నవంబరు- డిసెంబరులో చెరకు నాటుకునే రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల నుంచి విత్తనం ఎన్నుకోవాలి. ఎటువంటి చీడపీడలు, తెగుళ్ళు ఆశించని తోటలనుంచి ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనంఎంపిక చేసుకోవాలి. తెలంగాణాలో నవంబరు – డిసెంబరులో నాటేందుకు కో. 86032, కో. 8005, 93 వి 297, 2003 వి 46 వంటి చెరకు రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతాల్లో నీటిఎద్దడిని తట్టుకునే 83 ఆర్ 23, 85 ఆర్ 186, కో 99004 రకాలను నాటుకోవాలి.
చెరకు నాటడానికి నాలుగు నుంచి ఆరు వారాల ముందు సేంద్రియ ఎరువులను నెలలో వేసి కలియదున్నాలి. నీటి ముంపునకు గురయ్యే నల్లరేగడి, ఒండ్రు నేలల్లో చెరకు నాటడానికి ముందే జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చి రొట్ట పైర్లను పెంచి 60 రోజుల తర్వాత నేలలో కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది.తద్వారా పంట బాగా పెరగడానికి దోహదపడుతుంది. చెరకు నాటే ముందు మెత్తటి లోతు దుక్కి చేసి, చదును చేసిన తరువాత కాలువలు, బోదెలుగా చేసి చెరకు నాటుకోవాలి. తెలంగాణాలో మెదక్ జిల్లా బసంతపూర్ లోని వ్యవసాయ పరిశోధన స్థానంలో చెరకు పంటపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అక్కడి శాస్త్రవేత్తలను సంప్రదించి చెరకు రకాలు, సాగుకు సంబంధించిన వివరాలను పొందవచ్చు.
Leave Your Comments