Farmer Success Story: నా పేరు అల్లూరి ధర్మారావు, నాది సింగభూపాలెం గ్రామం, సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు 11 ఎకరాల భూమి ఉంది. గతంలో ప్రధాన పంటగా ప్రతి సాగు చేస్తూ, పంట పొలం గట్లపై బోడ కాకర మరియు ఇతర తీగ జాతి కూరగాయ మొక్కలను సాగు చేస్తుండే వాడిని కాగా 3-4 సంవత్సరాలుగా నికర ఆదాయం తగ్గడంతో కృషి విజ్ఞాన కేంద్రం, కొత్తగూడెం వారి సలహా కొరకు సంప్రదించగా, శాస్త్రవేత్తలు బోడ కాకర లేదా ఆగాకర అనే కూరగాయ భద్రాద్రి జిల్లా మరియు తెలంగాణాలోని చాలా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న ప్రాముఖ్యమైన పంట.
అదే విధంగా మార్కెట్లో సైతం వీటికి మంచి డిమాండ్ ఉన్నది కావున పందిరి వేసి డ్రిప్ పద్ధతిలో సాగు చేసినట్లయితే లాభాలు పొందవచ్చునని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ గారి సలహా మేరకు 6 ఎకరాల్లో శాశ్వత పందిరి వేయించి డ్రిప్ ద్వారా బోడ కాకర సాగు చేయడం మొదలుపెట్టాను. ఈ పంటను మే నెలలో, పందిరి పద్ధతిలో నాటుకున్నాను. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టాను.
సాగులో నేను ప్రధానంగా చేపట్టిన మెళకువలు..
. ఆడ, మగ మొక్కలను 10:1 నిష్పత్తిలో నాటుకున్నాను.
. సూక్ష్మ పోషక ఎరువులను 2-4 ఆకుల దశలో మరియు పంట నాటిన 50 రోజుల తర్వాత 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేశాను.
. పంటలో వచ్చే చీడపీడల నియంత్రణకు 10,000 పిపియం వేపనూనెను పిచికారి చేశాను అదే విధంగా పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 20 మరియు పండు ఈగ ఎరలు ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసుకొని పురుగులను నియంత్రించుకున్నాను.
బోడ కాకర సాగు మెళకువలు, ఎరువులు మరియు చీడపీడల నివారణ చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రం, కొత్తగూడెం శాస్త్రవేత్తల బృందం యొక్క సూచనలను పాటించగా, ఒక ఎకరాకు 35 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో మంచి రేటు ఉండటంతో మాకు మంచి లాభం వచ్చింది. నేను ఈ పద్ధతిని 2 సంవత్సరాలుగా పాటిస్తున్నాను. మొదటి ఏడాదిలో శాశ్వత పందిరి మరియు డ్రిప్‌ల ఏర్పాటుకు అధిక ఖర్చైంది.
నేను ఒక సారి నాటిన దుంపలను తరువాతి సంవత్సరముకు కూడా ఉపయోగించుట ద్వారా సాగు ఖర్చు తగ్గి అధిక నికర ఆదాయం పొందగలిగాను. కావున మాకు ఈ పద్ధతిని పరిచయం చేసి, ప్రోత్సహించిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇటువంటి నూతన విధానాలను అవలంభిస్తూ వ్యవసాయంలో లాభాలు పొందగలరని నా తోటి రైతన్నకు మనవి.
బోడ కాకర సాగుకు ఖర్చు మరియు ఆదాయ వివరములు :
ఒక హెక్ట్టారు పందిరి మరియు డ్రిప్ ఏర్పాటుకు అయిన ఖర్చు (లక్షల్లో) 2.2
ఒక హెక్ట్టారు సాగుకు అయిన ఖర్చు (లక్షల్లో) 4.70
ఒక క్వింటాల్ మార్కెట్ ధర (రూ.) 12000
ఒక హెక్ట్టారు దిగుబడి (క్వింటాల్) 86.0
ఒక హెక్ట్టారు నుండి వచ్చిన మొత్తం ఆదాయం (లక్షల్లో) 10.32
ఒక హెక్ట్టారు నుండి వచ్చిన నికర ఆదాయం (లక్షల్లో) 3.4
ఆదాయ వ్యయాల నిష్పత్తి 1.5:1
Also Read: Coconut Friendly Worms: కొబ్బరిలో ఆశించే మిత్రపురుగులు (బదనికలు)