Maize cultivation మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారంగాను మరియు సాగునీటి క్రింద ఖరీఫ్, రబీ కాలాల్లో పండించబడుతుంది. మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగాను మరియు కాయగూర రకంగాను సాగుచేయబడుతుంది.
మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారం క్రింద సుమారు5.3 లక్షల హెక్టార్లలో మరియు నీటి పారుదల క్రింద సుమారుగా 3.3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వర్షాధారం క్రింద ముఖ్యముగా మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, జిల్లాలలో అధిక సాగులో ఉన్నది. నీటి పారుదల క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువ సాగులో ఉన్నది.
జీరో టిల్లెజ్ :
ఈ పధ్ధతి లో వరి కోసిన తర్వాత పొలం లో వరి కొయ్య కాళ్ళు ఉండగానే దుక్కి దున్నకుండా పదును చూసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తడాన్ని ‘జీరో టిల్లెజ్’ అంటారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగులో నేల పదును గుర్తించి విత్తనాలు వేయడం అనేది చాలా ముఖ్యమైనది. వరి కోసిన తర్వాత సరైన పదును లో విత్తనాలు వేయాలి. నేల బాగా బురద గా ఉన్నపుడు అలాగే బాగా ఆరిపోయిన తర్వాత విత్తనాలు వేస్తే మొలక దెబ్బ తింటుంది.
వరి కోసిన పొలం లో నడిస్తే కాలు అచ్చు పడే పదును లో విత్తనాలు వేసుకుంటే మొలక బాగా వచ్చి పంట ఏపుగా పెరుగుతుంది. ఈ విధానం లో రైతులకు ఎకరానికి రూ. 1200/- దున్నడానికి అయ్యే ఖర్చులు ఆదా అవుతాయి. నేల రోజుల పంట కాలం కలిసి వస్తుంది. ఈ పధ్ధతి లో ఒక ఎకరం వరి పండించే నీటితో 2% ఎకరాల మొక్కజొన్న ను పండించ వచ్చు.
లాభాలు:
- ఈ పద్ధతి లో సాగు చేయడం వల్ల ఒక నెల ముందు పంట తీసుకోవచ్చు.
- మార్కెట్ లో ఒక నెల ముందే పంట ను అమ్ముకోవడం వల్ల మంచి ధర లభిస్తుంది.
- ప్రతి ఎకరానికి దాదాపు రూ 1200/- వరకు దుక్కి ఖర్చులు ఆదా అవుతాయి. 4. ఒక ఎకరం వరి పండించే నీటితో రెండున్నర ఎకరాల మొక్క జొన్న ను పండించ వచ్చు.
- వరి కోసిన తర్వాత ఉన్న పదును ను పూర్తిగా ఉపయోగించు కోవచ్చు.
- మూడు నెలల్లో తక్కువ ఖర్చు తో, తక్కువ నీటి యాజమాన్యం తో, తక్కువ మంది కూలీలతో 30-40 బస్తాల దిగుబడి పొందవచ్చు.