NANO Fertilizers: ఆధునిక వ్యవసాయంలో పంట దిగుబడులు 40 శాతానికి పైగా ఎరువుల వాడకంపైనే ఆధారపడి ఉంటుంది.మొక్కల పెరుగుదలకు నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాల అవసరం అధికంగా ఉంటుంది.
* నత్రజని మొక్కలోని ఆకులు ఆకుపచ్చగా ఉండటానికి, పిలకలు, రెమ్మలు ఎక్కువగా రావడానికి, మొక్కలు ఏపుగా పెరగడానికి అవసరం.కావున నత్రజని ఎరుపు పంట కాలమంతా అవసరం ఉంటుంది. కాని ఈ పోషకం భూమిలో వేసినపుడు సులభంగా వృధా అవుతుంది. కాబట్టి నత్రజని ఎరువును పంటలకు దఫాలుగా సిఫారసు చేస్తారు.
* భాస్వరం మొక్కల వేర్ల అభివృద్ధికి మొక్కలు దుబ్బు చేయటానికి, త్వరగా పూత రావడానికి, గింజ, పిందె కట్టడానికి, త్వరగా పక్వానికి రావడానికి చాలా అవసరం. నత్రజని పోషకం లాగానే భాస్వరం కూడా మొక్కలకు పంట కాలమంతా అవసరం ఉంటుంది. కాని భాస్వరానికి భూమిలో కదిలే గుణం లేక వేసిన చోటే నిలిచి ఉంటుంది. కాబట్టి దీనికి వృధా అయ్యే అవకాశం తక్కువ. కానీ భాస్వరం ఎరువు భూమికి వేసిన 3-4 వారాలే మొక్కలకు అందే స్థితిలో ఉండి, తర్వాత భూమిలో మొక్కలకు అందని స్థితిలోకి మారిపోతుంది. అందుకే భాస్వరం ఎరువులను పంటలకు ఒకేసారి దుక్కిలో వేయాలని సిఫారసు చేస్తారు. రైతులు తమ పంటలకు నత్రజని, భాస్వరం పోషకాలను అధికంగా యూరియా, డిఎపి రూపంలో వాడుతున్నారు.
రైతులకు భారమౌతున్న ఎరువులు:
అంతర్జాతీయంగా యూరియా ధరలు బాగా పెరగడంతో భారత ప్రభుత్వం యూరియా బస్తాకు ఇంచు మించు 90 శాతం సబ్సీడి ఇచ్చి రైతులకు కేవలం రూ.267 లకే అందిస్తుంది.యూరియా తర్వాత రైతులు అధికంగా వాడే డిఎపిని రైతుల అవసరాలను తీర్చటానికి మనదేశంలో ఉత్పత్తి చేసే డిఎపి చాలక ఇతర దేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి తిరిగి ప్రభుత్వం సబ్సీడి ఇచ్చి రైతులకు సరఫరా చేస్తుంది.ఈ రకంగా రాయితీలు ఇచ్చి రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నా నేటి పరిస్థితుల్లో రైతులకు ఎరువుల ధరలు పెను భారంగానే ఉంది. మరో వైపు ఇంత ఖరీదు చేసి కొన్నఎరువులు పొలాలకు వేసినపుడు వీటిలోని పోషకాలు కేవలం 20-30 శాతం మాత్రమే మొక్కలకు అందుతుంది. మిగతా 70-80 శాతం మొక్కలకు అందక వృధాగా పోతుంది. ప్రభుత్వం సబ్సీడి ఇచ్చి, తక్కువ ధరలలో రైతులకు సరఫరా చేసినా, నేటి పరిస్థితుల్లో రైతులకు పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆదాయం రావడం లేదు. ఈ సమస్యలతో కొనుగోలు చేసిన ఈ ఎరువు బస్తాలను ఎరువు అంగళ్ళ నుంచి రైతు పొలాలకు రవాణా, కూలీ ఖర్చు, పొలంలో చల్లుటకు ఖర్చులు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ఈ సమస్యల వల్ల చాలా మంది రైతులు ఎరువులను సిఫారసుల మేరకు వాడక, ఆశించిన దిగుబడులు పొందలేక పోతున్నారు.
