Farmer Online Courses: కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రైతులకు వ్యవసాయం మెళుకువలు, పరిష్కారాలను అందించడానికి మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు ఇందులో వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్‌లైన్ శిక్షణను పొందుతున్నారు.
మొదట్లో మైసూరులో రైతులకు శిక్షణ ఇచ్చేవారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్‌లు సర్వత్రా అందుబాటులోకి రావడం ద్వారా వాట్సాప్ మెసేంజర్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీని ద్వారా వ్యవసాయ సంఘానికి సంబందించిన లింక్‌లు విస్తృతంగా షేర్ అయ్యాయని వ్యవసాయ శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జి.హెచ్. యోగేష్ అన్నారు. తత్ఫలితంగా ఆన్‌లైన్ పాఠాలు మారుమూల ప్రాంతాల రైతులకు చేరువయ్యాయి.
వ్యవసాయ అధికారులకు క్షేత్ర మరియు సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఈ సంస్థ స్థాపించారు. దీని ద్వారా రైతులకు శిక్షణ, వ్యవసాయ మెళుకువలను చేరవేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 56 ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించగా, 10,806 మంది రైతులు శిక్షణ పొందారు. అదనపు తరగతులు ప్రారంభమయ్యే సమయానికి మరో రెండు నెలల సమయం ఉందని, అయితే ఇప్పుడు ఇతర జిల్లాలలో కూడా అలాంటి తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు యోగేష్.
2020-21లో 84 ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఇందులో 28,778 మంది రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణులు మరియు వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం-బెంగళూరు మరియు వ్యవసాయ శాఖ నుండి శాస్త్రవేత్తల సహకారంతో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా శిక్షణా కార్యక్రమాలు వర్షపు నీటి సంరక్షణ మరియు సేంద్రియ వ్యవసాయం నుండి పంట వ్యాధుల వ్యాప్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మరియు విత్తనాల సరైన ఎంపిక విషయాలపై నిపుణులు రైతులకు సూచించారు.