దేశంలో సాగులో అత్యధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువును సూక్ష్మ పరిమాణంలో ద్రవరూపంలో అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. యూరియా తయారీ, వినియోగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిత్యావసరాల చట్టం సెక్షన్ 3 కింద ఎరువుల నియంత్రణ చట్టం 1985కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం యూరియాను ఘన స్పటికాల రూపంలో 45 కిలోల బస్తాగా రైతులకు విక్రయిస్తున్నారు. రాయితీ, పన్నులతో కలిపి దీని గరిష్ఠ చిల్లర ధర రూ.266 పంట సాగుకు ముందు మట్టి నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించి నత్రజని లోపం ఉంటే యూరియాను వాడాలి. అయితే దేశంలో భూసార పరీక్షలు పూర్తిస్థాయిలో జరగపోవడంతో నత్రజని లోపం ఎంత ఉందో తెలియక రైతులు ఇష్టారీతిగా యూరియాని వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై రాయితీ భారం ఎక్కువవుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రూ.47,805 కోట్లను యూరియాపై రాయితీగా కేంద్రం భరిస్తోంది. దీంతో పాటు వృథాని తగ్గించడానికి నానో యూరియాను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సిద్దమవుతున్న ఇఫ్కో కంపెనీ నానో యూరియాను 500 మిల్లీలీటర్ల సీసా రూపంలో మార్కెట్ లో విక్రయించడానికి ఇఫ్కో కంపెనీ సిద్ధమవుతోంది. ఈ కంపెనీకి నానో యూరియా తయారీపై పేటెంట్ ఉంది. అర లీటరు ద్రవ యూరియా ధర 45కిలోల బస్తా ధరకు సమానంగా ఉంటుందని సమాచారం. ఇతర కంపెనీలు ఈ పరిజ్ఞానంతో నానో యూరియా తయారుచేసి విక్రయించడానికి కేంద్ర ఎరువులశాఖ నుంచి రాష్ట్రాల వ్యవసాయ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. తాము తయారు చేసిన నానో యూరియా ప్రభావం, రసాయన గాఢత, జీవ భద్రతపై జాతీయ గుర్తింపు వున్న ప్రయోగశాలలో పరీక్షలు చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఏ ప్రాంతంలో దీనిని తయారుచేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయానికి నమూనాలు ఇచ్చి పంటలపై చల్లి పరీక్షలు చేయించి ఆమోద పత్రం తీసుకోవాలి. వినియోగంపై రైతులకు పక్కాగా శిక్షణ ఇవ్వాలి. అందులో నత్రజని ఎంత శాతం ఉంటుందనేది తెలపాలి. వినియోగం 50 శాతం తగ్గుతుంది సాధారణంగా 45కిలోల యూరియా బస్తాలో 46 శాతం నత్రజని ఉంటుంది. నానో యూరియాలోనూ నత్రజని ఇంతే ఉంటుందని అంచనా. మొక్కలు పెరిగే సమయంలో నీటిలో కలిపి ఈ యూరియాని మొక్కలపై పిచికారీ చేయాలి. ఆకుల ద్వారా అది మొక్కలోకి చేరి ఏపుగా పెరగడానికి ఉపకరిస్తుంది. దీనివల్ల నేలలో వేసేదానికన్నా 50 శాతం వినియోగం తగ్గుతుందని అంచనా. నేలలో వేసే యూరియాలో సగమే మొక్కకు చేరి మిగతాది వృథాగా నేలలో, నీటిలో కలిసి కాలుష్యం పెరుగుతోంది. నానో యూరియా తో ఈ కాలుష్యాన్ని, వృథాని తగ్గించవచ్చని భావిస్తున్నారు.