Management of fertilizers in Cashew Crop: దేశంలో జీడి మామిడి సుమారుగా 11.92 లక్షల హెక్టార్లలో సాగవుతూ 7.82 లక్షల టన్నుల జీడి గింజల ఉత్పత్తి జరుగుతోంది. మన దేశంలో 19 రాష్ట్రాల్లో జీడి మామిడి సాగు జరుగుతూ, లక్షల మంది రైతులకు ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన పంటగా పేరు గాంచింది. ముఖ్యంగా కేరళ,కర్నాటక,గోవా,మహారాష్ట్ర,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,బడిషా మొదలగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే మన దేశంలో జీడిమామిడి సరాసరి ఉత్పాదకత హెక్టారుకు 766 కిలోలు మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం 90 శాతం జీడి తోటలు విత్తనం ద్వారా సాగు చేయబడుతున్నాయి. సరైన యాజమాన్య పద్ధతులు అనగా అధిక దిగుబడినిచ్చే అంటు మొక్కలు నాటడం, కత్తిరింపులు, సమగ్ర ఎరువులు, పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు అవలంభిస్తే హెక్టారుకు 1500 – 2000 కిలోల జీడిగింజల ఉత్పాదకతను సాధించడానికి అవకాశం ఉంది. అయితే మన దేశంలో జీడి పిక్కలు శుద్ధి పరిశ్రమలు సుమారుగా 3000 లకు పైగా ఉండి,25 లక్షల టన్నుల జీడి గింజలు శుద్ధి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రోజు మనదేశం ఆఫ్రికా దేశాల నుంచి జీడి గింజులను దిగుమతి చేసుకుని శుద్ధి చేసిమరలా సుమారుగా 60 కి పైగా దేశాలకు జీడి పప్పుని ఎగుమతి చేస్తుంది.అయితే గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచ జీడి మామిడి విపణిలో వియత్నాం మనదేశం కన్నా ముందంజలో ఉండి, ఎక్కువ ఉత్పాదకతను సాదిస్తూ, యాంత్రీకరణ అవలంబిస్తూ జీడిపప్పు ఎగుమతిలో 65% వాటాను కలిగి ఉంది. అదేసమయంలో భారత దేశం వాటా జీడిపప్పు ఎగుమతిలో 10% మాత్రమే కలిగి ఉంది. సుమారు గత 25 సంవత్సరాల వరకు కూడా జీడిగింజల ఉత్పత్తి, శుద్ధీకరణ, ఎగుమతిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఇది క్రమేణా తగ్గుతూ వస్తుంది.దీనికి ప్రధాన కారణం జీడిగింజల ఉత్పత్తి అవసరానికి మించి చాలా తక్కువగా ఉండటమే. ఉదాహరణకు 2022-23 లో భారతదేశం ఇతర దేశాల నుంచి 13.32 లక్షల టన్నుల జీడి గింజలను దిగుమతి చేసుకోవడం ద్వారా 14,369.51 కోట్లు విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వచ్చింది. అదే సమయంలో మనదేశం కేవలం 44,271 టన్నుల జీడి పప్పు ఎగుమతి చేయడం ద్వారా 2677.47 కోట్ల విదేశి మాదక ద్రవ్యాన్ని ఆర్జించింది.ఏపీలో జీడిమామిడి 1,35,241 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 1,21,540 టన్నులు జీడి గింజల ఉత్పత్తిని సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడిమామిడి విస్తీర్ణంలో,ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉండి దేశంలోని జీడి గింజుల ఉత్పత్తిలో 16.42 శాతం వాటాను కలిగి ఉంది. మనదేశంలో మహారాష్ట్ర జీడిమామిడి విస్తీర్ణం,ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
వివిధ జిల్లాల్లో జీడిమామిడి సాగు తీరుతెన్నులు (2022-23) :
శ్రీకాకుళం జిల్లాలో 25473 హెక్టార్లలో 20620 టన్నులు,
విజయనగరం జిల్లాలో 17903 హెక్టార్లలో 16589 టన్నులు,
విశాఖపట్నం జిల్లాలో 34536 హెక్టార్లలో 29855 టన్నులు,
తూర్పుగోదావరి జిల్లాలో 32814 హెక్టార్లలో 28722 టన్నులు,
పశ్చిమ గోదావరి జిల్లాలో 20281 హెక్టార్లలో 23029 టన్నులు,
కృష్ణా జిల్లాలో 222హెక్టార్లలో286 టన్నులు,
గుంటూరు జిల్లాలో 1256హెక్టార్లలో 783 టన్నులు,
ప్రకాశం జిల్లాలో 1156హెక్టార్లలో 797 టన్నులు,
నెల్లూరు జిల్లాలో 1276హెక్టార్లలో 592 టన్నులు,
చిత్తూరు జిల్లాలో 324హెక్టార్లలో 267 టన్నుల ఉత్పత్తి లభించింది.
