రబీ పంటలను సాగు చేసే రైతులు నేల స్వభావం, విత్తే సమయం, నీటి లభ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి.
నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక:
- నీటి సౌకర్యం కలిగిన ఎర్ర నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దు తిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వుల పంటలు.
- నీటి సౌకర్యం కలిగిన నల్ల రేగడి నెలల్లో ఆముదం, పొద్దు తిరుగుడు, పెసర, మినుము, నువ్వుల పంటలు.
- వర్షాదారపు ఎర్ర నేలల్లో ఉలువ, జొన్న పంటలు,
వర్షాదారపు నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాల పంటలు సాగుచేసుకోవచ్చు.
అనువైన అరుతడి పంటలు:
తెలంగాణలో యాసంగి సాగుకు నూనెగింజ పంటల్లో వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదం పంటలు; అపరాలలో శనగ,పెసర, మినుము, బొబ్బర్లు (అలసంద) తోపాటు కొత్తిమీర, ఉల్లి, ఆలుగడ్డ, పచ్చిమిరప, పుచ్చ, కూరగాయ పంటలు వగైరా ఇతర పంటలు సాగుచేయవచ్చు.
ఆరుతడి పంటలతో అనేక లాభాలు:
రబీ (యాసంగి)లో ఆరుతడి పంటల సాగువల్ల పంట సాగు ఖర్చు, ఎరువుల వినియోగం తగ్గుతుంది. ఎరువుల వినియోగం సామర్థ్యం పెరుగుతుంది. పంటల్లో చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. తక్కువ నీటితో అధిక పంట దిగుబడి వస్తుంది. నేలలో భూసారం పెరుగుతుంది. పోషకాహార భద్రత – కుటుంబంలో పోషకాహార భద్రత వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మార్కెట్ డిమాండ్ అనుకూలంగా పంటను ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం ఉంటుంది. అంతర/ మిశ్రమ పంటల సాగుకు అనుకూలం.
నీటి వసతికింద తేలికపాటి నేలల్లో ఆరుతడి పంటలసాగు:
- తేలికపాటి నేలల్లో 2-3 తడుల అవకాశం ఉన్నప్పడు పెసర, జొన్న, ఉలవలు, బొబ్బెర్లను సాగుచేసుకోవచ్చు.
- తేలికపాటి నేలల్లో 3-4 తడులతో రబీ కంది పంటను ఎంపిక చేసుకోవచ్చు.
- తేలికపాటి నేలల్లో 6-8 తడులతో రబీ వేరుశనగ సాగు చేసుకోవచ్చు.
- ఆరు తడి పంటలు 80 నుంచి 110 రోజుల్లో కోతకు వస్తాయి. గనుక తక్కువ కాలంలో, తక్కువ నీటితో, ఎక్కువ విస్తీర్ణంలో ఆరుతడి పంటలుగా పండించవచ్చు.
- ఆరుతడి పంటల సాగులో పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ. ఒక ఎకరంలో వరి పంట సాగుచేయటానికయ్యే ఖర్చు కంటే అదే విస్తీర్ణంలో ఆరుతడి పంటల సాగుకయ్యే ఖర్చు తక్కువ. అందుల్ల తక్కువ పెట్టుబడితో ఈ పంటలను సాగు చేయవచ్చు.
రబీ మినుము,పెసర సాగు:
రబీ మినుము,పెసర పంటలను రబీ పంటగా, వానాకాలం (ఖరీఫ్) వరికోతలు తర్వాత వారిమాగాణుల్లో సాగుచేస్తారు. రబీ పంటగా అక్టోబర్ వరకు విత్తాలి. రబీలో సాగుకు మినుములో ఎమ్.బి.జి 1070, ఎమ్.బి.జి 207 (మధిర మినుము -207), జి.బి.జి 1, టి.బి.జి 104, ఎల్.బి.జి 787, ఎల్.బి.జి 752, పి.యు 31 రకాలు, అలాగే రబీలో పెసర సాగుకి డబ్ల్యు.జి.జి 42 (యాదాద్రి), ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి 385, ఎమ్. జి.జి 347 (మధిర పెసర -347), ఎమ్. జి.జి 348, (భద్రాద్రి), టి.యం 96-2 రకాలు అనువైనవి.
