కుగ్రామంలో పండించి విశాఖలో కూరగాయల అమ్మకం
పూరిళ్లు లేకుండా అభివృద్ది, పది మందికి ఉద్యోగాలు
ప్రతి ఇంటా వాహనాలతో కళకళలాడుతున్న పల్లె
Organic Farming: ఏడెనిమిది సంవత్సరాల క్రితం అది ఒక ఆదివాసీ పల్లె.. పంచాయతీలోని శివారు గ్రామం. ఆదివాసీ రైతులంతా కూరగాయలు అండించేవారు. రహదారుల్లేవు.. ఇరవై కిలోమీటర్ల మోసుకుంటూ వెళ్లి అరకులో షావుకారు అడిగిన కాడికి ఇచ్చేయడమే.. లేదంటే అక్కడ వేసి వచ్చేయడమే.. ఇది ఒకప్పటి పరిస్ధితి.. అదే సమయంలో గ్రామంలోకి అడుగుపెట్టింది రైతు సాధికార సంస్థ ప్రకృతి పద్ధతిని ప్రోత్సహించింది. అరకు సంతలో గిట్టుకాటు కాదని భావించి, విశాఖలో అమ్మకం చేసేలా స్ఠాల్స్ ఏర్పాటుకు సహకరించింది. రోజూ ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లడం… అధిక ధరలకు అమ్మకం చేయడం.. ప్రత్యక్ష్యంగా పది మంది….పరోక్షంగా 40 కుటుంబాలకు ప్రయోజనం.. ఐదేళ్లలో గ్రామం దశ తిరిగింది. పూరిళ్ల స్థానే స్లాబ్ ఇల్లులు.. ఇంటికో బైక్.. ఆటోలు.. కూరగాయలు తరలించేందుకు వ్యాన్.. పది మందికి ఉద్యోగాలు.. మరో 21 మంది ఉన్నత చదువులు.. ఇలా వారు చేపట్టిన ప్రకృతి విధానం. వాటిని విక్రయించేందుకు తీసుకున్న చర్యలు గ్రామ రూపు రేఖలనే మార్చేశాయి.
ఈ ప్రగతిని చూడాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, దుంబ్రిగుడ మండలం, సొవ్వ పంచాయతీలోని దేముడు వలసకు వెళ్లాల్సిందే. ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఈ గ్రామంలో మాలీ తెగకు చెందిన యాభై ఆదివాసీ కుటుంబాలు నివాసముండేవి. వీరి జీవనాధారం కూరగాయల సాగు. అప్పట్లో సాధారణ పద్ధతిలోనే సాగు చేసేవారు. రవాణా సౌకర్యం లేక అంతంతమాత్రంగా వచ్చిన దిగుబడులను అరకు మోసుకుంటూ వెళ్లి, అక్కడ సుంకరమెట్ట షావుకారుకు ఇచ్చేవారు. వస్తుమార్పిడి పద్ధతిలో తనకు నచ్చితే తీసుకునేవాడు.. లేని పక్షంలో తిరిగి మోసుకుంటూ తీసుకెళ్లలేని ఆదివాసీలు అక్కడే వేసి వచ్చేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు పడేవి. చదువుకునే వారు తక్కువే. దీంతో అప్పట్లో పంచాయతీ పెద్ద అప్పలస్వామి పెంకిటిల్లు, మోటారు సైకిల్ తప్ప, మిగిలినవన్నీ గుడిసెలే ఉండేవి.
