Oil Palm Cultivation: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో రైతులు పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. గద్వాల, కల్వకుర్తి ప్రాంతాల్లోనే 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది.2020లో 20 వేల ఎకరాల్లోఆయిల్‌పామ్ సాగు చేపట్టగా అది నేడు 30 వేల ఎకరాలకు చేరింది. మొదట నాటిన చెట్లకు పంట వస్తుందని రైతులు చెబుతున్నారు.
20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
రాబోయే పదేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 60 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లతో బీచుపల్లి వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 24 వేల ఎకరాల తోటల్లో పంట చేతికి వస్తుంది. ఎర్రవల్లి వద్ద రూ.250 కోట్లతో మరో ఫ్యాక్టరీ సిద్దం చేస్తున్నారు. అందుకు అవసరమైన భూములకు జాతీయ రహదారి పక్కనే కేటాయించారు. 94 ఎకరాల్లో మిల్లు ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం తో, రూ.150 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
Also Read: Coconut Crop: కొబ్బరి పంట యాజమాన్యం.!
సుదూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది
ప్రస్తుతం జిల్లాల్లో అక్కడక్కడా వస్తోన్న ఆయిల్‌పామ్ గెలలను కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు తరలించాల్సి వస్తుంది.450 కి.మీ దూరం ఉండటంతో రవాణా ఖర్చులు భరించడం కష్టంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను తీసిన తరవాత 24 గంటల్లో మిల్లుకు తరలించాల్సి ఉంది. లేదంటే ఆయిల్ శాతం తగ్గుతుంది. ధర కూడా తగ్గిస్తారు.
జోగులాంబ జిల్లాలో ఆయిల్‌పామ్ మిల్ సిద్దం
జోగులాంబ జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం 2 వేల మందికి పని దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా గెలలు కోసేందుకు కూడా కూలీలకు మంచి డిమాండ్ వస్తుందని ఉధ్యాన శాఖ చెబుతోంది.వచ్చే ఏడాది నాటికి జిల్లాలో 50 వేల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తుందని అంచానా వేశారు. బీచుపల్లి వద్ద గంటకు 60 టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటు కానుంది. జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తే ఏటా రైతులకు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినా రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వంట నూనెలకు విపరీతమైన డిమాండ్ ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఒక్క రైతు కూడా ఆయిల్ ఫామ్ తోటలు తొలగించవద్దని సూచిస్తున్నారు.
Also Read: Backyard Garden Maintenance:పెరటి తోటల కృషి .. రోజురోజు స్వనిర్వహణ.!