Training in trees ఫల వృక్షాలకు సరియైన ఆకృతి కోసం, అందం కోసం పెంచే మొక్కలను మనకు కావలసిన అందమైన ఆకారంలో మలుచు కోవటానికి కొమ్మల కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది.
మన అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా, చెట్టు ఆకారం కోసం కొమ్మల కత్తిరింపులు చేయటాన్ని, ట్రైనింగు (Training) అంటారు. ఇందులో ముఖ్యంగా మూడు పద్ధతులు ఉన్నాయి.
సెంట్రల్ లీడర్ లేదా క్లోజ్ సెంటర్ పద్ధతి: ఈ పద్ధతిలో ప్రధాన కాండాన్ని నిటారుగా, నిరంతరాయంగా పెరగనిస్తారు. ప్రధాన కాండానికి ప్రక్కన వచ్చే శాఖలలో బాగా దగ్గర వాటిలో బలహీనంగా ఉన్న శాఖలను కొన్నింటిని తొలగిస్తారు. ఈ పద్ధతిలో చెట్టు ఎత్తుగా పెరుగుతుంది. కొమ్మల నీడ ఒక దాని మీద మరొకటి పడుతుంది. ఈ పద్ధతిని కొన్ని రకాల ఆపిల్ చెట్లకు, పియర్ చెట్లలలో అవలంబిస్తారు.
మార్పులు :
- చెట్టులో కొమ్మలు చాలా దగ్గరగా ఉండి, సూర్యరశ్మి సరిగా సోకనపుడు లోపలి కొమ్మలలో సరిగా పూత, కాత ఉండదు. కనుక అధిక సంఖ్యలో గల అల్లిబిల్లి గా పెరిగిన కొమ్మలను కత్తిరించటం ద్వారా సూర్యరశ్మి మిగిలిన కొమ్మలను సరిగ్గా సోకి వాటి ఉత్పాదక శక్తి పెరుగుతుంది.
- శీర్షపు మొగ్గను తొలగించుట వలన చెట్టు ఎత్తు తగ్గుతుంది, అంతే కాక ప్రక్క శాఖీయ మొగ్గలు పెరుతాయి.
- కొమ్మల కత్తిరింపుల ద్వారా ప్రధాన కాండం – ప్రక్క కొమ్మల మధ్య కోణాన్ని మార్చ వచ్చు. ఈ కోణం మరీ చిన్నగా ఉంటే కొమ్మ మీద బయట వైపుకు ఉండే మొగ్గకు పైన కత్తిరించాలి. కోణం పెద్దదిగా ఉంటే లోపలి వైపు మొగ్గకు పైన కత్తిరించాలి.
- చెట్టు వయసు పెరిగి లేదా దెబ్బతిని కాపు తగ్గినపుడు మాత్రమే పెద్ద కొమ్మలను నరకాలి. దీని వలన బలమైన కొత్త కొమ్మలు ఏర్పడి పూత కాత బాగుంటుంది.
- పెద్ద కొమ్మలను నరకటం వలన కాండం మీద చాలా కాలంగా నిద్రాణస్థితిలో గల శాఖీయ మొగ్గలు చిగురించి, బలమైన కొమ్మలుగా పెరిగి చెట్ల మధ్య ఖాళీలను పూరిస్తాయి.