Wooden Tongue Disease in Cattle: ఈ వ్యాధి తరచూ అక్కడక్కడ ఆవులు, గేదెలు మరియు యు గొర్రెలలో కలుగు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా నాలుక, మెడ, తల, నోటి కుహర కండరాలు మరియు లింఫ్ గ్రంథులలో శోధం కలుగుతుంటుంది.
Also Read: Vibriosis Disease in Cows: ఆవులలో వచ్చే విబ్రియోసిస్ వ్యాధి యాజమాన్యం.!
వ్యాధి కారకము:-
1. ఇది ” ఆక్టినో బాసిల్లస్ లిగ్నిరెసి” అనే గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది.
2. ఇది కర్ర ఆకారంలో వుండి, గాలి సహిత పరిస్థితులలో పెరుగుతుంది.
వ్యాధి బారిన పడు పశువులు:- యుక్త వయస్సులోని ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు పందులు. వర్షాకాలంలో ఈ వ్యాధి తీవ్రత అధికముగా వుంటుంది.
వ్యాధి వచ్చు మార్గము:- ఈ వ్యాధి కారకము సాధారణంగా పై పశువుల యొక్క నోటి కుహరంలో (Oral cavity) ఉండి, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు నాలుక మరియు అంగం యొక్క సూక్ష్మగాయాల ద్వారా ఈ క్రిములు పెరిగి వ్యాధిని కలుగజేస్తుంటాయి.
వ్యాధి వ్యాప్తి రెండు విధానం:- శరీరంలో ముందుగానే ఉన్న బ్యాక్టీరియాలు ప్రతికూల పరిస్థితులు కలుగ గానే ఓరల్ క్యావిటీలోని నాలుక, ఆహారవాహిక, గ్రసని, స్వరపేటిక, మెడ మరియు ఉరః కుహర కండరాలను నాశనం చేసి వాటి స్థానంలో ఫైబ్రస్ కణజాలాలను అధికంగా పెరుకుపోయేటట్లు చేస్తాయి. ఫలితంగా నాలుక గట్టిగా వెక్క మాదిరి తయారై నోటి నుండి బయటికి వ్రేలాడుతూ వుంటుంది. ఇతర పై అవయవాలలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడి ఉంటాయి. ఈ గడ్డలు కోసి చూస్తే లోపల చీము పట్టి పసుపు రంగులో సల్ఫర్ కణికలు వుండి వాటి చుట్టూ ఫైబ్రస్ టిష్యూ చేరి వుంటుంది.
లక్షణాలు:-
- నాలుక వాచి గట్టిగా వుంటుంది.
- ఈ వ్యాధి బారిన పడిన పశువులకు నోరు తెరవడం కష్టంగా వుంటుంది.
- నోటి నుండి కారుతూ వుంటుంది.
- తినడం, తాగడం చాలా కష్టంగా వుంటుంది.
- మెడ దగ్గర వుండే లింఫ్ గ్రంథులు వాచి వుంటాయి.
- నాలుక మీద చిన్న చిన్న గడ్డలు ఏర్పడి చీముపట్టి వుండును.
- దవడ క్రింద వాచి వుంటుంది.
- ఆకలి ఉండదు, పశువులు నీరసంగా ఉంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:-
(1) నాలుక గట్టిగా వుండి, లోపల చిన్న చిన్న గడ్డలు వుంటాయి.
(2) ఈ గడ్డలను కోసి చూస్తే లోపల చీము వుంటుంది.
(3) లింఫ్ గ్రంథులను కోసి చూసిన వాటి లోపల కూడా. గడ్డలు ఏర్పడి అందులో కూడా చీము పట్టి వుంటుంది.
వ్యాధి నిర్ధారణ:-
(1) వ్యాధి చరిత్ర, లక్షణములు మరియు వ్యాధి కారక చిహ్నముల ఆధారముగా వ్యాధిని నిర్ధారించవచ్చు.
(2) చీము గడ్డలను కోసి స్మియర్ను తీసుకొని “స్మియర్ ఎగ్జామినేషన్” చేసినట్లైతే అందులో గ్రామ్ నెగిటివ్ బాసిల్లై బ్యాక్టీరియాలను చూడవచ్చు.
డిఫరెన్సియల్ డయాగ్నోసిస్:-
(1) ఆక్టినోమైకోసిస్ బోవిస్
(2) నోకార్డియోసిస్
(3) బోట్రియోమైకోసిస్ వంటి వ్యాధులతో సరిపోల్చుకొని చూసుకోవలసి యుంటుంది.
చికిత్స:
(1) వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- వ్యాధి కారక క్రిములను నివారించేటందుకు బ్రాడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్ మరియు టెట్రాసైక్లిన్ వంటి ఔషధములను 7-10 రోజులు ఉపయోగించవలసి యుంటుంది. అయోడిన్ రసాయనాలను కి. లో శరీర బరువుకు 0.1 గ్రా చొప్పున నోటి ద్వారా 2-4 వారాలు ఇవ్వవలెను. లేదా ఒక కి. లో శరీర బరువుకు 70 మి.గ్రా సోడియం అయోడిన్ ను సిరల ద్వారా మొదటి మోతాదు ఇచ్చి, తిరిగి వారమునకు మరియొక మోతాదు ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఒ
(2) వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- నొప్పులను తగ్గించుటకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లను ఇవ్వవలెను. చీము గడ్డలను కోసి వాటికి అయోడిన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణములతో శుభ్రం చేయవలెను.
(3) ఆధారము కల్పించు చికిత్స:-
(a) ఈ వ్యాధి బారిన పడిన పశువులు నోటి ద్వారా ఆహారం తీసుకోలేవు కనుక వాటికి సెలైన్ ద్రావణములను సిరల ద్వారా ఇవ్వవలెను.
(b) విటమిన్స్ మరియు మినరల్స్ ఇంజక్షన్స్ ఇవ్వవలెను. సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను ఇవ్వవలసి యుంటుంది.
నివారణ:-
(1) వ్యాధి ఉన్నట్లు గమనించిన పశువులను మంద నుండి వేరుచేయాలి.
(2) వ్యాధి బారిన పడిన పశువులకు చికిత్స చేసి పూర్తిగా తగ్గిన తర్వాతనే తిరిగి మందలోకి చేర్చాలి.
(3) వ్యాధి సోకిన పశువు యొక్క చీము ద్రవాలతో కలుషితమైన గడ్డి, నీరును ఇతర పశువులు తినకుండా త్రాగకుండా చూడాలి.
Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!