తెలంగాణతెలంగాణ సేద్యంమన వ్యవసాయంరైతులువ్యవసాయ పంటలు

ఆవాల పంటలో అధిక దిగుబడికి శాస్త్రీయ సాగు సూచనలు  

0
A bright yellow field of canola or mustard plants.
  • ఆవాలు యాసంగి(రబీ)లో అంటే చలికాలంలో సాగుచేసే నూనెగింజల పంట. ఆవాలలో 37 నుంచి 42 శాతం నునే ఉంటుంది. గత రెండు, మూడేళ్ళ నుంచి ఆవాల పంట సాగుకు ఉత్తర తెలంగాణాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు.ఆవాల సాగులో రైతులు దిగువ తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడి, లాభాలు పొందవచ్చు.
    ఆవాలు పంట చల్లని వాతావరణంలో చాలా బాగా పెరుగుతుంది. గరిష్ఠంగా 10 నుంచి 25 డి.సెం.గ్రే. వరకు ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు ఈ పంటకు అనుకూలం. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. యాసంగి సీజన్‌లో ఆవాల పంటను అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మొదటివారాల వరకు వేయడం మంచిది.

    రకాల ఎంపికలో…
    అధిక దిగుబడి సాధనలో సరైన విత్తన రకాల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తాయి. రైతులు తమ ప్రాంతాలకు అనుకూలంగా ఉన్న రకాలను ఎంచుకోవాలి.

  •  కొన్ని ప్రాచుర్యం పొందిన రకాలు:
  • మంచి దిగుబడుల కోసం డి.ఆర్.ఎం.ఆర్.ఐ.జె.31, ఎన్.ఆర్.సి.హెచ్.ఓ.101, పూస తారక్, పూస జగన్నాథ్, పూస అగ్రాని రకాల నుంచి 120 రోజుల వ్యవధిలో ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్ళ దిగుబడి పొందవచ్చు.
  • ప్రైవేటు రంగంలో శ్రద్ధ, కోరల్ 432 రకాలు కూడా ప్రసిద్ది చెందాయి.
  • పూసా బోల్డ్ రకం అధిక దిగుబడినిస్తుంది. 140-145 రోజుల్లో పంటవస్తుంది.
  • పూసా మస్టర్డ్ 21 రకం త్వరగా 100-110 రోజుల్లోనే పంటకొస్తుంది.
  • ఆర్‌హెచ్- 30 రకం తెల్ల తుప్పు తెగులు, ఆల్టర్నేరియా బ్లైట్ తెగుళ్లకు ఓ మోస్తరు నిరోధకత కలిగి ఉంటుంది.
  • వరుణ రకం వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.

    సాగులో…

  • మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు ఆవాల సాగుకు అనుకూలం. ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, బంక మట్టి నేలలు, మిశ్రమ నేలలు వంటి మధ్యస్థ, తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలమైనవి. భూమి ఉదజని సూచిక 6.0 నుంచి 7.5 మధ్యలో ఉండాలి. అతి ఉప్పుగల లేదా ఆమ్ల నేలల్లో పండించకూడదు.
  • పంట బాగా మొలకెత్తడానికి నేలను మెత్తటి దుక్కి చేసి సిద్ధం చేసుకోవాలి. మెత్తటి పొడి దుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. లోతుగా దున్నడం ద్వారా భూమి గుల్లబారి, గాలి బాగా ప్రసరిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదలకు సహాయపడుతుంది.
  • విత్తడంలో… విత్తనాలను సరిగా విత్తుకోవడం వల్ల పంట విస్తృతంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎకరానికి సరిపడే 4- 5 కిలోల విత్తనానికి కనీసం 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో విత్తాలి. ఆలస్యంగా వేయాల్సిన సందర్భంలో 6- 7 కిలోలు విత్తనాలు వేయడం మంచిది.
  • కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా  2 గ్రా. కార్బెండాజిమ్ లేదా థైరామ్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయడం వల్ల నేల ద్వారా కలిగే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
  • వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 15- 20 సెం.మీ దూరం ఉంచాలి.

    ఎరువుల వాడకం:
    భుసార పరీక్షలు చేయించి అవసరాన్ని బట్టి ఎరువులను వినియోగించడం మేలు. ఆవాల పంటకు సరైన పోషకాలు అందించడం వల్ల పంట దిగుబడి మెరుగుపడుతుంది.

  • ఒక ఎకరానికి నత్రజని 24 కిలోలు, భాస్ఫరం 16 కిలోలు, పొటాషియం 16 కిలోల ఎరువులను వేసుకోవాలి. రెండవ దఫా నత్రజని ఎరువులను పూత వచ్చే ముందు (55- 60 రోజులకు) వేయాలి.
  • ఆవాల పంటకు బోరాన్, సల్ఫర్ లాంటి సూక్ష్మపోషకాలు అవసరం. ఎకరాకు సల్ఫర్ 12 కిలోలు ఇవ్వడం ద్వారా నూనె శాతం పెరుగుతుంది.
  • ఎకరాకు 2 నుంచి ౩ టన్నుల పశువుల ఎరువుని పంట విత్తే ముందు వేసుకోవాలి. సేంద్రియ ఎరువుల ద్వారా భూమిలో నీరు, పోషకాలు మెరుగుపడతాయి.

