రైతులు

Farmer success Story: 6 ఎకరాల పొలంతో వ్యవసాయం మొదలు.. నేడు 60 ఎకరాల ఆసామి

0

Farmer Success Story: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’’. అన్న సామెతను ఇంతవరకూ ఎందరో నిజం చేసి చూపించారు. అలాంటి ఎన్నో నిజ జీవిత కథలను మనం విన్నాం. ఇప్పుడు అలాంటి కోవకే చెందిన ఓ రైతు గురించి తెలుసుకుందాం. చదివింది నాలుగో తరగతి.. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆఖరికి హోటళ్లలో గిన్నెలు కూడా కడిగాడు. చివరకు 6 ఎకరాల పొలంలో వ్యవసాయం ప్రారంభించి.. నేడు 60 ఎకరాల ఆసామి అయ్యాడు. ఏడాదికి కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌ కోహ్డియా గ్రామానికి చెందిన సుఖ్‌రామ్ వర్మ అనే రైతు నాలుగో తరగతి వరకే చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. దీంతో సుఖ్‌రామ్. తన 14-15 ఏళ్ల వయసులో రాయ్‌పూర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో గిన్నెలు కడిగే పనికి కుదిరాడు. అయితే ఎన్నాళ్లు పని చేసినా. హోటల్ యజమాని డబ్బులు ఇవ్వలేదు. దీంతో అక్కడ పని మానేసి తిరిగి సొంతూరికి వెళ్లాడు. అనంతరం విద్యుత్ శాఖలో కొన్నాళ్లు పని చేసినా అంతంతమాత్రమే ఆదాయం ఉండడంతో అక్కడా పని మానేశాడు. చివరకు వ్యవసాయం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

తన పూర్వీకుల నుంచి వచ్చిన 6ఎకరాల పొలంలో వ్యవసాయం ప్రారంభించాడు. కానీ ఈ రంగంలో అనుభవం లేకపోవడంతో మొదటి ఏడాది తీవ్ర నష్టాలను చవిచూశాడు. ఏడాది పొడవునా కష్టపడినా నష్టాలు రావడంతో ఆలోచనలో పడ్డాడు. అయితే ఎలాగైనా వ్యవసాయంలోనే లాభాలు రాబట్టాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వ్యవసాయాధికారులను సంప్రదించి సలహాలు, సూచనలను తీసుకున్నాడు. అలాగే వివిధ గ్రామాల్లో వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో విమల్‌జీ అనే రైతు వద్దకు వెళ్లి డ్రిప్‌ ఇరిగేషన్‌ గురించి తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ తదితర సదుపాయాలకు సంబంధించిన వివరాలను సేకరించాడు.

బిందు సేద్యం గురించి కూడా తెలుసుకుని. అన్నింటినీ ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు. కూరగాయలు, పండ్ల సాగులో లాభాలను ఎలా రాబట్టాలనే పద్ధతులను తెలుసుకున్నాడు. అంతేగాకుండా మట్టి సాంద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ. ప్రస్తుతం గ్రామంలోనే ప్రగతిశీల రైతుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక్కసారి ఆదాయం మెరుగుపడటం మొదలయ్యాక… సుఖ్‌రామ్ వర్మ  మరిన్ని వినూత్న పద్ధతులను అవలంభిస్తూ మరింత శ్రద్ధగా పనులు చేపట్టడం ప్రారంభించాడు. తర్వాత అరటి, బొప్పాయి, కూరగాయలు, వరి తదితర పంటలను సాగు చేస్తూ లాభాల బాట పట్టాడు. సంపాదన పెరిగే కొద్దీ పక్కనున్న వారి భూములను కూడా కొనడం మొదలెట్టాడు.

వరిలో ఎకరాకు సుమారు రూ.25,000 వరకు లాభం వస్తుందని, అదే కూరగాయలు, పండ్ల సాగులో కొన్నిసార్లు ఈ లాభం రెట్టింపవుతుందని సుఖరామ్ తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి లాభాలు ఇంకా పెరగొచ్చని చెప్పాడు. గత ఏడాది టమాట సాగులో మంచి లాభాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం క్యాలీఫ్లవర్‌కు మంచి డిమాండ్ ఉందని, అంతా పండ్లు, కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నాడు. సుఖరామ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. కోడళ్లు, మనువళ్లు మొత్తం ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగాల వైపు వెళ్లలేదు. మనవడు ఎంఎస్సీ హార్టికల్చర్ చేయడంతో అంతా సమిష్టిగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవంభిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాదికి కోట్లలో ఆదాయం గడిస్తున్నారు.

ఈ రైతు కృషిని గుర్తించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2012లో ‘డాక్టర్ ఖుబ్‌చంద్ బాఘేల్ కృషక్ రత్న’ అవార్డుతో సత్కరించింది. 6ఎకరాలలో వ్యవసాయం ప్రారంభించిన సుఖ్‌రామ్.. ప్రస్తుతం 60ఎకరాల భూమికి యజమాని అయ్యాడు. అంతేగాకుండా సుమారు 40 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా మంచి భవంతి కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని, ఎన్నుకున్న రంగంలో మొదట కష్టాలు వచ్చినా… చివరికి విజయం వరిస్తుందనే సత్యాన్ని సుఖ్‌రామ్ నిజం చేసి చూపించాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని పలువురు రైతులు. సుఖ్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Leave Your Comments

Soil Testing Procedure: మట్టి పరీక్షా విధానములో కర్బనము కనుగొనే ప్రక్రియ

Previous article

Bay Leaf Health Benefits: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం

Next article

You may also like