Success Story : అమ్మతనాన్ని ప్రసాదించిన ప్రకృతి వ్యవసాయం
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం, పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా అంతకు మించి అద్భుతాలు సాధించవచ్చునని ప్రకృతి వ్యవసాయం నిరూపిస్తోంది. ఒక ఉదంతంలో కాన్సర్ వ్యాధి తీవ్రతను, మరో ఉదంతంలో మధుమేహ వ్యాధిని తగ్గించి మందుల అవసరాన్ని పరిమితం చేస్తున్నాయన్న నమ్మకం కలిగిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మరో అద్భుత ఫలితానికి నాంది పలికింది. రెండు పర్యాయములు మూడు నెలల వయసు గల బిడ్డను కోల్పోయిన ఓ తల్లికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మాతృత్వపు భాగ్యం కలిగించాయి. మూడవ సారి కూడా గర్భస్థ శిశువు ఆరోగ్యంగా లేనందున అబార్షన్ చేయాల్సిందేనని డాక్టర్లు సూచించినా ఆ తల్లి అన్నపూర్ణ రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మీద గల ప్రగాఢ విశ్వాసంతో డాక్టర్ల మాటలు కూడా లెక్కచేయక తన గర్భాన్ని కొనసాగించింది. ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం గడించిన భార్యాభర్తలు ఇద్దరూ ఇకమీదట రసాయన ఉత్పత్తుల జోలికి వెళ్ళకుండా తాము పండించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే ఆహారంలో తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అన్నపూర్ణ డాక్టర్ లు సూచించిన మందుల వినియోగానికి కూడా స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడటం వల్ల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నాలుగేళ్ల వయసుగల ఆ అబ్బాయి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రస్తుతం ప్లే స్కూల్ కు వెళుతున్నాడు. అంతేకాదు రెండేళ్ల తర్వాత మరో బిడ్డకు కూడా ఆ తల్లి జన్మనిచ్చింది. కేవలం రెండు ఎకరాల పొలంలో ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్స్ తో ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ ఆ కుటుంబం ప్రస్తుతం ఆనందోత్సాహలతో జీవనం గడుపుతోంది. రైతు సాధికార సంస్థకు ఆజన్మాంతం ఋణపడి ఉంటామని ఆ దంపతులు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విజయ గాధ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొందాం……..
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన అన్నపూర్ణ తన పదవ తరగతి పూర్తి కాగానే 2007 వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళింది. 2009 వ సంవత్సరంలో ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. గర్భం దాల్చిన సమయంలో రెగ్యులర్ గా డాక్టర్లను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు పాటిస్తూనే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మూడు నెలలకే చనిపోయింది. అన్నపూర్ణ 2011 లో కూడా మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన సమయంలో ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నా మూడు నెలల తర్వాత చనిపోవడం ఆ దంపతులను ఎంతగానో కలచి వేసింది. ఈ బాధను దిగమింగుకోలేని అన్నపూర్ణ నిరాశకు గురియై కొంతకాలం ఎవ్వరితోనూ కలవక సమాజానికి దూరంగా ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో అన్నపూర్ణ 2012 వ సంవత్సరంలో NPM (Non Pest Management) ప్రాజెక్టు లో Village Activist గా చేరారు. మూడేళ్లు అక్కడ పని చేసిన తర్వాత ZBNF ప్రాజెక్టు లో CRP (Community Resource Person) గా చేరారు. ఆ తర్వాత 2018-19 వ సంవత్సరంలో సబ్ డివిజినల్ యాంకర్ గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం మెంటార్ గా పనిచేస్తున్నారు.
