Redgram Crop: కంది ముఖ్యమైన అపరాల పంట. తెలంగాణాలో కంది సాధారణ విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు. పత్తి పంటను వర్షాధారంగా జులై 20 వరకు మాత్రమే విత్తుకోవాలి గనుక జులై 20 తర్వాత పత్తి విత్తుకోలేని భూముల్లో,అలాగే ఖాళీగా ఉన్న ఇతర భూముల్లో కందిని ఆగష్టు 15 వరకు మొక్కల సంఖ్య పెంచి దగ్గర అచ్చుతో వేసుకోవచ్చు.
నిప్పింగ్ చేయడం:
కంది పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించాలి.అందులో చాలా ముఖ్యమైన యాజమాన్య పద్దతి చిగుర్లు తుంచడం. దీనినే నిప్పింగ్ అంటారు.
కంది పంటను విత్తిన తరువాత 45 వ రోజు నుంచి 50 రోజుల లోపు దాదాపు మొక్క ఎత్తు 30-35 ఇంచులు(అంగుళాలు) ఉన్నప్పుడు తల కొనలు 3 ఇంచుల మేర తుంచి వేయాలి. ఒక ఎకరం కంది మొక్కల తల కొనలను తుంచడం ఒక మనిష 4 గంటల్లో చేయగలడు.నిప్పింగ్ మిషన్ తో మొక్కల తలలను తుంచడం త్వరితగతిన చేయవచ్చు. ఈ నిప్పింగ్ పరికరాన్ని బ్యాటరీస్ప్రేయర్ కి అమర్చి ఒక మనిషి 2 -3 ఎకరాల్లో కొనలు తుంచడం చేయవచ్చు. ఇలా కంది పంటలో తలకొనలు తుంచడం వల్ల పక్క కొమ్మలు ధృడంగా వచ్చి, పూత, కాత ఎక్కువ ఏర్పడి దిగుబడులు పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా ఆడి పురుగులు, తెగుళ్ల ఉధృతి కూడా తగ్గుతుంది. పూత సమయం, పురుగుమందుల పిచికారీ కూడా కొంత మేర సులభం అవుతుంది. కొనలు తుంచని(నిప్పింగ్ చేయని) కంది పంటతో పొల్చి నప్పుడు చేసిన పంటలో దాదాపు 15 శాతం అధిక దిగుబడి సాధించినట్లు పరిశోధనలో తేలింది. కాబట్టి రైతులు కంది పంటలో తలకొనలు తుంచడం విధిగా చేయాలి.
కలుపు నివారణ:
కంది పంటలో (20-25రోజల సమయంలో) కలుపు లేత దశలో అంటే 3 నుంచి 4 ఆకుల దశలో ఉనప్పుడు 300 మి.లీ.ఇమజితాపిర్ కలుపు మందును 200 లీటర్ల నిటిలో కలిపి పిచికారి చేసినట్లయితే తుంగ కాకుండా అన్ని రకాల కలుపు నివారణ జరుగుతుంది. పంటలో కేవలం గడ్డిజాతి కలుపు మాత్రమే ఉంటే 250 మి.లీ. ప్రొపక్విజాపాప్ (ఏజిల్)కలుపు మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా 400 మి.లీ. క్విజలోఫాప్.పి.ఇథైల్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
ఇలా కందిలో సరైన సమయంలో నిప్పింగ్ చేయడం, అలాగే వివిధ రకాల యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చు.
డా.ఎం.మధు, డా.ఎన్. సంధ్య కిషోర్, డా.జి.పద్మజ, డా.డి.వీరన్న, డా.ఆర్. ఉమారెడ్డి,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్
Also Read: Vannuramma Success Story: ఒంటరి మహిళ – అత్యున్నత గౌరవ వందనం