.+ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో వరిలో ఆకుముడత ఆశించింది.దీని నివారణకు 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.1మి.లీ.ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో అగ్గి తెగులు ఆశించిన చోట్ల ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రాథయోలేన్ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ మాంకోజెబ్ మిశ్రమ మందు 2.5 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో జింక్ దాతువు లోపం కొన్ని ప్రాంతాల్లో గమనించడమైంది. దీని నివారణకు 2గ్రా. జింక్ సల్పేట్ చొప్పున లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. వరిలో సుడిదోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎసిఫెట్ 1.5గ్రా. లేదా డైనోటేఫ్యూరాన్ 0.4గ్రా. చొప్పున లీటరు. నీటికి కలిపి పిచికారి చేయాలి.
పత్తి పంటలో
ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మూడవ దపా, నాల్గవ దపా పైపాటు సత్రజని, పొటాషియం ఎరువులను 60 మరియు 80 రోజుల దశలో పంటకు అందించాలి. ఆలస్యంగా విత్తిన వర్షాధార పంటల్లో చివరి అంతర కృషి తర్వాత గొడ్డుసాళ్లు వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు పత్తిలో వడలు తెలుగు గమనించడమైంది. దీని నివారణకు మురుగు నీటిని తీసివేయడంతో పాటు పైపాటుగా 13-0-45 ఎరువు పది గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి 2- 3రోజుల వ్యవధిలో పిచికారి చేయడంతోపాటు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ నేల తడిచేలా పోయాలి. పత్తిలో పచ్చదోమ, తామర పురుగులు అశించేందుకు అనుకూల పరిస్థితులున్నందున వీటి నివారణకు పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 5 మి.లీ. 1500 పీపీఎం వేపనూనె, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2గ్రా.ఎసిటామిప్రిడ్ లేదా 0.3గ్రా. ఫ్లూనికామిడ్ లేదా 0.75మి.లీ. సల్ఫాక్సాఫ్లోర్ 5మి.లీ.మందును 1500 పీపీఎం వేపనూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పత్తిలో పిండినల్లి గమనించిన చోట్ల నివారణకు పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించి, 3 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2గ్రా. ఎసిఫేట్ +1మి.లీ. ట్రైటాన్ లేదా సాండోవిట్ లేదా 0.5 – 1.0గ్రాము సర్ఫ్ ను లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలో కాయకుళ్ళు కూడా ఆశించింది.దీని నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1మి.లీ. క్రిసాక్సిమిథైల్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గులాబి రంగు పురుగు ఆశించేందుకు అనుకూలంగా ఉన్నాయి. దీని నివారణకు పొలం గట్లమీద ఉన్న వయ్యారి భామ కలుపును నివారించాలి ఎకరాకు 8-10 లింగాకర్షక బుట్టలను అమర్చటం ద్వారా సామూహికంగా రెక్కల పురుగులను బందించడం లేదా ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజుల్లో బుట్టకు 7- 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణకు 2మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2.5మి.లీ. క్లోరోపైరిపాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు మందుల పిచికారి ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4గంటల తర్వాత చేసుకోవాలి. పత్తిలో టొబాకోస్ట్రీక్ వైరస్ తెగులు గమనించిన ప్రాంతాల్లో గట్ల వెంబడి ఉండే వయ్యారిభామ కలుపు మొక్కలను పూతకు రాకముందే పీకి తగులబెట్టాలి. తామర పురుగులను అరికట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చు. తామర పురుగుల నివారణకు 5మి.లీ. 1500 పీపీఎం వేపనూనే + 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.2గ్రా. ఎసిటామిప్రిడ్ మందును వారం వ్యవధిలో రెండుసార్లు మార్చి మార్చి మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారి చేయాలి.
మొక్కజొన్నలో
కురిసిన అధిక వర్షాలకు మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పోయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. దీని నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి సుడుల లోపల తడిచేలా పిచికారి చేయాలి.
సోయాచిక్కుడులో :
సోయాచిక్కుడులో ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ, కాయ తెగుళ్ళ ఆశించే వీలుంటుంది. వీటి నివారణకు ఒక మి. లీ. ప్రోపికోనజోల్ లేదా 2.5గ్రా. టెబ్యుకోనజోల్ +సల్పర్ లేదా 1.5గ్రా. పైరక్లోస్ట్రోబిన్ + ఇపక్సికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
సోయాచిక్కుడులో కాండం కుళ్ళు తెగులు గమనించిన చోట్ల నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా.కార్బండజిమ్ చొప్పున లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మందును పోయాలి.
* వేరుశనగలో టిక్కాఆకుమచ్చ తెగులు ఆశిస్తోంది. దీని నివారణకు ఒక మి.లీ.టెబ్యుకోనజోల్ లేదా 2 గ్రా.క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
* మిరపలో కొమ్మ ఎండు తెగులు ఆశించే వీలుంది.దీని నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1మి.లీ. ప్రొపికొనజోల్ లేదా 2 గ్రా. కాప్టాన్ +హెక్సాకొనజోల్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో ఎండుతెగులు/ వేరుకుళ్ళు గమనించిన ప్రాంతాల్లో 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండజిమ్ చొప్పున లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి.
కూరగాయ పంటల్లో:
టమాట నారుమళ్ళలో నారు కుళ్ళు తెగులు గమనించడమైంది. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు నేల పూర్తిగా తడిచేటట్లు మొక్కల మొదళ్ళ చుట్టూ పోయాలి. వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు ఆశిస్తుంది.దీని నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 0.4గ్రా. చొప్పున ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
డా.పి. లీలా రాణి
ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ),
వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం,
రాజేంద్రనగర్
Also Read: Pests In Crops Due To Heavy Rains: వానాకాలం పంటలలో అధిక వర్షాల కారణంగా ఉదృతమయ్యె చీడపీడలు – నివారణ.