Aranya Permaculture: అనేక సమస్యలతో ఇటీవల సేద్యానికి దూరమయ్యే రైతులు ఎక్కువయ్యారు. ఇదే సమయంలో ఉరుకులు పరుగుల ఉద్యోగాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కొందరు యువకులు వ్యవసాయరంగంలోని మక్కువ చూపిస్తున్నారు. అంతేకాకుండా రైతు శిక్షణ తరగతులకి హాజరై అనేక విషయాలు తెలుసుకొని వాటి మీద అవగాహన పెంచుకుంటున్నారు. ఇలా సేద్యంలోకి అడుగు పెట్టాలన్న యువరైతులకు పర్మాకల్చర్ సాగు ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సొంత భూమి ఉండి ప్రకృతిని కాపాడుకుంటూ ఎక్కువకాలం ఉండే అడవి మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి యువతీ యువకులకి దిక్సూచిగా సేవలందిస్తోంది అరణ్య పర్మాకల్చర్ అకాడమీ. బంజరు భూమిని జీవ వైవిధ్య వనంగా మలచడమే కాకుండా దేశంలోనే పర్మాకల్చర్ శిక్షణకి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతున్నారు.
బీడు పొలం నుంచి ఆహార అరణ్యం
సంగారెడ్డి జిల్లాలో అరణ్య పర్మాకల్చర్ క్షేత్రంను మరింత అభివృద్ధి చేశారు. రక్షిత అటవీ భూముల మధ్య ఈమానవ నిర్మిత అరణ్యం జీవ వైవిధ్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అటవీ, ఆహార, ఔషధ, కలప, ఫల, పూల జాతి మొక్కలు, వృక్షాలతో తీర్చిదిద్దారు. శాశ్వత వ్యవసాయ విధానంలో ఆయా పంటల విభాగాలు ఆలోచింప చేస్తాయి. ఒక కుటుంబానికి కావాల్సిన పంటలను పండేలా ప్రణాళికను సూచించారు. కంది, శనగ, వేరుశనగతోపాటు అన్ని రకాల చిరుధాన్యాలు సాగు మామిడి, సపోట, జామ, సీతాఫలం, పనస, అరటి, బొప్పాయి, నేరేడు, ఉసిరి, నిమ్మ, బత్తాయి, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా ఎన్నో రకాల పండ్లును పెంచుతున్నారు.
Also Read: Minister Niranjan Reddy: ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా యువ రైతులు – మంత్రి
అటవీ విధానంలో మొక్కల పోషణ
పర్మాకల్చర్‌లో మొక్కల పెంపకం, పోషణ అనేది అడవిలోని చెట్లని తలపిస్తుంది. అడవులలో మొక్కలు ఎలా పెరుగుతాయో ఇక్కడ కూడా అలానే పెంచుతారు. వనంలో రాలిన పచ్చి, ఎండు ఆకులు, పశువుల పేడ సేకరించి ఎరువు తయారుచేసి ఇక్కడ వినియోగిస్తారు. మామిడి కింద పసుపు, అల్లం లాంటి కొన్ని పంటలను వేస్తారు. ప్రధానంగా ఒకేచోట అనేక రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈక్షేత్రంలో వాన నీరే ప్రధాన నీటి వనరు. కాబట్టి వర్షపు నీరును వృధా చేయనీయకుండా చిన్న చిన్న కాలువలు, ఇంకుడు గుంతలు, వర్షం నీటి నిల్వ ట్యాంకులను నిర్మించారు. వాతావరణ మార్పుల ఒడుదొడుకులు తట్టుకునే శక్తి క్షేత్రం సొంతమైంది.
దోపిడీలేని సాగు విధానమే పర్మాకల్చర్: నర్సన్న
మానవాళి ఆహారం, మనుగడకి వ్యవసాయమే మూలం. మన సంస్కృతిలో సేద్యం ఒక భాగం. ఆదర్శ సంస్కృతి, సహకార భావనతో నడిచే మన వ్యవసాయం నేడు ఆర్థిక కార్యకలాపంగా మారిపోయింది. ఆహారం అంగడి సరుకుగా అవతరించింది. ఫలితంగా సమాజ ఆకలితీర్చే వ్యవసాయం మనకోరికల్ని తీర్చుకోవడానికి అవసరమైన పెట్టుబడిగా పరిణమించింది. అయితే అలాంటి దుష్పరిణామాల నుంచి కాపాడే సహజ వ్యవసాయ పద్ధతే పర్మాకల్చర్. ఆధునిక వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కార మార్గం శాశ్వత వ్యవసాయం.
Also: Casuarina Cultivation: ఈ చెట్లు పెంచడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.!