Farmer Success Story: నేను వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి 51 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1970వ సంవత్సరంలో వ్యవసాయంలోకి అడుగుపెట్టాను. చిన్నప్పటి నుండి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండటం కారణంగా నేను వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేసేవాడిని. నేను వ్యవసాయంలో అడుగుపెట్టిన రోజుల్లో రసాయన ఎరువులు , పురుగు మందులు ఉండేవి కావు. మా వంశంలో అందరూ భూమిని పోషించుకోవడంలో పోటీ పడుతుండేవాళ్లు. మా నాన్న గారు ఎకరానికి 14 బండ్ల పశువుల పెంట తీసుకుళ్ళేవారు. మా పెద్దనాన్న గారు 16 బండ్ల పశువుల పెంట తీసుకెళ్లేవారు. ఇలా మా వంశం భూమిని పోషించడంలో పోటీ పడుతుండేవాళ్ళం.
ప్రస్తుతం భూమిని నాశనం చేయడానికి పోటీ పడుతున్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల పచ్చిమగోదారి జిల్లాలో దాదాపుగా 80 బస్తాలు యావరేజ్ గా పండిస్తున్నారు. ఈ రోజుల్లో ఏ ఒక్క రైతుని పలకరించి అడిగినా గిట్టుబాటు లేదని చెప్తున్నాడు. మా రోజుల్లో 20 బస్తాలు పండించి ఆనందంగా జీవించాము. కానీ ఈ రోజు 80 నుంచి 100 బస్తాలు పండినప్పటికీ రైతులు ఆనందంగా ఉండట్లేదు. దానికి కారణం ఒక్క రైతుకు కూడా భూమితో అనుబంధం లేకుండా పోయింది. మా రోజుల్లో భూమి నుండి తీసుకునే దానికంటే ఇవ్వడానికి మొగ్గు చూపేవాళ్ళు. భూమితో రైతుకు అవినాభావ సంబంధం ఉండేది.
Also Read: మినీ ట్రాక్టర్ తయారీతో స్ఫూర్తిగా నిలిచిన కర్నూలు రైతు
4 బస్తాల ఎరువుని వ్యవసాయ శాఖ రికమెండ్ చేస్తే ప్రస్తుతం రైతులు 12 నుంచి 15 బస్తాలు వాడుతున్నారు. దీంతో భూమి నాశనం అవుతుంది. ఔషధాన్ని చేతులారా విషం చేసుకుంటున్నాం. ప్రకృతికి అనుకూలమైన జీవన విధానం లేని కారణంగా మన సంపాదనలో 30 శాతం వైద్యానికి ఖర్చు చేస్తున్నాము. జిల్లాలో రసాయన ఎరువులు లేకుండా చెరుకు ముప్పై టన్నులు అయితే 50 టన్నులు పండించాను. వరి 20 నుంచి 30 బస్తాలు తేలికగా పండుతుంది సేంద్రియ పద్దతిలో. 70 రూపాయలతో కాషాయం తయారు చేసుకుని ఎకరానికి రెండు సార్లు పిచికారీ చేస్తాను. నేను పండించే పొలంలో ఎటువంటి పురుగులు కనిపించవు. మొదట్లో పుల్లటి మజ్జిగ, ఇంగువ, పేడ, మూత్రం కలిపి పిచికారీ చేసేవాడిని. దీని ఖర్చు కేవలం 70 రూపాయలు మాత్రమే.
నేను చేసే వ్యవసాయ విధానం ద్వారా బయోడైవర్సి కాపాడబడుతుంది. మెత్తటి పురుగులు జీవించబడుతున్నాయి. ప్రకృతికి ఎటువంటి హాని కలగడం లేదు. 30 శాతం నీటి వినియోగం తగ్గిపోయింది. నా పక్క రైతులు వరికి మూడు తడులు పెడితే నేను మాత్రం రెండు తడులు పెడుతున్నాను. పంట పండటం ఎంత ముఖ్యమో, ఆదాయం రాబట్టడం కూడా అంతే ముఖ్యం. నేను నాలుగున్నర టన్నుల బెల్లం తయారు చేస్తున్నాను. బెల్లాన్ని మార్కెట్లో 50 రూపాయలు కాగా నా దగ్గర 100 రూపాయలు. నా పంటను విదేశీయులు అడిగినప్పటికీ నా పంటను నా దేశమే తినాలని నిర్ణయించుకున్నాను. నేనేం గొప్ప గొప్ప పనులు చేయలేదు. మా పెద్దలు నేర్పించిన దానిని అనుసరించాను అంతే అని అన్నారు భూపతి రాజు.
Also Read: వేసవిలో గులాబీ మొక్కల సంరక్షణ