అలాంటి కష్టాల నుంచి గట్టెక్కించింది ప్రకృతి వ్యవసాయం విధానం. అదే సమయంలో దేముడు వలసకు వచ్చిన రైతు సాధికార సంస్థ ప్రతినిధులు ముందుగా రైతులంతా ప్రకృతి పద్ధతిలో సాగు చేసేలా ప్రోత్సహించారు. దీనికి అవసరమైన సిబ్బందిని నియమించి, ఈ విధానం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. భూమితో పాటు పంట ఉత్పత్తులను తినేవారికి కలిగే లాభాలను తెలియజెప్పాయి. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను వివరించి, గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ ఈ విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య తలెత్తింది. అరకులో అమ్మకం చేస్తే వ్యాపారులు సాధారణ పద్ధతిలో పండించిన ఉత్పత్తుల మాదిరిగానే ధరను ఇచ్చేవారు. ఇలా అయితే గిట్టుబాటు కాదని భావించిన సంస్థ ప్రతినిధులు విశాఖలో అమ్మకం చేసేలా మార్కెటింగ్ అధికారులతో చర్చించారు. దానికి సరేనన్న అధికారులు విశాఖలోని అన్ని రైతు బజార్లలో అరకు ఉత్పత్తుల పేరుతో ఇక్కడి రైతులకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ప్రైవేటు వాహనాలు ఎక్కువగా డిమాండ్ చేస్తుండటంతో గిట్టుబాటు కాని పరిస్థితి తలెత్తింది. దీనిపై సంస్థ ప్రతినిధులు ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి, ప్రత్యేకంగా ఇక్కడి కూరగాయలు విశాఖ తరలించేందుకు సంత స్పెషల్ ను ఏర్పాటు చేశారు. ఇలా పండించిన దగ్గర్నుంచి, అమ్మకం చేసే వారకు అన్ని విధాలా రైతు సాధికార సంస్థ ప్రతినిధులు రైతుల వెన్నంటి ఉండి ప్రోత్సాహన్నందించారు. విశాఖలోని స్టాల్స్ లో నిరంతరం కూరగాయలు అమ్మకం చేసే విధంగా విస్తీర్ణం పెంచి, సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వంగ, బీర, బెండ, చిక్కుడు, బ్రోకోలి, చైనా క్యాబేజీతో పాటు పలు రకాల కూరగాయలు పండించి, లబ్ధి పొందుతున్నారు. గ్రామంలోని పది మందికి మాత్రమే స్టాల్స్ కు అవకాశం ఉండటంతో, మిగిలిన రైతులు తాము పండించిన కూరగాయలను వీరి ద్వారా అమ్మకం చేసి, నగదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విధంగా ప్రత్యక్షంగా పది మంది కాగా, పరోక్షంగా మరో 40 మంది లబ్ధి పొందుతున్నారు.
ఈ విధంగా నిరంతరం కూరగాయలు పండించి, అమ్మకం చేయడంతో నాలుగైదేళ్లలో గ్రామంలోని కుటుంబాలన్నీ ఆర్థికంగా స్థిరపడ్డాయి. పూరిళ్ల స్థానే స్లాబులు, పెంకిటిల్లులు వచ్చాయి. ఇద్దరైతే ఏకంగా అంతస్తుల ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. పిల్లలందర్నీ ఉన్నత విద్య చదివివిస్తున్నారు. గ్రామంలో 20 మంది బీటెక్, ఒకరు ట్రిపుల్ ఐటీ చదువుతుండగా, పది మంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించారు. దీంతో పాటు గ్రామంలో ప్రతి ఇంటికి మోటారు సైకిల్, ఎనిమిది ఆటోలు, కూరగాయలను విశాఖ తరలించేందుకు స్వంతంగా బొలేరో వ్యాను సమకూర్చుకున్నారు.
ఈ పరిస్థితుల వల్ల ఆరేడేళ్లలో దేముడువలస రూపురేఖలే మారిపోయాయి. ఈ ఒక్క గ్రామమే కాదు.. వీరిని చూసి, మరో పది పల్లెల్లోని నూకదొర, కొండదొర, వాల్మీకి, కుర్బా, కోందు, కమ్మర ఆదివాసీ తెగలు సైతం ప్రకృతి పద్ధతిలో కూరగాయలను సాగు చేసేందుకు ముందుకు వచ్చాయి. దీంతో సొవ్వ పంచాయతీలోని వంద కుటుంబాలు ప్రత్యక్షంగా విశాఖలో అమ్మకం చేసి లాభపడుతున్నాయి. పరోక్షంగా మరో ఐదొందల కుటుంబాలు తాము పండించిన కూరగాయలను వీరికి అమ్మకం చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉండే ఈ ఆదివాసీ పల్లెలోని గిరి రైతులు ప్రకృతి పద్ధతిలో సాగు చేసి ప్రయోజనం పొందడం, అందరికీ ఆదర్శంగా చెప్పవచ్చు.