రైతులు

Farmer Success story: మిశ్రమ పంటలే వారి విజయ రహస్యం.. లాభాల బాటలో రైతన్నలు

0

Mixed Crops పెట్టుబడి లేని వ్యవసాయం. మిశ్రమ పంటలే వారి విజయ రహస్యం. వాతావరణం కనికరించకపోయినా, మార్కెట్‌లో ధర పడిపోయినా లాభాల బాట పడుతున్నారు జహీరాబాద్‌ ప్రాంత రైతులు. విత్తనాలు, ఎరువుల కోసం ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి సాధించారు. తాము కడుపు నిండా తినడమే కాక.. ఇతరులకు పౌష్టికాహారం అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని 60 గ్రామాల్లో రైతులు వ్యవసాయం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన ఆహార ధాన్యాలు పండించుకుంటున్నారు. అక్కడి నేల స్వభావం.. వాతావరణానికి సరిపోయే పంటలే సాగు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు అన్ని సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ప్రతి రైతు తన పొలంలో కనీసం 20 రకాల పంటలు పండిస్తున్నారు. వాతావరణం సహకరించక.. ధరలు లేక ఒక పంటలో నష్టం వచ్చినా.. మిగతావాటిలో లాభం వస్తోంది. ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా లాభాలు గడిస్తున్నారు.

ఎక్కువగా ఆహారధాన్యాలే..

అన్నదాతలు ఎక్కువగా ఆహారధాన్యాలు పండిస్తున్నారు. ఇందులోనూ చిరు ధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం ఆహారంగా తీసుకునే పంటలను పండిస్తారు. సొంతంగా తయారు చేసుకున్న సేంద్రీయ ఎరువులు మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ పంటలకు తక్కువ వర్షపాతం ఉన్నా పెద్దగా నష్టం జరగదని చెబుతున్నారు. మిశ్రమ వ్యవసాయం వల్ల విత్తనం వేసిన 60-70రోజుల నుంచి 6నెలల వరకు దిగుబడి వస్తోందని వెల్లడించారు. పెసర 60రోజుల్లో వస్తే.. జొన్న, సజ్జలు 90రోజులు, కందులు 6నెలల్లో కోతకొస్తాయని తెలిపారు.

పూర్తిగా సేంద్రియ విధానంలోనే..

రైతులు పూర్తిగా స్వశక్తిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఉచిత విద్యుత్తే కాక రసాయనిక ఎరువులు కూడా వినియోగించడం లేదు. విత్తనాలు సైతం వీరి పొలంలో పండిన వాటినే మరుసటి సంవత్సరానికి వినియోగిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో పండించడంతో వీరి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ రైతన్నలకు అండగా నిలుస్తోంది. శాస్త్రీయ విధానాలు, సశ్యరక్షణతో పాటు సాగు మెళకువలు నేర్పిస్తూ అధిక దిగుబడి సాధించేలా తోడ్పాటు అందిస్తోంది. పండించిన పంటలను మార్కెట్ ధర కంటే 20శాతం అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తోంది.

వరి సాగు, కొనుగోళ్లు ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం మిశ్రమ పంటల విధానాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే… రైతుల ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 

Leave Your Comments

Mango powdery mildew: మామిడిలో బూజు తెగుల– రైతులు ఇలా చెయ్యండి

Previous article

Guava Health Benefits: జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే

Next article

You may also like