Farmer Narayanappa: కేవలం రెండు ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన నారాయణప్ప ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. గ్లోబల్ స్థాయి “కర్మ వీర్ చక్ర అవార్డు”తో నారాయణప్ప డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్, రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కాజోల్ తదితర దిగ్గజాల జాబితాలో స్థానం సంపాదించారు. ప్రకృతి వ్యవసాయ కారణంగా “రియల్ హీరోస్” జాబితాలో చోటుచేసుకొన్నారు.కరవు ప్రాంతంగా ముద్రపడి వ్యవసాయం ఓ సవాలుగా నిలిచిన అనంతపురం జిల్లాకు చెందిన నారాయణప్ప ఈ అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం.
వ్యవసాయంలో ఓ కొత్త ఒరవడి సృష్టించి ఏటీఎం (ఎనీ టైం మనీ ) మోడల్ ద్వారా సీజన్ తో సంబంధం లేకుండా ఏడాదిపొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని నిరూపించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సన్న, చిన్న కారు రైతులందరికీ తక్కువ విస్తీర్ణంలో అత్యధిక లాభాలు పొందవచ్చని దిశా నిర్దేశం చేశారు. సన్న చిన్నకారు వర్గానికి చెందిన నారాయణప్ప ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న ఏటీఎం మోడల్ ద్వారా తక్కువ విస్తీర్ణం (30 సెంట్లలో)లో అనేక రకాల పంటలు ఉత్పత్తి చేసి ఆర్థికంగా ఎదగడం,సమాజానికి సురక్షిత పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయడమే గాకుండా నేలలో కర్బన స్థిరీకణం కూడా జరుగుతోందని అవార్డు ప్రధాతలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకే 3500 మంది రైతులు నారాయణప్పతో ఆరంభమైన ఏటీఎం మోడల్ అనుసరిస్తున్నారు. దేశంలో 85 % వరకు ఉన్న సన్న చిన్నకారు రైతులందరూ ఈ ఏటీఎం మోడల్ అనుసరించడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని “క్లయిమేట్ చేంజ్” సాధ్యం అవుతుందని గుర్తిస్తూ నారాయణప్పను “ఓ చేంజ్ ఏజెంట్” గా అభివర్ణించి అవార్డు కు ఎంపిక చేశారు.
ఐక్యరాజ్య సమితి,రెక్స్ కర్మ వీర్ గ్లోబల్ ఫెల్లోషిప్ (RKGF) ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన (International Confederation of NGOs) కర్మవీర్ చక్ర అవార్డు 2023-24 వ సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న నారాయణప్పను వరించింది. మూడు కేటగిరీ లలో (బంగారు, వెండి, కంచు) ఉన్నఈ ప్రపంచ స్థాయి అవార్డుకు బంగారు కేటగిరీలో నారాయణప్ప ఎంపికయ్యారు.
ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చేలా సరికొత్త ఆవిష్కరణలతో “మార్పుకు నాంది” పలికే (రియల్ హీరోస్) వ్యక్తులకు ఈ అవార్డులను అందజేస్తారు. విద్య, వైద్యం, సేవ, క్రికెట్, సినిమా, వ్యవసాయం తదితర రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వ్యక్తులను అవార్డుకు ఎంపిక చేస్తారు. ఇదివరకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్, క్రీడా విభాగం నుంచి రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, సినీ రంగం నుంచి కాజోల్ తదితర ప్రముఖులు ఈ అవార్డు అందుకొన్నవారిలో ఉన్నారు. దేశంలోనే బాగా వెనుకబడ్డ అనంతపురం జిల్లా మల్లాపురం గ్రామానికి చెందిన ఎం.నారాయణప్ప కూడా ఈ జాబితాలో చోటుచేసుకోవడం విశేషం. నారాయణప్పకు ఈ అవార్డుతో పాటు కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్(2023-24) కూడా లభించింది. ప్రకృతి వ్యవసాయంలో నిరంతరం ఆదాయం పొందగలిగే ఏటీఎం మోడల్ తో పాటు అత్యధిక లాభాలను ఆర్జించే ఏ గ్రేడ్ మోడల్ కూడా ఆవిష్కరించి రైతులందరికీ ఆదర్శంగా నిలిచిన నారాయనప్ప అరుదైన గౌరవం దక్కించుకొన్నారు.ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆదర్శవంతమైన వ్యవసాయ క్షేత్రాలను అమలుచేస్తున్ననారాయణప్ప గురించి, అతని పనితీరు గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
నారాయణప్ప విజయ గాధ:
కేవలం 5 వేల రూపాయల ఖర్చుతో 30 సెంట్ల విస్తీర్ణంలో 20 రకాల కూరగాయాలను పండించి 2 లక్షల వరకు ఆదాయం పొందిన ఎం.నారాయణప్ప విజయ గాధ వివరాల్లోకి వెళదాం ……
కుటుంబ నేపథ్యం:
నారాయణప్పది వ్యవసాయ రైతు కుటుంబం. రెండెకరాల సొంత పొలం ఉంది. రసాయన వ్యవసాయం చేసే నారాయణప్ప తండ్రికి ఎంత పని చేసినా తక్కువ కూలి వచ్చేది. ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలతో ఏడుగురు సంతానం గల ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.దీంతో తొమ్మిదవ తరగతిలోనే చదువు మానేసి నారాయణప్ప నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు మేస్త్రీ పనికి వెళ్ళేవారు.సోదరులు కూడా పనికి వెళ్ళేవారు. నలుగురు అక్క చెల్లెళ్ల వివాహ విషయమై నారాయణప్ప తండ్రి నిరంతరం కలత చెందేవారు. అప్పులు చేసి వారి వివాహాలు జరిపించారు. కుటుంబ సభ్యులు అందరూ పని చేస్తున్నా కుటుంబ పోషణ భారంగానే సాగేది. ఇలా ఉండగానే ఎన్నో ఇబ్బందుల్లో నారాయణప్ప తల్లితండ్రులిద్దరూ కాలం చేసారు.
ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు:
20 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తున్న నారాయణప్పకు వర్షాలు లేక దిగుబడి,రాబడి వచ్చేదికాదు. రసాయన వ్యవసాయ ప్రభావం వల్ల భూమి బీడుబారిపోయింది.దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. అటువంటి తరుణంలోనే నారాయణప్ప రైతు సాధికార సంస్థ సిబ్బందిని కలిశారు. సంస్థ అందించే ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో పాటించే 9 సూత్రాలను అర్ధం చేసుకున్నారు.365 రోజులు భూమిని కప్పి ఉంచడం,నేలను తక్కువ దున్నటం,పాడి పశువులతో సమగ్ర వ్యవసాయం చేయడం, దేశి విత్తనాలు వాడటం తదితర సూత్రాలను అనుసరించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే సాగు చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
30 సెంట్లలో 20 రకాల కూరగాయలు:
నారాయణప్ప 30 సెంట్ల భూమిలో 20 రకాల కూరగాయల మొక్కలతో 365 రోజులు భూమిని కప్పిఉంచే పద్ధతిలో వ్యవసాయం చేసారు. వారానికి,నెలకు,నాలుగు నెలలకు ఇలా ఏదో ఒక పంట దిగుబడి అవుతూ ఏడాది పొడవునా ఖచ్చితంగా ఆదాయం రావటం అతనికి సంతోషం కలిగించింది. అంతే కాక మట్టి ,భూమి ఆరోగ్యంగా మారటం,మెత్తబడటం,ఆకులు,కాండం ఆరోగ్యంగా ఉండటం తదితర ఆర్థికేతర అంశాలను కూడా అయన గమనించారు. రసాయన వ్యవసాయంలో 30 వేల రూపాయల వరకు ఖర్చు చేసే అయన ప్రకృతి వ్యవసాయ విధానంలో కేవలం 5 వేల రూపాయల ఖర్చుతో 2 లక్షల వరకు ఆదాయం పొందగలిగారు. అంతేగాక ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు 30 నుంచి 50 రకాల పోషకాలు కలిగిఉండగా రసాయన విధానంలో 70 శాతం పోషక విలువలు కోల్పోవలసి ఉంటుంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే రసాయన ఉత్పత్తులు సాధారణ ఉష్ణోగ్రతలో 2 రోజులకు మించి తాజాగా ఉండవు. అదే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులయితే సాధారణ ఉష్ణోగ్రతలో కూడా వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎటీఎం పద్ధతిని అనుసరిస్తూ 3 సీజన్లలో పంటలు పండిస్తుండడంతో ఏడాది పొడవునా ఆహారకొరత లేదు. పౌష్టికాహారం కారణంగా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంది. రుణాలు తీర్చేసి ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు. నేల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడింది. నారాయణప్ప తనతో పాటు ఇతరులు కూడా లబ్దిపొందాలని స్వతహాగా తన తోటి రైతుల్లో 25 మందిని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఎటీఎం మోడల్స్ వేయించారు.
రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చూస్తూ పెరిగిన నారాయణప్పకు పశువులతో సమయం గడపటం ఎంతో ఇష్టం అని చెబుతున్నారు.3 ఆవులు కలిగిన నారాయణప్ప ఎప్పటికైనా ఎక్కువ పశువులతో పూర్తిస్థాయి సమగ్ర వ్యవసాయం నిర్వహించాలని అనుకుంటున్నారు. దానికి తగ్గ నిర్వాహణ, ఆర్ధిక ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.
తోటి రైతులు వద్దన్నా…!
ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన తొలి రోజుల్లో ఇరుగు పొరుగు వాళ్ళు కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయవద్దని, తెలిసిన మార్గంలో వెళితే మంచిదని నారాయణప్పకు సలహా ఇచ్చారు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించడం వల్లనే నా జీవితంలో గొప్ప సాధన, ఘనత సాధ్యమయిందని నేడు సగర్వంగా తెలియజేస్తున్నారు. అటువంటి తృప్తిని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణ, పనిలో నిబద్ధత కలిగి ఉండి సరైన మార్గంలో నడిస్తే తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తు బాగుంటుందని తాను నమ్ముతున్నసిద్దాంతం అని నారాయణప్ప తన అభిప్రాయాన్నివెలిబుచ్చారు. వృత్తి పరంగా భూమాతను నమ్ముకున్న నారాయణప్ప చివరి వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తానని చెబుతున్నారు. సమయం,ఆర్ధిక బలం వంటి వనరులు ఉంటే వ్యవసాయ రంగానికి సంబందించిన ఉన్నత చదువులు అభ్యసించి శాస్త్రీయ పరమైన ప్రయోగాలు చేస్తూ యువతర రైతులను ప్రోత్సహించుటకు నా వంతుగా కృషి చేసేవాడినని అంటున్నారు.నన్ను పోషిస్తున్న భూమి నాకు ఎంతో విలువైనదని, ప్రత్యేకించి ఓ గోశాల నిర్వహించాలనేది నా కోరిక అని అంటున్నారు.
మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి: నారాయణప్ప
మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని, ఆ తర్వాత కుటుంబం,బంధువులు,స్నేహితులు,సమాజానికి ఆ మార్పు విస్తరించి చివరికి సమాజ శ్రేయస్సుకి దోహదపడుతుందని,నేను ఒక్కడినే పూర్తి ప్రపంచాన్నిమార్చలేకపోయినా నా వల్ల కొంతమంది ప్రభావితులైనా నాకు సంతోషమే అని నారాయణప్ప తన ఆంతరంగాన్ని వెల్లడించారు. ఓటమికి భయపడకుండా నిరంతర కృషితో కష్టపడ్డ నారాయణప్ప ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం పొందుతున్నారు. తన శ్రమను గుర్తించి ఈ స్థానంలో నిలబెట్టిన పెద్దలందరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ప్రకృతి వ్యవసాయంలో నారాయణప్పకు
గ్లోబల్ స్థాయి కర్మవీర్ చక్ర అవార్డు