Also Read: Pest Problem in Guava Plantation: జామ తోటల్లో టీ దోమ, పండు ఈగ పురుగుల సమస్య
నానో ఎరువులు…
పైన చర్చించిన సమస్యలన్నింటికీ విరుగుడుగా నానో బయో టెక్నాలజీతో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ ‘ఇప్కో’ ద్రవరూపంలో నానో యూరియా, నానో డిఎపి లను ఉ త్పత్తి చేసి రైతులకు అందుబాటులోనికి తెచ్చింది. వీటిని సిఫారసుల మేరకు నీటిలో కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి. మొక్కలపై ఈ ఎరువుల ద్రావణాన్ని పిచికారి చేసినపుడు మొక్క ఆకులలోని పత్ర రంధ్రాల ద్వారా పోషకాలను పీల్చుకొని మొక్కల ఎదుగుదలకు ఉ పయోగించుకుంటాయి. అర్థ లీటరు నానో యూరియా, నానో డిఎపి ఒక బస్తా సంప్రదాయ యూరియా, డిఎపిలకు సమానమని ఎరువుల సంస్థ తెలియచేస్తుంది. నానో యూరియా అర్థ లీటరు రూ.225కు, నానో డిఎపి అర్థ లీటరు రూ.600/-లకే రైతులకు లభిస్తుంది. అదే సంప్రదాయ యూరియా బస్తా ధర రూ.267/-గా, డిఎపి రూ.1350/-గా ఉంది. ధర విషయంలో తక్కువగా ఉండడమే కాకుండా, ఎరువులలోని పోషకాల వినియోగంలో కూడా 80 నుంచి 90 శాతం వరకు ఉంటుందని, పంటలకు నానో ఎరువుల వాడకం వల్ల 8 శాతం వరకు అధిక దిగుబడులు వస్తున్నట్లు ఇస్కో సంస్థ పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి. మొదట్లో ఈ సంస్థ విడుదల చేసిన నానో యూరియాలో నత్రజని పోషకం తక్కువగా ఉన్నందున రైతులలో ఆదరణ అంతగా ఉండేది కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సంస్థ నత్రజని పోషకాన్ని పెంచి అదే ధరలో “నానో యూరియా ప్లస్” పేరుతో నేడు మార్కెట్లోనికి అందుబాటులోనికి తెచ్చింది.
నానో డిఎపిని ఇప్కో సంస్థతో పాటు నేడు కోరమాండల్ సంస్థ వారు మెటా (నానో డిఎపి) పేరుతో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పోషకాల శాతం ఇప్కో వారి నానో డిఎపి కంటే తక్కువగా ఉంటుంది. అందుకే కోరమండల్ వారి డిఎపిని ఎకరాకు ఒక లీటరు పిచికారికి సిఫారసు చేస్తున్నారు. మార్కెట్లో ఈ నానో డిఎపి ధర లీటరుకు రూ.595/-గా ఉంది. కోరమాండల్ వారి డిఎపిని మన గ్రోమోర్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు.
ప్రయోజనాలు:
సంప్రదాయ ఎరువుల బస్తాలతో పోల్చినపుడు నానో ఎరువుల కొనుగోలు, రవాణా, కూలీల ఖర్చు రైతులకు చాలా తక్కువగా, సులభంగాను ఉంటుంది. సంప్రదాయ యూరియా, డిఎపిల వాడకం కంటే నానో ఎరువుల వాడకం వల్ల పంటలకు చీడల ఉధృతి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రకంగా నానో ఎరువులు వాడకం వలన రైతులకు సాగు ఖర్చు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుంది. రైతులు నానో ఎరువులు వాడకం వల్ల సంప్రదాయ ఎరువులపై ప్రభుత్వం పెట్టే సబ్సీడీల భారం కూడా గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ యూరియా, డిఎపిలు అధికంగా భూములకు వేయడం వల్ల ఏర్పడే నేలలు, భూగర్భ జలాల కాలుష్యాన్ని కూడా నానో ఎరువుల వాడకం వల్ల చాలా వరకు తగ్గించవచ్చు.
నానో ఎరువులు ఎలా వాడాలి ?
ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, డిఎపి ఎరువులను పైరు పైన పిచికారీకి మాత్రమే సిఫారసు చేశారు.వీటిని భూమిలో వేయటానికి గాని, డ్రిప్ ద్వారా వాడటానికి గాని సిఫారసు చేయడం లేదు. కాబట్టి పంటలకు దుక్కిలో సిఫారసు చేసిన ఎరువులను యథావిధిగా రైతులు భూములకు వేసుకోవాలి. పంటకు పైపాటుగా సిఫారసు చేసిన నత్రజని (యూరియా), భాస్వరం (డిఎపి) ఎరువులను నానో ఎరువుల రూపంలో పిచికారి చేసుకోవాలి. నానో ఎరువులలోని పోషకాలు, మొక్కల ఆకులలోని పత్ర రంధ్రాల ద్వారా పీల్చుకొని మొక్కలు వినియోగించుకుంటాయి.
