యల్లపు రామ్ మోహన్, రామడుగు సుబాష్, దివ్య భారతి, కొట్టం సుష్మ
ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం
Broccoli Cultivation Method: క్యాబేజీ, కాలీఫ్లవర్, కేల్, ఆవాలు వంటి వాటితో దగ్గరి సంబంధం ఉన్న ‘బ్రాసికాసీ’ కుటుంబానికి చెందిన పంట బ్రోకలీ. దీని శాస్త్రీయ నామం బ్రాసికా ఒలేరేసియా రకం ఇటాలికా, బ్రోకలీ చూడడానికి క్యాబేజీ మాదిరి ఉంటుంది కానీ దీని పువ్వు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ పంట శీతాకాలం మరియు శీతల ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. బ్రోకలీ ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో ఉంది. స్పెయిన్, మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి అనేక ఇతర దేశాలలో కూడా దీనిని కూరగాయగా ఉపయోగిస్తారు. బ్రోకలీ మధ్యధరా ప్రాంతానికి చెందినది. బ్రోకలీ వైల్డ్ క్యాబేజీ నుండి పుట్టింది. వైల్డ్ క్యాబేజీ మధ్యధరా యొక్క ఉత్తర మరియు పశ్చిమ తీరాలలో ఉద్భవించింది, అక్కడ ఇది వేలాది సంవత్సరాల క్రితం నుండి పెరుగుతుంది.
ఉపయోగాలు : ఇది అధిక పోషకాలు కలిగిన పంటల మరియు అధిక సంఖ్యలో విటమిన్లు (ఎ మరియు సి), ఖనిజాలు (పొటాషియం, భాస్వరం, కాల్షియం మరియు ఐరన్) ఉంటాయి. ఇది థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ మరియు బ్రాసికాసీ పంటలలోకల్లా అధిక మొత్తంలో ప్రొటీన్ కలిగి ఉంటుంది. బ్రోకలీని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లూకోరాఫనిన్ సమ్మేళనం ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని మరియు గుండె జబ్బులను కూడా నివారిస్తుంది.
రకాలు :
బ్రోకలీలో ‘ఎర్లీ, మిడ్ సీజన్’ రకాలు కూడా ఉన్నాయి. ప్రారంభ రకాలు నాటిన 50-60 రోజుల్లో పరిపక్వం చెందుతాయి, మధ్య-సీజన్ రకాలు 60-75 రోజుల్లో పరిపక్వం చెందుతాయి. పంజాబ్ బ్రోకలీ, పాలం విచిత్ర వంటి రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి.
అనువైన నేలలు మరియు వాతావరణం :
బ్రోకలీ ఒక చల్లని సీజన్ కూరగాయ. దీనికి చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం. ఇది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. సగటు రోజువారీ ఉష్ణోగ్రత 17 మరియు 23 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు బ్రోకలీ బాగా పెరుగుతుంది. వేగవంతమైన మరియు సరైన పెరుగుదలకు తేమతో కూడిన నేల అవసరం. పొడి నేలలో రెమ్మలు మరింత పీచుగా మారతాయి. ఈ పంట పండిరచడానికి ఉదజని సూచిక 5.0 నుండి 6.5 వరకు ఉండాలి.
నర్సరీ :
నర్సరీ పెంపకానికి ప్రామాణిక పద్ధతిని పాటించాలి. బెడ్పై విత్తనాలు నాటిన తర్వాత బెడ్లను సరైన మల్చింగ్ మెటీరియల్ తో కప్పాలి. విత్తిన ప్రారంభ దశలో అంటే 15-20 రోజుల పాటు గడ్డిపై నీటి డబ్బాతో నీటిని స్ప్రే చేసినట్లుగా ఇవ్వాలి, తరువాతి దశలో మల్చ్‌ను తొలిగించి మామూలుగా ఇచ్చుకోవచ్చు. విత్తనం మొలకెత్తిన వెంటనే మల్చ్‌ను తొలగించాలి. ఎండలు, వర్షాలను తట్టుకునేందుకు పైకప్పు ఏర్పాటు చేయాలి.
నాటే కాలం :
నర్సరీలో విత్తనం నాటడానికి ఉత్తమ సమయం ఆగస్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు. నర్సరీలో నాట్లు వేసిన నెల రోజుల తర్వాత పొలంలో నాటేందుకు నాట్లు సిద్ధంగా ఉంటాయి. బోల్టింగ్ మరియు బటనింగ్ రాకుండా ఉండటానికి, నర్సరీని సరైన సమయంలో నాటడం మంచిది.
