Modern Farmer: మహారాష్ట్రలోని వాసిం జిల్లా అసోల గ్రామంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు మహాదేవ్ సరోడి (Mahadev Sarodi). గతంలో మహాదేవ్, అతని తల్లిదండ్రులు రైతు కూలీలుగా పని చేసేవారు. కానీ ఇప్పుడు అదే గ్రామంలో సరోడికి 50 ఎకరాల పొలం ఉంది. ముంబైలో నివసించే సరోడి ఓ ఇంటీరియర్ డిజైనర్. మహాదేవ్ 2008 నుంచి ఆధునిక పద్ధతుల్లో పండ్ల సాగు చేస్తున్నారు.
మహాదేవ్ తన అనుభూతులను పంచుకున్నారు. అయన మాట్లాడుతూ… ముంబైలోని జేజే స్కూల్ లో చదువు పూర్తి చేశాను. కానీ నాకు మొదటి నుండి వ్యవసాయంపైనే ఆసక్తి ఉండేది. హాస్టల్ లో ఉన్న సమయంలో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు. మేము ఆయా ప్రాంతాలకు వెళ్లి పొలాలను చూసేవాళ్ళం. అప్పుడు నేను కూడా వ్యవసాయంలో ఏదో సాధించాలని అనుకున్నాను. దాంతో నేను కొంత మేర పొలాన్ని కొనుగోలు చేసి అందులో నారింజ మొక్కలు నాటాను. అవి క్రమంగా పెరిగాయి. ఇప్పుడు నా తోటలో 5 వేల నారింజ చెట్లు ఉన్నాయి.
నారింజ సాగు తర్వాత 2018 నుంచి ద్రాక్ష సాగును ప్రారంభించారు మహాదేవ్. మహాదేవ్ ముంబైలో నివసిస్తూ పండ్ల మొక్కలను చూడటానికి నెలకు మూడు సార్లు వచ్చి మొక్కల్ని గమనిస్తారు. తన క్షేత్రంలో మొక్కలు 30 ఏళ్ళ పాటు ఉండేలా అయన ప్రణాళిక వేసుకున్నారు. నారింజ తర్వాత నిమ్మ మొక్కల్ని నాటారు మహాదేవ్. నారింజ, నిమ్మ ఈ రెండు సిట్రస్ జాతికి చెందిన పండ్లే. ఇప్పుడు మహాదేవ్ జలగాం నుంచి తెప్పించిన బత్తాయిలను పండిస్తున్నారు. అక్కడ 1000 బత్తాయి చెట్లున్నాయి. దాదాపుగా 400 నిమ్మ చెట్లున్నాయి.
మొదటి ఏడాది మహాదేవ్ అనుకున్నట్టు జరగలేదు. అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు సంగ్లీకి చెందిన ఓ కన్సల్టెంట్ ను సంప్రదించారు. అయన విలువైన సూచనలతో మహాదేవ్ ముందడుగేశారు. ప్రస్తుతం అయన మూడెకరాల్లో ద్రాక్ష తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి ఒక ఎకరాకు లక్షన్నర ఖర్చు చేస్తున్నారు మహాదేవ్. అయన వద్ద ఉన్న మూడు ద్రాక్ష ఎకరాల కోసం 6 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం మహాదేవ్ పంటకు 50 టన్నుల దిగుబడి ఉంది. కిలో ద్రాక్ష 50 రూపాయలు అనుకుంటే అతని పంట ద్వారా 15 లక్షల ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ పెట్టుబడులను పక్కనపెడితే మిగిలినదంతా లాభమే.
మహాదేవ్ ముంబైలో ఉండటంతో అయన క్షేత్రాన్ని ఇద్దరు మేనేజర్లు, ఐదుగురు రైతులు సంరక్షిస్తున్నారు. మహాదేవ్ మొబైల్ యాప్ ద్వారా మోటార్ పంపులను ఆపరేట్ చేస్తున్నారు. బావిలో నీరు లేకపోతే మహాదేవ్ కు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే విద్యత్తు సమస్యలు ఉన్నా మహాదేవ్ కు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం మహాదేవ్ తన 50 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.