దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోల్ 70 రూపాయల నుంచి 110 రూపాయలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేటు విధించడం కారణంగా ఆ భారం సామాన్యులపై పడుతుంది. అయితే పెట్రోల్ ధరలు దిగిరావాలంటే ముందు దాని దిగుమతిని తగ్గించుకుని మన దెగ్గరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ని పెంచేందుకు కృషి చేస్తుంది. ఇంతకీ ఈ ఇథనాల్ అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఏమైనా నష్టాలు జరిగే అవకాశం ఉందా తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం..
ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే జీవ ఇంధనమే ఇథనాల్. అవును ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్‌ను తయారు చేసేవారు. కానీ ఇకపై చెరకు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, వెదురు మరియు ఇతర పంటలతో అక్కరకురాని ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చు. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపడం ద్వారా చమురు దిగుమతులకయ్యే ఖర్చును తగ్గించుకోవడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వీలుంది. ఇంకా ఈ ఇథనాల్ పెట్రోల్ లో కలపడం ద్వారా పర్యావరణానికి కూడా ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఆహార పంటలకు మంచి గిరాకీ రావడంతో పాటు రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది. దీనివల్ల ఇంధన భద్రతకు కూడా అవకాశం ఉంది.
ఇథనాల్ పెంపొందించడం వల్ల దిగుమతులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే పలు దేశాలు ఇథనాల్ ని వాడుతున్నారు. అమెరికా, బ్రెజిల్, ఐరోపా సమాఖ్య దేశాలు దశాబ్దాలుగా ఇథనాల్ వాడకాన్ని ప్రారంభించాయి. అయితే ఇథనాల్ ని వాడకం ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇథనాల్ తయారీతో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా వంటివాటి ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా లీటరు ఇథనాల్ తయారు చేయాలంటే మూడు వేల లీటర్లు అవసరం పడుతుంది. దీంతో నీటి జలాలకు తీవ్ర ముప్పు లేకపోలేదు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతర వ్యర్ధాలతో ఇథనాల్ తయారు చేసుకుంటే సమస్య ఉండదు. ఆహారధాన్యాలపైనే పూర్తిగా ఆధారపడటం భవిష్యత్తులో ముప్పు వాటిల్లుతుంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, ఆహార భద్రతకు ముప్పు రాకుండా- ఇథనాల్ తయారీ, వినియోగం వైపు అడుగులు వేస్తేనే మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి.
#EthanolFuel #ethanolAdvantages #EthanolDisadvantages #agriculturelatestnews #eruvaaka