వ్యవసాయంలో మార్పులు మొదలయ్యాయి. ఏళ్ళ తరబడి ఒకే తరహా వ్యవసాయం చెయ్యాలా అని అనుకున్నారో లేక కొంచెం రూటు మార్చాలి అనుకున్నారో ఏమో గానీ వ్యవసాయంలో మ్యాజిక్ పంటలు పండిస్తున్నారు కొందరు రైతులు. సాధారణంగా అన్నం వండాలంటే… కట్టెల పొయ్యినో, గ్యాస్స్టౌనో, ఇండక్షన్ స్టౌనో, ఎలక్ట్రిక్ కుక్కర్నో ఆశ్రయించాలి. అసలు వాటి జోలికి వెళ్లకుండానే కేవలం నీటిలో బియ్యం వేస్తే రైస్ తయారయ్యే విధానం మీరెక్కడైనా విన్నారా? . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
టెక్నాలిజీ కొత్త పుంతలు తొక్కుతుంది. దానికి తగ్గట్టు రైతుల ఆలోచన విధానంలో కూడా మార్పులు మొదలయ్యాయి. గ్యాస్ లేకుండా చల్ల నీటిలో బియ్యం వేస్తే అన్నం తయారయ్యే విధానం కనిపెట్టారు మన రైతులు. ఈ తరహా పంటని ముందుగా అస్సాంలో తయారు చేశారు. ఈ రకం బియ్యాన్ని బోకాసౌల్ గా పిలుస్తారు. ఈ తరహా బియ్యం కేవలం అస్సాం దిగువ ప్రాంతాలైన నల్బారీ, బర్పెటా, గోల్పారా, కమ్రుప్, దర్రంగ్, దుబ్రీ, చిరంగ్, కోక్రఝార్, బక్సా ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. జూన్ నుంచి డిసెంబరు నెలల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. పైగా వీటిపై ఎలాంటి రసాయనాలు, పురుగులు మందులు కూడా చల్లరు. పూర్తిగా సేంద్రీయ ఎరువులనే ఉపయోగిస్తారు.
ఈ రకం పంట వెనుకాల ఓ ఆసక్తికర కథ ఉంది. 17వ శతాబ్దంలో మొఘల్ సైనికులతో పోరాటానికి ముందు అహోం సైనికులు ఈ బియ్యాన్నే ఆహారంగా తీసుకునేవారు. దీన్ని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేకపోవడంతో యుద్ధరంగంలోకి వెళ్లే సైనికులు ఈ బియ్యాన్ని తమ వెంట తీసుకెళ్లేవారు. ఆకలేసినప్పుడు నీటిలో నానబెట్టుకుని తినేవారు. దీంతో అస్సాం ప్రజలు దీన్ని సాంప్రదాయక ఆహారంగా తినడం మొదలుపెట్టారు. బోకాసౌల్ బియ్యం శరీరంలో వేడిని కూడా నియంత్రిస్తుందని, ఇందులో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. ఇక ఈ రకం బియ్యం ధర రకాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కిలో రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. కాగా ఈ బోకాసౌల్ రకం రైస్ ని మన తెలుగు రాష్ట్రాల్లోనూ పండిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో ఈ పంట సాగు మొదలైంది.
#MagicRice #AssamMagicRice #AgricultureLatestNews #Eruvaaka