విత్తడం: పెసర,మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 5-6 క్వింటళ్ల మేర దిగుబడి వస్తుంది.
రబీ అలసంద:
అలసందను నీటిపారుదల కింద అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. విత్తనం లేదా పచ్చికాయ కోసం విత్తినప్పుడు 8-10 కిలోలు, పశుగ్రాసం లేదా పచ్చిరొట్టకోసం విత్తినప్పుడు 12-14 కిలోల విత్తనం ఎకరాకు వాడాలి. అలసంద సాగుకి జి.సి-3, వి-240, సి-152, కొ-4 రకాలు అనువైనవి. ఎకరానికి 4-5 క్వింటళ్ల దిగుబడి వస్తుంది.
రబీ కుసుమ :
కుసుమ పంటను రబీలో అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. కుసుమలో టి.ఎస్.ఎఫ్-1, మంజీర, పి. బి.ఎన్.ఎస్- 12, డి.ఎస్.హెచ్ – 185 రకాలతో పాటు ముళ్ళు లేని నారి-6 కుసుమ రకాన్ని సాగుకు ఎంచుకోవచ్చు. కుసుమ125-130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 5-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
రబీ వేరుశనగ:
తేలికపాటి నేలల్లో 6-8 తడులతో వేరుశనగను రబీలో సాగు చేసుకోవచ్చు.
రబీలో ఉత్తర తెలంగాణలో అక్టోబరు రెండవ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు మొదటి పక్షం నుంచి నవంబరు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో నీటి పారుదల కింద 22.5×10సెం.మీ. ఎడంగా విత్తుకోవాలి.
- వేరుశనగ సాగుకి గిర్నార్ – 4 (ఐ.సి.జి.వి.15083), గిర్నార్-5 (ఐ.సి.జి.వి 15090), కదిరి-6, కదిరి-9, టి.సి.జి.ఎస్.-1694 (విశిష్ట), టీఏజీ.-24, జగిత్యాల పల్లి (జేసీజీ-2141), నిత్యహరిత (TCGS-1157) రకాలు అనువైనవి. వేరుశెనగ రకాలు105-120 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి 1200-1400 కిలోల దిగుబడినిస్తాయి.
రబీ పంటగా మొక్కజొన్న:
రబీలో అక్టోబరు నుంచి నవంబరులోగా విత్తుకోవాలి. నీరు ఇంకే నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో సాగు చేయవచ్చు. మొక్కజొన్నలో పంట కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక (100-120 రోజులు), మధ్యకాలిక (90-100 రోజులు), స్వల్పకాలిక (90 రోజుల్లోగా) రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరానికి 25-30 క్వింటళ్ల దిగుబడి వస్తుంది.
అనువైన రకాలు: డి.హెచ్.యం. 111, డి.హెచ్.యం. 113, మాధురి (తీపి రకం), ప్రియా (తీపి రకం), కరీంనగర్ మక్క, కరీంనగర్ మక్క-1, పేలాల మొక్కజొన్న రకాలు, బేబీ కార్న్ మొక్కజొన్న రకాలు.
రబీలో ఆయా ప్రాంతాలకు అనువైన పంటలు, రకాలను ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి, ఆదాయం పొందవచ్చు.
అరిగేలా కిరణ్, డి.నరేష్, డి.ఆదర్శ్,
సి.హెచ్.నరేష్, డా.టి. మాధురి, ఎన్. సుగంధి,
కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి,
సూర్యాపేట జిల్లా, ఫోన్7893989055.