ఏపీలో జీడి గింజల ఉత్పాదకత హెక్టారుకు కేవలం 730 కిలోలుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ విస్తీర్ణం అనగా 90 శాతం జీడిమామిడి తోటలు విత్తనం మొక్కల ద్వారా సాగు చేయడం.30 నుంచి 40 సంవత్సరాలు పైబడిన ముదురు తోటలు కావడం,సరైన యాజమాన్య పద్ధతులు అనగా కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ మొదలైనవి చేపట్టక పోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. జీడిమామిడిలో ఉత్పాదకత పెరగడానికి అంటు మొక్కలను నాటడం అనగా అధిక దిగుబడినిచ్చేరకాలైన బిపిపి- 8,9,10,11 రకాలను సాగు చేయటం, కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ ప్రధానమైనవి.ఇందులో ప్రధానమైన సమగ్ర పోషక యాజమాన్యం గురించి సవివరంగా తెలుసుకుందాం.
Also Read: Horticulture: ఉద్యాన పంటల సాగుదార్లకు శాస్త్రవేత్తల సూచనలు
సాధారణంగా జీడిమామిడి తోటల్లో ఎరువులు వేయకుండా సాగు చేస్తారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు ఎరువులు వేయరు.మొక్కలు ఆరోగ్యంగా, ధృడంగా పెరిగి త్వరగా కాపుకు రావడానికి, క్రమం తప్పకుండా స్థిరమైన దిగుబడులు పొందడానికి సమతుల్యమైన పోషకాలు అందించాలి.
ఎరువుల అవశ్యకత :
జీడి మామిడి ప్రతి సంవత్సరం ముదురు ఆకులను రాల్చుకునే స్వభావం కలిగి ఉంటుంది. 30 సంవత్సరాల వయసు గల జీడిమామిడి చెట్లు ప్రతి సంవత్సరం శాఖీయ భాగాలు, వేరువ్యవస్థ,పండ్లు, గింజల ద్వారా 2.85 కిలోల నత్రజని, 0.75 కిలోల భాస్వరం,1.27 కిలోల పొటాష్ పోషకాలను నష్టపోతుంది.అందువల్ల జీడిమామిడి సాగులో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెట్లకు ఎరువులను అందించాలి. జీడిమామిడిని వివిధ రకాల నేలలు … ఇసుకనేలలు, ఎర్రనేలల్లో సాగుచేస్తున్నారు.నేల స్వభావన్ని బట్టి జీడిమామిడి చెట్ల వేర్ల పెరుగుదల ఉంటుంది. సాధారణంగా జీడిమామిడి లోతైన, వ్యాప్తి చెందే స్వభావం కలిగిన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. వేర్లు ఎక్కువగా చెట్టు చుట్టూ 30 మీటర్లు,ఒక మీటరు లోతు వరకు వ్యాపించి ఉంటాయి.
వివిధ పోషకాల ప్రాధాన్యం:
నత్రజని: శాఖీయ భాగాల పెరుగుదలలో నత్రజని ముఖ్యపాత్ర వహిస్తుంది. జీడిమామిడి మొక్కల పెరుగుదల, గింజ దిగుబడి ఎక్కువగా నత్రజని పోషక లభ్యత మీద ఆధార పడి ఉంటుంది.
భాస్వరం: తక్కువ మొత్తంలో జీడిమామిడికి భాస్వరం అందించినప్పుడు ఎక్కువ దిగుబడి నమోదవుతుంది. ముఖ్యంగా వేరు వ్యవస్థ ఏర్పడటంలో భాస్వరం కీలక పాత్ర పోషిస్తుంది.
