Tips to Farmers in Rainy Season: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో సగటు వర్షపాతం నమోదు కాకపోయినా, జూలైలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఏపీలో రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికీ సరైన వర్షపాతం నమోదు కాలేదు. తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దాం.
పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మొక్కజొన్న, పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారి తిప్పేస్వామి, ఏఈఓ వినోద్ సూచిస్తున్నారు. వరి పొలాల్లోనూ అవసరం మేరకు నీరు ఉండేలా చూడాలి. వరి పొలం మునిగేలా ఉంటే వెంటనే నీటిని వదిలేయాలి. అధిక వర్సాలకు పత్తి మొక్కలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి మొక్కల వయసును బట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదు 19, 19, 19 ఎరువులను లీటరు నీటిలో బాగా కలపి మొక్కలపై పిచికారి చేయాలి.
వర్షాలు తగ్గిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కలకు 5 సెం.మీ దూరంలో వేసుకోవాలి. అధిక తేమ వల్ల పత్తి మొక్కల వేళ్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. వేరుకుళ్లు తెగుళ్లు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, లేదా లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలపి ఆ ద్రావణాన్ని తెలుగు సోకిన మొక్కల వేళ్లు తడిచేలా వారం వ్యవధిలో రెండుసార్లు పోయాలి.
Also Read: Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.!
జొన్న, మొక్కజొన్నలో యాజమాన్యం
జొన్న, మొక్కజొన్న పంటలు అధిక తేమ వల్ల భాస్వరం లోపిస్తుంది. మొక్కలు ఊదారంగులోకి మారే అవకాశం ఉంది. వర్షాలు తగ్గగానే లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్, లేదా లీటరు నీటికి పది గ్రాముల 19,19,19 నీటిలో బాగా కలిపి పిచికారి చేయాలి. వర్షాలు తగ్గగానే ఎకరాకు 25 కిలోల యూరియా,
ఎకరాకు 15 నుంచి 20 కిలోల పొటాష్ మొక్కలకు 5 సె.మీ దూరంలో వేసుకోవాలి. మొక్కజొన్న, జొన్నలో కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం లీటరు నీటికి 0.4 మి.లీ క్లోరాంత్రనిలిప్రోల్ లేదా లీటరు నీటికి 0.5 మి.లీ స్పైనటోరం కలపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.
వరిలో యాజమాన్యం
ఇప్పటికే వరినాట్లు వేసిన రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పొలం అధిక వర్షాలు, వరదకు పూర్తిగా దెబ్బతింటే దాన్ని తొలగించి మరలా వెంటనే నాట్లు వేసుకోవాలి. అయితే ఆలస్యంగా నాట్లు వేసే రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. చల్లటి వాతావరణం ఉంది కాబట్టి అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల ట్రైసైక్లోజోల్, మాంకోజెబ్ కలపి పిచికారి చేయాలి. ఆయిల్ పామ్ తోటల్లో మొక్కల మొదళ్లలో నీరు నిల్వ లేకుండా రైతులు యాజమాన్య పద్దతులు పాటించాలి.
Also Read: Telangana Agricultural Schemes: ఉపాధి హామీతో రైతుకు బాసటగా తెలంగాణ ప్రభుత్వం