Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రభుత్వం రూ.49,383 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.22,572 కోట్లు ఎక్కువ.గతేడాది బడ్జెట్లో రూ.28,811 కోట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా రూ. 22,572 కోట్లు పెంచి మొత్తం రూ.49,383 కోట్లు కేటాయించింది. రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా పధకాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపింది. సంక్షేమం, సాగు రంగాలకు ప్రాధాన్యత నిస్తూ 2024-25 బడ్జెట్ ను జులై 25 న ఉప ముఖ్యమత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబందించిన కొన్ని ముఖ్య అంశాలు…
* రైతుబంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకింద ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు చెల్లించే పథకానికి ప్రభుత్వం రూ.15,075 కోట్లు కేటాయించింది. కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తామని, అయితే రైతు భరోసాకు పరిమితులు, నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోందని ప్రకటించింది.
* భూమిలేని రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేలు రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది.అర్హుల ఎంపిక బాధ్యత పంచాయతీరాజ్ కు అప్పగించింది.
* సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 వరికి బోనస్ పథకాన్నిఈ సీజన్ నుంచే అమలు చేస్తామని దానికి రూ.1800 కోట్లు కేటాయించింది.
* రైతు బీమా పథకాన్నియథాతథంగా కొనసాగించేందుకు రూ.1,583 కోట్లు కేటాయించింది.
* పంటల బీమా పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం సగం నిధులు ఇస్తుండగా..రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1300 కోట్లు కేటాయించింది.
* విత్తనాల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ ఇతర పథకాలకు రాష్ట్ర వాటా కింద రూ.5 వేల కోట్లు ఇచ్చింది.
* నాసిరకం, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నాణ్యమైన విత్తనోత్పత్తికి కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి రూ.10 కోట్లను కేటాయించింది.
* రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.18.75 కోట్లు ఇచ్చింది.
* రాష్ట్రంలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి, ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి రూ.787 కోట్లు కేటాయించింది.
* చేపల పంపిణీ పధకానికి రూ.249 కోట్లు, పాడి రంగం, ఇతరత్రా పధకాలకు రూ. 300 కోట్లు కేటాయించింది.
* పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.18 కోట్లు, మామునూరు పశువైద్య కళాశాలలో మంజూరైన పశువైద్య కళాశాలకు రూ.6.50 కోట్లు ఇచ్చింది.