పొటాషియం: నత్రజని తర్వాత జీడిగింజల దిగుబడిలో ఎక్కువగా అవసరమైన పోషకం పోటాష్. నత్రజనితో పాటు పోటాషియం ఎరువును కలిపి జీడిమామిడి చెట్లకు అందించి నప్పుడు ఎక్కువ దిగుబడిని నమోదుచేయడం జరిగింది.నత్రజని, పోటాష్ లు జీడిగింజల ఉత్పత్తి, ఉత్పాదకతలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ఎరువుల ఆవశ్యకతను ప్రభావితం చేసే అంశాలు:
జీడిమామిడిలో పోషకాల మోతాదు వాతావరణం,నేల స్వభావము, సాగు చేసే రకాల మీద ఆధార పడి ఉంటుంది.పోషకాల ఆవశ్యకత జీడిమామిడి ఉత్పాదకతను బట్టి ఉంటుంది.
నేల స్వభావం: ఎరువులు లేదా పోషకాల ఆవశ్యకత జీడి మామిడి సాగు చేస్తున్న నేలలోని పోషకాల స్థాయి, ఉదజని సూచిక (PH), సేంద్రియ కర్భనం, నీటిని పట్టి ఉంచే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పోషకాల అవసరం సారవంతమైన భూముల్లో తక్కువగా, నిస్సారమైన భూముల్లో అధికంగా ఉంటుంది.
రకాలు: జీడిమామిడిలో పోషకాల ఆవశ్యకత సాగు చేసే రకాలను బట్టి ఉంటుంది. అధిక దిగుబడినిచ్చే రకాలకు ఎక్కువగా పోషకాలు అవసరం.ఈ పోషకాల అవసరం రకాల ఉత్పత్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.
వాతావరణ పరిస్థితులు: జీడిమామిడిలో పోషకాల అవసరం ఆ ప్రాంతంలో నమోదయిన వర్షపాతం, వివిధ కాలాల్లో సరిసమానంగా నమోదయిన రీతిని బట్టి ఉంటుంది.సాధారణంగా వర్షపాతం 1500 – 2000 మి.మీ. గల ప్రాంతాల్లో అధిక దిగుబడినిస్తుంది.గాలిలో తేమ 70-80 శాతం ఉండి పూత సమయంలో మంచు లేని ప్రాంతాల్లో అధిక దిగుబడినిస్తుంది.
సాగు విధానం: వర్షాధారం లేదా నీటి సౌకర్యం ఉన్న దానిని బట్టి పోషకాల ఆవశ్యకత ఆధార పడి ఉంటుంది. సాధారణంగా ఎరువుల అవసరం వర్షాధారంగా సాగు చేసినప్పుడు తక్కువగా, నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ఎక్కువగా ఉంటుంది.
చెట్ల వయస్సు బట్టి పోషకాల అవశ్యకత:
జీడిమామిడి చెట్లు పూర్తి స్థాయిలో పెరిగి స్థిరమైన దిగుబడి రావడానికి ఏడేళ్ల సమయం పడుతుంది.ఈ సమయంలో చెట్ల ఎత్తు, శాఖీయ కొమ్మల వ్యాప్తి క్రమంగాపెరుగుతుంది. సాధారణంగా మొదటి సంవత్సరం ఎలాంటి రసాయన ఎరువులను అందించరాదు.ఒక్కో చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, రెండు కిలోల చొప్పున వేపపిండి అందించాలి. రెండవ సంవత్సరంలో సిఫారను చేసిన మోతాదులో 1/4వ వంతు, మూడవ సంవత్సరంలో 2/4 వ వంతు, నాల్గవ సంవత్సరంలో 3 /4 వ వంతు, ఐదేళ్లు, ఆపై బడిన చెట్లకు పూర్తిస్థాయిలో సిఫారసు చేసిన ఎరువులను అందించాలి.
ఎరువులు వేసే సమయం:
ముఖ్యంగా శాఖీయ కొమ్మల నుంచి చిగురాకు దశలో ఎరువుల అవసరం మొదలవుతుంది. పోషకాల అవసరం కొత్త చిగురు కొమ్మలు మొదలయ్యే దశ నుంచి పూత కొమ్మలు వచ్చే దశ వరకు ఎక్కువగా ఉంటుంది.ఈ దశ సెప్టెంబర్ మాసం నుంచి డిశంబర్ వరకు కొనసాగుతుంది.ఎక్కువగా వర్షాధారంగా జీడిమామిడి సాగుచేస్తారు కాబట్టి వర్షాలు వచ్చే సమయానికి ముందుగా సెప్టెంబర్ మాసం కల్లా ఎరువులను అందించాలి. అదే విధంగా నీటి సౌకర్యం ఉన్న భూముల్లో రెండు దఫాలుగా జూన్- జూలైలో ఒకసారి, సెప్టెంబర్ – అక్టోబర్ లో మరోసారి చెట్లకు ఎరువులు అందించాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే చెట్లకు ఎరువులను వేయాలి.