* లీటరు నీటికి 4 మి.లీ.చొప్పున కలిపిన నానో డిఎపి ద్రావణంలో వరి, కూరగాయల నారు మొక్కలను 15 నిమిషాల పాటు ముంచి నాటుకునేందుకు కూడా సిఫారసు చేశారు. ముఖ్యంగా రబీలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల మొక్కలకు భాస్వరం అందుబాటు తక్కువగా ఉంటుంది.ఈ పరిస్థితుల్లో నారు మొక్కలను నానో డిఎపి ద్రావణంలో ముంచి నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
నానో ఎరువులను ఎప్పుడెప్పుడు వాడాలి ?
సాధారణంగా నత్రజని ఎరువు యూరియాను పైరు పిలకుల తొడిగే లేదా రెమ్మలు వచ్చే దశలో, పూతకు ముందు పైపాటుగా వేస్తారు. కాని భాస్వరం ఎరువు డిఎపిని దుక్కిలో వేయటానికి సిఫారసు చేశారు. కానీ దుక్కిలో వేసిన భాస్వరం ఎరువు వేసిన 3-4 వారాల వరకే మొక్కలకు అందుబాటులో ఉండి, ఆ తర్వాత మొక్కలకు అందని స్థితిలోనికి మారుతుంది. కాబట్టి పూత, పిందె, పక్వానికొచ్చే దశలో భాస్వరం ఆశించినంత మొక్కలకు అందుబాటులో ఉండదు. అందుకే డ్రిప్ తో సాగు చేసే రైతులు పండ్లు, కూరగాయలు, పూల పంటల్లో, నీటిలో కరిగే ఎరువులను వంట అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కానీ డ్రిప్ లలో వాడే నీటిలో కరిగే రసాయనికి ఎరువుల ధరలు చాలా ఎక్కువగా ఉండి రైతులకు మోయలేని భారంగా మారుతుంది. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నత్రజని (యూరియా), భాస్వరం (డిఎపి) ఎరువులను పైపాటుగా వేసే సంప్రదాయ ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డిఎపిల రూపంలో పిచికారి
చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.ఎకరాకు నానో యూరియా, డిఎపిలు అర్ధ లీటరు చొప్పున పిచికారి చేయాలి. నానో ఎరువులు పిచికారి చేసిన తర్వాత సంప్రదాయ యూరియా, డిఎపి ఎరువులు పంటలకు వేయనవసరం లేదు.
వరిలో నానో యూరియా, నానో డిఎపిలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారి చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసు పంటల్లో మొక్కలకు రెమ్మలు వచ్చే దశలో, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో ముఖ్యంగా మామిడిలో పూతకు ముందు డిసెంబరు నెలలో డిఎపి స్ప్రే చేయడం వల్ల పూత బాగా వచ్చి మంచి దిగుబడులు వచ్చినట్లు రైతుల అనుభవాలు చెబుతున్నాయి. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో డిఎపిని పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
నానో ఎరువులు సస్యరక్షణ మందులతో కలిపి వాడొచ్చా?
నానో ఎరువులతో సస్యరక్షణ మందులు కలిపి వాడకంపై స్పష్టమైన సిఫారసు లేవు. దీనిపై పరిశోధనలు చేసి రైతులకు సిఫారసు చేయాల్సిన అవసరం ఉంది. కాని నానో ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఇస్కో సంస్థ నానో ఎరువులను సస్యరక్షణ మందులతో కలిపి పిచికారి చేసే ముందు రైతులు ఓ చిన్న పరీక్ష చేసి పిచికారి చేయవచ్చని చెబుతున్నారు. పరీక్ష:ఇందుకోసం నానో ఎరువు, సస్యరక్షణ మందు ఒక్కొక్కటి 10 మి.లీ.చొప్పున ఒక కప్పులో తీసుకొని, వీటిని కలిపి 10 నిమిషాల పాటు గమనించాలి. కలిపిన మందు ద్రావణం విరిగి పోకుండా బాగా కలిసిపోతే రైతులు వీటిని కలిపి వాడుకోవచ్చు. విరిగిపోతే ఈ మందులను కలిపి వాడకూడదని అర్థం చేసుకోవాలి. రైతులకు సందేహం ఉన్నపుడు నానో ఎరువులు, సస్యరక్షణ మందులను విడి విడిగా వినియోగించుకోవడమే మంచిది. సంప్రదాయ యూరియా, డిఎపి ఎరువుల కొనుగోలు రవాణా, పొలంలో వేయటం, కూలీల ఖర్చు శ్రమతో కూడుకున్నది. ఈ ఎరువుల వాడకంతో పోలిస్తే నానో ఎరువుల వాడకం సులభతరంగా, లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు.
మెరుగు భాస్కరయ్య, ఎడిఎ,
వ్యవసాయశాఖ జిల్లా వనరుల కేంద్రం,
తిరుపతి, ఫోన్: 9701590192
Also Read: Success Story Of Farmer Nunna Rambabu: ఉద్యోగం వదిలి ప్రకృతి సాగు వైపు..