ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Groundnut: వేరుశనగలో జిప్సం వేస్తె అధిక దిగుబడులు !

2
Groundnut
Groundnut

Groundnut: భారతదేశంలో పండించే ప్రధాన నూనెగింజల పంట వేరుశనగ. అధిక దిగుబడిని పొందడానికి రకాల ఎంపిక, సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ముఖ్యం. తెగుళ్లు, పురుగులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు గురయ్యే రకాలను మంచి యాజమాన్య పద్ధతులతో పండించినా మంచి దిగుబడినివ్వవు. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితులను, తెగుళ్లు, పురుగులను తట్టుకునే రకాల్లో సరైన యాజమాన్య పద్దతులు పాటించకపోయినా మెరుగైన దిగుబడిని పొందలేము. కావున పురుగులు, తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనే రకాలను ఎంచుకొని, సరైన యాజమాన్య పద్దతులతో పండించినట్లైతే అధిక దిగుబడులు పొందవచ్చు.వేరుశనగలో దిగుబడిని ప్రభావితం చేసే యాజమాన్య పద్దతుల్లో అతి ముఖ్యమైనది ఎరువుల యజమాన్యం. ఎరువుల మోతాదు, ఎరువు రకం, ఎరువులు వేసే సమయం, ఎరువులు వేసే విధానం కీలకమైన అంశాలు.

Groundnut

Groundnut

ఎరువుల వాడకం కీలకం:

భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువును సమానంగా వెదజల్లాలి. భాస్వరం, పొటాష్ మొత్తం మోతాదును ఆఖరి దుక్కిలో వేయాలి. వర్షాధారం కింద సాగు చేసే పంటలో మొత్తం యూరియాను విత్తేటప్పుడు వేసుకోవాలి. నీటి పారుదల కింద రెండు భాగాల యూరియాను విత్తేటప్పుడు, ఒక భాగం విత్తిన 30 రోజులకు పైపాటుగా వేయాలి. వర్షాధార పంటలో ఒక ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అదే విధంగా నీటి పారుదల కింద ఒక ఎకరాకు 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి. వేరుశనగలో డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ను ఉపయోగించకూడదు, ఎందుకంటే వేరుశనగకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌లో లభించే కాల్షియం, సల్ఫర్ మంచి దిగుబడికి, అధిక నూనె శాతానికి అవసరం.
వేరుశెనగ పంటకు కాల్షియం, గంధకం అవసరమైన ప్రధాన పోషకాలు.వేరుశెనగ గింజల్లో 50% నూనె, 25% ప్రోటీన్లు ఉంటాయి. దీనికి గంధకం అవసరం. వేరుశెనగ దిగుబడి కాయ, గింజ పరిమాణం మీది ఆధారపడి ఉంటుంది. దీనికి కాల్షియం అవసరం. ఈ రెండు పోషకాలు జిప్సంలో కూడా లభిస్తాయి.

జిప్సం ప్రాముఖ్యత:

జిప్సంలో వేరుశనగకు అవసరమైన కాల్షియం (24 శాతం), గంధకం (18.6 శాతం) ఉన్నాయి. ఇది ఈ రెండు పోషకాలను అందించడమే కాకుండా నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. వేరుశనగలో మంచి దిగుబడిని ఇస్తుంది.

కాల్షియం: వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తికి కాల్షియం అవసరం. ఇది బెట్టను తట్టుకోవడంతో పాటు కాయల నిండుగా పప్పు రావడానికి సహాయపడుతుంది.

కాల్షియం లోప లక్షణాలు: కాల్షియం లోపం వల్ల గింజలు ఏర్పడని డొల్ల కాయలు ఎక్కువగా వస్తాయి. పంట వేర్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. పూత, దిగుబడులు తగ్గిపోతాయి.

గంధకం లోప లక్షణాలు: వేరుశనగలో నూనె ఏర్పడటానికి గంధకం అవసరం. ఇది కాయల రంగును మెరుగుపరచడంలో, ఆకుల పసుపు రంగుకు మారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గంధకం లోపం వల్ల ఆకులు చిన్నవిగా మారి, వాటి రంగును కోల్పోయి పసుపు రంగులోకి మారుతాయి.

జిప్సం వేసే సమయం – పద్దతి:

* కాల్షియం, గంధకాన్ని విడివిడిగా సరఫరా చేయడానికి బదులుగా జిప్సం 200 కిలోలు గరిష్ట పూత దశలో (ఖరీఫ్: 35-40 రోజులకు; రబీ: 40-45 రోజులకు) మొక్కల మొదళ్ల వద్ద వేయడం వల్ల జిప్సం వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది. జిప్సం వేసిన తర్వాత మట్టిలో కలియబెట్టితే కాయలు వచ్చే చోట పడి వాటికి అందుబాటులో ఉంటుంది.
* విత్తే సమయంలో లేదా ఊడలు నేలలోకి చొచ్చుకుపోయే సమయంలో జిప్సమ్‌ను ఉపయోగించడం వల్ల పోషకాలను గ్రహించే సామర్థ్యం మెరుగుపడుతుంది.
* జిప్సంను పొడి చేసి, పంట చుట్టూ 5 సెం.మీ మట్టిలో కలపాలి.

డా. సహజ దేవ, శాస్త్రవేత్త, డా.టి. ప్రతిమ, ప్రధాన శాస్త్రవేత్త,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి

Leave Your Comments

Rice Crop: రైతులు తమ వరి పంటను ఎలా సంరక్షించుకోవాలి ?

Previous article

Success Story Of Farmer Nunna Rambabu: ఉద్యోగం వదిలి ప్రకృతి సాగు వైపు..

Next article

You may also like