ఎరువులు వేసే విధానం:
చెట్ల వయసును బట్టి చెట్ల కాండానికి చుట్టూ ఎంత దూరంలో ఎరువులు వేయాలనేది ఆధార పడి ఉంటుంది. సాధారణంగా ఎరువులను పిల్ల వేళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో అందించాలి. చిన్న చెట్లకు సూచించిన మోతాదులో చెట్ల చుట్టా 10 సెం.మీ లోపల చల్లి మట్టితో కప్పి వేయాలి. అదే పెద్ద చెట్లయితే చెట్టు మొదలు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర మీటర్ల దూరంలో చుట్టూ 15 సెం.మీ.లోతు, 25 సెం.మీ వెడల్పు గల గాడిని తీసి అందులో ఎరువులు వేసి మట్టితో కప్పివేయాలి.చెట్లకు ఎరువులు వేసే ముందుగా చెట్ల పాదుల్లో కలుపు మొక్కలు ఏమి లేకుండా శుభ్రపరచాలి.
ఎరువుల మోతాదు:
చెట్ల వయస్సు వయస్సు బట్టి ఎరువులు వేయాలి. నీటి సౌకర్యం ఉన్న తోటల్లో రెండు దఫాలుగా ఎరువులను వేయాలి.ఒక్కో దఫాకు రెండేళ్ల వయస్సు చెట్లకు 185 +125 +33 గ్రాములు, మూడేళ్ళ వయస్సు చెట్లకు 370 +250 +66 గ్రాములు, నాలుగేళ్ల వయస్సు చెట్లకు 434 +312 +100 గ్రాములు, ఐదేళ్లు,ఆపై వయస్సు చెట్లకు 1100 +375 +100 గ్రాముల చొప్పున యూరియా +సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ +మ్యూరేట్ అఫ్ పోటాష్ ఎరువులను వేయాలి.
వర్షాదారం కింద సాగుచేసే తోటల్లో ఒకే దఫాగా ఎరువులను చెట్టుకి ఒక కిలో నత్రజని, 125 గ్రా. భాస్వరం, 125 గ్రా. పొటాష్ ఎరువులు అనగా 2200గ్రా.యూరియా, 750 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఒక్కో చెట్టుకు అందించాలి. రసాయన ఎరువులతో పాటుగా 30 -35 కిలోల పశువుల ఎరువును ఒక్కో చెట్టుకు వేయాలి. వీటితో పాటు జీడిమామిడి చెట్లు చిగురాకు దశ, పూత దశ, కాయ, గింజ ఏర్పడే దశల్లో 2 శాతం యూరియా ద్రావణాన్ని(లీటరు నీటికి 20 గ్రాములు) పిచికారి చేస్తే దిగుబడి పెరుగుతుంది. జీడిమామిడిలో సరైన సమయంలో, సరైన పద్ధతిలో సిఫారసు చేసిన ఎరువులను చెట్లకు అందించడం ద్వారా క్రమం తప్పకుండా అధిక దిగుబడిని సాధించవచ్చు.చెట్టుకు సరాసరి 8-10 కిలోల దిగుబడిని సాధించి, జీడిమామిడి ఉత్పాదకతను పెంచవచ్చు. ఎరువుల యాజమాన్యం, కొమ్మ కత్తిరింపులు, సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జీడిమామిడిలో ఎకరాకు 400-480 కిలోల దిగుబడిని సాధించవచ్చు.
డా. కె. ఉమామహేశ్వరరావు,
డా.జి.స్రవంతి, జీడి మామిడి పరిశోధన స్థానం,బాపట్ల ,
డా.ఎల్. నారం నాయుడు, పరిశోధన సంచాలకులు,
డా.వై.ఎస్.ఆర్.హార్టికల్చర్ యూనివర్సిటీ
ఫోన్: 7382633056
Also Read: Success Story Of Farmer Nunna Rambabu: ఉద్యోగం వదిలి ప్రకృతి సాగు వైపు..