మొక్కల మధ్య అంతరం మరియు విత్తన మోతాదు :
బ్రోకలీని విజయవంతంగా సాగు చేయడానికి 45I45 సెం.మీ. లేదా 60I45 సెం.మీ. దూరం పాటించాలి. ఏదేమైనా, మొక్కల మధ్య దూరం అనేది రకం, వాతావరణం మరియు నేలను బట్టి మారుతుంది. ఒక హెక్టారు విస్తీర్ణంలో బ్రోకలీ సాగుకు 500-600 గ్రాముల విత్తనం సరిపోతుంది.
ఎరువుల యాజమాన్యం :
మంచి దిగుబడి కోసం బ్రోకలీకి అధిక పోషకాలతో కూడిన ఎరువులు అవసరం. నేల తయారీ సమయంలో 20 టన్నుల బాగా కుళ్లిపోయిన ఖ్‌ీవీ వేయాలి. ఎరువు వేయడంతో పాటు హెక్టారుకు 100 కిలోల నత్రజని, 75 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ వేయాలి. నాటడానికి ముందు సగం మోతాదు నత్రజని మరియు భాస్వరం మరియు పొటాష్ యొక్క పూర్తి మోతాదులను వేయాలి. మిగిలిన సగం మోతాదు నత్రజనిను రెండు సమాన భాగాలుగా చేసి, ఒక భాగం నాటిన నెల రోజుల తరువాత మరియు ఇంకో భాగం పువ్వు ఏర్పడే సమయంలో వేయాలి.
అంతరకృషి :
ఇది తక్కువ లోతులో పెరిగే పంట, పంట ప్రారంభ దశలో 1-2 సార్లు గడ్డిని తీయాలి. తేమతో కూడిన నేల పరిస్థితులలో నారు నాటడానికి ఒక రోజు ముందు పెండిమెథాలిన్ 2.5 లీటర్ల/హెక్టార్ వేయాలి. మొక్కలు నాటిన నాలుగైదు వారాల తర్వాత పొలంలో మొక్కలకు మట్టిని ఎగదోయాలి .
నీటి యాజమాన్యం :
బ్రోకలీ దాని నిస్సారమైన రూట్ వ్యవస్థ కారణంగా మొక్కల తరచు మరియు నిరంతర పెరుగుదల అవసరం. నాట్లు వేసిన వెంటనే మొదటి నీటి పారుదల ఇవ్వాలి. తరువాత నేల రకం మరియు వాతావరణాన్ని బట్టి వేసవిలో 7-8 రోజులు మరియు శీతాకాలంలో 10-15 రోజుల విరామంలో నీటిపారుదల ఇవ్వవచ్చు. పువ్వు ఏర్పడే సమయంలో మట్టిలో తగినంత తేమ ఉండాలి. నేల నీరు లేక ఎండిపోవడం వలన రెమ్మలలో పీచు పెరిగి రెమ్మల నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది మరియు నీరు నిలిచిపోయే పరిస్థితి మొక్కల పెరుగుదలను అణచివేయడానికి దారితీస్తుంది.
కోత, దిగుబడి :
మార్కెట్ చేయదగిన పరిమాణంతో అంటే 10`15 సెం.మీ. కాండాలను పదునైన కత్తితో కోయాలి. బడ్ క్లస్టర్ (పువ్వు) ఆకుపచ్చగా మరియు కాంపాక్ట్‌గా ఉండాలి. కోత ఆలస్యమైతే బడ్ క్లస్టర్ వదులుగా మారుతుంది. నాణ్యతను నిర్ధారించడానికి మొలకలు లేదా పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవాలి. మొలకలు 10-12 రోజుల తర్వాత మళ్లీ కోతకు సిద్ధంగా ఉన్నాయి. రకాన్ని బట్టి బహుళ కోతల ద్వారా హెక్టారుకు సగటున 100 నుంచి 150 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. కోసిన తర్వాత దాని పువ్వులను వెంటనే క్రమబద్ధీకరించి గ్రేడిరగ్ చేసి బుట్టల్లో ప్యాక్ చేసి మార్కెట్లకు పంపించాలి. వీటిని 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 7-10 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. లాక్టిక్ యాసిడ్ కిణ్వ ప్రక్రియ తర్వాత బ్రోకలీని గాజు జాడీలలో కూడా భద్రపరచవచ్చు.