    నీటి యాజమాన్యం:
    ఆవాల పంట సాగుకు సుమారు 300 – 400 మి. మీ. నీరు అవసరం. యాసంగిలో నీటి సరఫరా సరిగా ఉండడం ద్వారా పంట పెరుగుదల బాగా ఉంటుంది. మొత్తంగా 3- 4 సార్లు తడులు ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు.

పంటపెరుగుదలలో కీలక దశలు:
1. క్రౌన్ రూట్ ఆరంభ దశ (20- 25 రోజుల పైరు దశ)
2. కొమ్మలు ఏర్పడే దశ (30- 40 రోజుల పైరు దశ)
3. పూత దశ (45- 50 రోజుల పైరు దశ)
4. కాయ ఏర్పడే దశ (60- 80 రోజుల పైరు దశ)

కలుపు నియంత్రణ:
మొక్కల పెరుగుదల దశలో పోషకాలు, నీరు, సూర్యరశ్మి కోసం ఆవాల పంట, కలుపు పోటీ పడతాయి. కాబట్టి కలుపును క్రమంగా తొలగించడం చాలా ముఖ్యం.

  • సుమారు 25- 30 రోజులకు ఒకసారి, 50- 55 రోజుల దశలో రెండవసారి చేతితో కలుపు తీయాలి.
  • పంట విత్తిన 48 గంటలలోపు ఆక్సాడయార్జిల్ అనే 6 శాతం ఇ.సి. కలుపు మందును ఎకరానికి 600 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. మొలకెత్తిన 3 వారాల లోపు కుదురుకు ఒక మొక్క ఉండేలా మొక్కలను పలుచన చేయాలి. పైరు 30, 60 రోజుల దశలో వరుసల మధ్య అంతర సేద్యం చేయాలి.

    సస్య రక్షణలో…
    ఆవాల పంటకు కొన్ని ముఖ్యమైన కీటకాలు, వ్యాధులు ఆశించడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి.

  • పేనుబంక(ఆఫిడ్స్) పురుగులు పూలు చిగురించే సమయంలో, గింజల దశలో పంటకు తీవ్ర నష్టం చేస్తాయి. ఎకరాకు డైమిథోయేట్ (30 ఇ.సి.) 120 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ (17.8 ఎస్.ఎల్.) 0.3 మి.లీ./ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • తెల్ల తుప్పు తెగులు వల్ల ఆకులు, కాండంపై తెల్లని బుడిపెల్లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు మెటలాక్సిల్ శిలీంద్ర నాశినిని 6 గ్రా. చొప్పున కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తెగులు సోకిన మొక్కలపై మెటలాక్సిల్ 2 గ్రా. లేదా ప్రోపికొనజోల్ 1 మి. లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంట కోత:
పంట పక్వానికి వచ్చినపుడు కాయలు పసుపు రంగుకు మారుతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుంచి వేరుచేయాలి. పంట సుమారు 110-140 రోజులు పెరిగిన తర్వాత కోతకు సిద్ధమవుతుంది. కోత తర్వాత సుమారు 8- 9 తేమ శాతంతో గింజలను నిల్వచేసుకోవాలి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడి పొందవచ్చు.

ఆవాల సాగుతో ఉపయోగాలు:

  • తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్య పద్దతులతో మధ్యస్థ రకం నేలల్లో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు.
  • స్వల్పకాలిక పంట
  • విభిన్న అవసరాలకు అంటే.. ముఖ్యంగా వంట నూనె, పశువుల ఆహారం వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
  • తేనేటీగల పెంపకం కూడా చేయవచ్చు.
  • మార్కెట్లో మంచి విలువ ఉంటుంది.
  • తక్కువ నీటి ఆవసరం ఉంటుంది.

    ఫోటో రైటప్ : ఆవాల పంట  విత్తనం చల్లడం నుంచి కాయ ఏర్పడే దశ  వరకు తెలియజేసే చక్రం.

ఎన్. సాయినాథ్, ఇ. రజనీకాంత్, డి. శ్రీలత, ఎన్. బలరాం,
 డి. పద్మజ, పి. రవి, డి. ఎ. రజనీదేవి, జి. శ్రీనివాస్
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల.

 

Leave Your Comments

రోజూ నాలుగు వాల్‌నట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు !

Previous article

పశుగణన !……. ప్రాముఖ్యత – విధానం  

Next article

You may also like