కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు . ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ శాతం వర్షాధారంగా తేలికపాటి నేల్లల్లో చిన్న, సన్నకారు రైతులు తక్కువ పెట్టుబడులతో సాగు చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం సాగులో ఉన్నవి మధ్య, దీర్ఘకాలిక రకాలు. ఇవి పంట చివరి దశలో బెట్టకు లేదా అధిక వర్షాలకు గురికావడం, మొక్కల సాంద్రత సరైన మోతాదులో లేకపోవడం, కాయ తొలుచు పురుగులు, తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలకు గురవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కంది పండించే పలు జిల్లాల్లో వంధ్యత్వ తెగులు( వెర్రి తెగులు లేదా స్టెరిలిటి మోజాయిక్ తెగులు), ఎండు తెగులు ఆశించడం క్రమేపి పెరుగుతోంది.
వెర్రి తెగులు:
కంది పంటలో వంధ్యత్వ తెగులు (వెర్రి తెగులు) ఉధృతి తగ్గించి, అధిక దిగుబడులను సాధించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యల ఆవశ్యకత ఎంతయినా ఉంది. కంది పండించే వివిధ ప్రాంతాల్లో ఈ వెర్రి తెగులు సమస్య వాతావరణంలో మార్పులను బట్టి తెగులు ఉధృతి పెరగడం లేదా తగ్గటం గమనిస్తున్నాం. ఈ తెగులు వివిధ ప్రాంతాల్లో గొడ్డుమోతు తెగులు లేదా వెర్రి తెగులు లేదా ఆకుపచ్చ వంధ్యత్వ తెగులు అని అంటారు. గొడ్డుమోతు తెగులు వచ్చినప్పుడు కంది మొక్కల్లో పూతరాదు. ఆకులు మాత్రం చిన్నవిగా మారి పత్రహరితం రంగు మారిపోతుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవిగా మారి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. మొక్కలకు పూత, కాయ ఏర్పడవు. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో తెగులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. వెర్రి తెగులు పంట విత్తిన 30 నుంచి 45 రోజులు లోపల ఆశించినట్లయితే తెగులు ఉధృతి బట్టి పంటలో దాదాపు 95 నుంచి 100 శాతం దిగుబడులు తగ్గి పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ తెగులు మొక్క మొత్తాన్ని ఆశించవచ్చు లేదా కొన్ని కొమ్ములకు మాత్రమే రావచ్చు. మొక్కల్లో వంధ్యత్వ తెగులు సోకినప్పుడు రకాన్ని బట్టి, అక్కడుండే వాతావరణాన్ని బట్టి వివిధ లక్షణాలు గుర్తించవచ్చు. ఈ తెగులు లక్షణాలు మొక్కల వయసు, వైరస్ బలంపై ఆధారపడి ఉంటాయి. మొదటగా ఆకులపైన ముదురు ఆకుపచ్చ బూడిద వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. తర్వాత ఇవి విరిగిన ఆకారంలో ముదురు, లేత ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తాయి. తరువాత దశలో ఆకుపచ్చగా, చిన్నవిగా మారిపోతాయి. ఎక్కువ శాఖీయ పెరుగుదల ఉండి మొక్క గిడసబారుతుంది. తెగులు లక్షణాలు రకాలను, తట్టుకునే శక్తిని బట్టి మారుతాయి. ఇందులో భాగంగా తెగులు మూడు లక్షణాలుగా విభజించవచ్చు.
1. తీవ్రమైన మొజాయిక్, వంధ్యత్వం .
2. తేలికపాటి మొజాయిక్, పాక్షిక వంధ్యత్వం.
3. రింగ్ ఆకారం లాంటి మచ్చలు ఏర్పడి వంధ్యత్వం రాదు.