NPM, APCNF ప్రాజెక్టులలో దాదాపు 11 ఏళ్ల సుధీర్ఘ అనుభవంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై ఆ దంపతులకు గల సంపూర్ణ విశ్వాసం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఊహించని అద్భుత ఫలితాలకు దారితీసింది. 2018 వ సంవత్సరం వరకు ఆ దంపతులు కూలీలుగానే కాలం వెళ్లదీసారు. 2018 వ సంవత్సరంలో 2 ఎకరాల మామిడి తోటను లీజు కు తీసుకొన్నారు. మొదట్లో ఒక ఎకరాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించిన అన్నపూర్ణ కుటుంబం గత రెండేళ్లుగా పూర్తి విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు. కేవలం వ్యవసాయమే ఆ కుటుంబానికి జీవనాధారం. మరే ఇతర ఆదాయం లేదు. బోరు బావి కలిగియున్నా ఇసుక నేలలు కావడంతో తుంగ గడ్డి సమస్య వారికి ఎదురవుతుండేది. మెంటార్ గా బాధ్యతలు స్వీకరించక ముందు గోంగూర, వంగ, మిర్చి, దోస, అనప, బీర పంటలతో మంచి దిగుబడి, ఆదాయం సాధించిన అన్నపూర్ణ కుటుంబం ఇటీవలనే 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం (Any Time Money) మోడల్ వేశారు. మామిడి చెట్ల మద్యలో వేరుశనగ, కంది, సూర్య గుమ్మడి, అనప, బంతి మద్యలో మిర్చి, టమోటా, గోరుచిక్కుడు, తోటకూర, బెండ, బొబ్బర్లు ఓ క్రమ పద్ధతిలో వేశారు. ఒక్క గోంగూరలోనే ప్రతి నెలా 40 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు. రాజమండ్రి మార్కెట్లో అన్నపూర్ణ విక్రయించే గోంగూరకు ఓ ప్రత్యేక డిమాండ్ ఉంది. మిగతా కూరగాయలు చుట్టుపక్కల రైతులే కొనుగోలు చేస్తున్నారు. పొలాన్ని దుక్కి దున్నకుండా PMDS లో 28 రకాల విత్తనాలు చల్లి నేలను సారవంతం చేసుకొంటున్నారు. జీవ ఉత్ప్రేరకాలను కూడా సొంతంగా తయారు చేసుకొంటున్నారు. అంతేగాక తోటి రైతులకు కూడా సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా కూడా ఏటా 10 నుంచి 20 వేల వరకు ఆదాయం సమకూర్చుకొంటున్నారు. SHG లో రుణం తీసుకొని విత్తనాలను తోటి రైతులకు అందించే అన్నపూర్ణ కుటుంబం కరోనా సమయంలో విత్తనాలు మిగిలి పోవడంతో అన్ని రకాల విత్తనాలను తమ పొలానికే వినియోగించారు.
ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన గోంగూరతో ఆమె పచ్చడి వ్యాపారం లోకి అడుగు పెట్టారు. టమోటా, కరివేపాకు, కోతిమీర మరియు కోడి మాంసం పచ్చడి కూడా తయారు చేసి అమ్ముతున్నారు. మొదట ఆర్డర్ల మీద మాత్రమే చేసే అన్నపూర్ణ గారు ఇప్పుడు బల్క్ గా పచ్చళ్లు తయారు చేస్తున్నారు. అన్నపూర్ణ గారు ఈ పచ్చళ్ల తయారీకి అవసరమైన ముడి సరుకులన్నీ ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించే రైతుల నుంచి కొని వాడుతున్నారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకొన్న అన్నపూర్ణ 2018-19 లో రెండేళ్ల వ్యవసాయ డిప్లొమా కూడా పూర్తి చేశారు.
నేల సారవంతం అయింది- రైతు సాధికార సంస్థకు ఋణపడి ఉంటాం- అన్నపూర్ణ
Zero tillage, biodiversity కారణంగా నేల సారవంతం అయింది. ఇసుక నేలలో మట్టి వచ్చి చేరింది. Yellow sticks కూడా పెట్టలేదు. మిర్చి పంటకు పురుగు కనబడటంతో ఒకే ఒకసారి దశపర్ణి కషాయం చల్లడం జరిగినది. కేవలం ఘన (ఎకరాకు 400 కేజీలు), ద్రవ (ప్రతి 15 రోజులకు ఒకసారి) జీవామృతంలను మాత్రమే వాడుతున్నాము. మా ఇంట్లో కుటుంబానికి అవసరమయ్యే అన్నింటికీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే వాడుతున్నాము. మా పొలంలో పండించని సరుకులను కూడా మార్కెట్లో పరిశీలించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినవే కొనుగోలు చేస్తున్నాము. రసాయన వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉన్నాము. మాకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నాము.
కేవలం రెండున్నర నెలలలోనే 1.52 లక్షల నికర ఆదాయం పొందగలిగాము. బోరెవెల్ రిపేరీలో ఉండటంతో వర్షాధారంలోనే ఈ ఆదాయం లభించింది. ఆగస్టు నుంచి అక్టోబర్ మద్యకాలంలో ఈ ఆదాయం సమకూరింది. గతంలో ద్రవజీవామృతం పారించేవాళ్ళం. ప్రస్తుతం నెలకు రెండు సార్లు స్ప్రే చేయడంతోనే సరిపోతుంది. నీటి వినియోగం కూడా బాగా తగ్గింది.
ఆదాయ వ్యయాల వివరాలు
(రెండు ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర నెలల్లో వచ్చిన ఆదాయ వ్యయ వివరాలు)