తెగులు లక్షణాలు పంటల్లో సంక్రమణ సమయం మీద ఆధారపడి ఉంటాయి. మొక్కలు మొదటి దశలో తెగులు సోకినప్పుడు తెగులు లక్షణాలు 10 నుంచి 15 రోజుల తర్వాత కనిపించి, ఆ లక్షణాలు మొక్క పుష్పించే సమయం దాకా ఉండి పూతకు రాదు. మొక్కలు కొంత ఎదిగిన తర్వాత తెగులు సోకితే లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. మొక్కలపై కొన్ని కొమ్మలకు మాత్రమే వ్యాపిస్తుంది. అటువంటి మొక్కల్లో 20 నుంచి 50 శాతం పూత గమనించవచ్చు. రైతులు సాధారణంగా ఈ తెగులను పూత రానప్పుడు మాత్రమే గమనిస్తుంటారు. అందువల్లనే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
వంధ్యత్వ తెగులు అనేది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ నల్లి గాలిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇవి గాలి ద్వారానే వేరే పొలాలకు విస్తరిస్తాయి. ఈ నల్లి జీవితకాలం కేవలం రెండు వారాలు మాత్రమే. అందులో గుడ్డు దశ, రెండు పిల్ల దశలు ఉంటాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు బాగాన ఉండి రసం పీలుస్తూ తెగులును వ్యాప్తి చేస్తాయి. ఇది వైరస్ తెగులు కావడం వల్ల దీని నివారణకు తెగులును వ్యాప్తి చేసే నల్లిని నివారించుకోవాలి.
సమగ్ర యాజమాన్య పద్ధతులు:
1. ధృకరించిన విత్తన సంస్థల నుంచి ఆరోగ్యకరమైన, తెగులును తట్టుకునే రకాల విత్తనాలు వేసుకోవాలి.
2. ఈ తెగులు తట్టుకునే రకాలైన ఐ.సి.పి.ఎల్. 87119, ఐ.సి.పి.ఎల్. 85063, టి.డి.ఆర్.జి. -4, బి.ఎస్.ఎం.ఆర్ -756, 853 రకాలను ఎన్నుకొని సాగు చేయాలి.
3. మొదటగా తెగులు సోకిన మొక్కలను తీసేసి వాటిని పాతి పెట్టాలి లేదా తగులబెట్టాలి.
4. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లి నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి చొప్పున కలిపి పంట విత్తిన 30 నుంచి 35 రోజులకు పిచికారి చేయాలి.
5. పంట విత్తిన 60 నుంచి 65 రోజులకు ప్రోపర్ గైట్ 57 శాతం ఇ. సి. 2. మి.లీ./ లీటరు లేదా ఫెన్ పైరోక్సీమేట్ 5 శాతం ఇ.సి.1.5.మి. లీ./ లీటరు నీటికి కలిపి పిచికారిచేసుకుంటే నల్లిని నివారించి తద్వారా వైరస్ తెగులును, దాని వ్యాప్తిని తగ్గించవచ్చు.
ఎండు తెగులు:
ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా లేదా మొక్కలో కొంత భాగం వాడి ఎండిపోతుంది.
ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు నిలువు చారలు కనిపిస్తాయి. శిలింద్రం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. పంట మార్పిడి పద్ధతిని పాటించకపోవడం వల్ల ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయడం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది.
నివారణ చర్యలు: తెగులును తట్టుకునే రకాలైన ఐ.సి.పి.ఎల్. 87119(ఆశ), ఐ.సి.పి. 8863 (మారుతి), డబ్ల్యూ.ఆర్.జి. 65, 96, 97, 252, 255, ఆర్.జి.టి.1, టి.డి.ఆర్.జి. 4( హనుమ) రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. పొగాకు లేదా జొన్న పంటలతో పంట మార్పిడి చేయాలి.
ఈ తెగులు నివారణకు మందులు లేవు. ఒక కిలో విత్తనానికి 10 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా మిశ్రమం కలిపి విత్తుకోవడం వల్ల కొంతవరకు ఎండు తెగులును నివారించవచ్చు.
పైన చెప్పిన విధంగా వెర్రి తెగులు, ఎండు తెగులు లక్షణాలు తొలిదశలోనే గుర్తించి తగిన నివారణ పద్ధతులను పాటించినట్లయితే కందిలో అధిక దిగుబడి పొందవచ్చు.
డా. ఎ. విజయభాస్కర్, డా. మంజులత, డా. మాధన్ మోహన్ రెడ్డి,
డా. ఉషారాణి, డా. మధుకర్ రావు, డా. శ్రావణి, డా. రాజేంద్రప్రసాద్ .
వ్యవసాయ పరిశోధన స్థానం, పి. జె. టి. ఎ. యు., కరీంనగర్.
Leave Your Comments