వర్జీనియా పొగాకు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు మరియు గోదావరి జిల్లాలలో పండిరచే ప్రముఖ వాణిజ్య పంట. పొగాకు పంట పండిరచటంలో ముఖ్యంగా రెండు దశలున్నాయి. మొదటది ఆరోగ్యవంతమైన నారును పెంచటం రెండవది ఆరోగ్యవంతమైన నారును పొలములో నాటి సిఫారసు చేసిన సాంకేతిక పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధించటం. పొగాకు పండిరచటానికి విత్తనాలు నేరుగా పొలంలో నాటలేము ఎందుకంటే పొగాకు విత్తనాలు చాలా చిన్నవిగా ఉండి, ఒక్కో విత్తనము సగటు బరువు 0.08 నుండి 0.09 మి.గ్రా. ఉంటుంది మరియు ఒక గ్రాముకు 11,000 – 12,000 విత్తనాలు వుంటాయి. పొగాకు విత్తనాలు చాల చిన్నవిగా ఉండటము వలన వీటినుండి వచ్చిన మొలకలు చిన్నవిగా, సున్నితముగా వుంటాయి. అందువలన మొదటగా నారు పెంచి గట్టి పరచి పొలాల్లో నాటుతారు. అధిక దిగుబడి నాణ్యత కలిగిన పొగాకు పండిరచాలంటే ఆరోగ్య వంతమైన నారు పెంచటం చాలా ముఖ్యం.
నారు మళ్ళలో పొగాకు నారు పెంపకం ` నారు పెంచే విధానములో కీలక అంశాలు…
1. నేల ఎంపిక
2. మడుల తయారీ
3. సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల వాడుక
4. విత్తన ఎంపిక మరియు మోతాదు
5. విత్తనాలు విత్తుట
6. విత్తనాలు విత్తిన పిమ్మట తీసుకోవలసిన జాగ్రత్తలు
7. పై పాటు ఎరువుల వాడకం మరియు తీసుకొనవలసిన జాగ్రత్తలు
1. నేల ఎంపిక :
నారుమడిని కట్టుటకు ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు అనువైనవి. నల్లరేగడి నేలలలో పొగాకు నారుమడి కట్టాలనుకుంటే, నేల ఉపరితల భాగాన్ని గుల్లపరచాలి. అందుకు హెక్టారుకు 200 బళ్ళు (100 టన్నులు) ఇసుక నేల పైపొరలలో బాగా కలిసేటట్టు వేసి దున్నాలి. నారుమడి కట్టే స్థలము ప్రతి సంవత్సరం మార్చడం వలన వివిధ రకాల వ్యాధులు, క్రిములు, కలుపు మొక్కలు మరియు వంగడాల కల్తీని చాలా వరకు నివారించవచ్చును. ఒకసారి నారుమడిని కట్టిన నేలను ‘రాబింగ్’ (మడిపై వరి ఊకను పరిచి కాల్చుట) పద్ధతి ద్వారా శుద్ధి చేయాలి. దీనివలన నేలనుండి సంక్రమించే కొన్నివ్యాధులు, కలుపు మొక్కల విత్తనములు, క్రిములు మరియు శిలీంధ్రములు నశిస్తాయి. వేసవిలో రెండు సార్లు ఏప్రిల్-మే లో) దుక్కి చేసుకోవాలి. అందువలన వేరుకాయ, నులిపురుగు యొక్క గ్రుడ్లు, లార్వాలు, కోశస్థ దశలో ఉన్న చీడపురుగులు మరియు శిలీంద్రాలు వేసవి వేడికి నశిస్తాయి.
2. మడులు కట్టే పద్ధతి :
1.20 మీ. వెడల్పు 10 మీ. పొడవు ఉండేటట్లు మడులను తయారు చేయాలి. మడికి, మడికి మధ్య 50 సెం.మీ వెడల్పు గల కాలువలను ఏర్పరచాలి. నారుమడి, కాలువ కంటే 15 సెం. మీ ఎత్తులో ఉండాలి.
3. సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల వాడుక :
విత్తుటకు కనీసం 20 రోజుల ముందు 10 చ.మీ మడికి 25 కేజీలు పశువుల ఎరువు మడి పైపొరలలో బాగా కలిసేటట్లు వేసిన ఎడల, నారు దిగుబడి పెరిగి, అధిక లబ్ధి చేకూరుతుంది. విత్తుటకు ముందు 10 చ. మీ మడికి 100 గ్రా. అమ్మోనియం సల్ఫేట్, 300 గ్రా. సూపర్ పాస్పేట్, 50 గ్రా. పొటాషియం సల్ఫేట్ మరియు 100 గ్రా. డోలమైటు వేయాలి. విత్తుటకు ముందు 10 చ.మీ. మడికి 40 గ్రాముల ఫెన్వలరేట్ పొడి మందు చల్లటము వలన చీమల మరియు కీటకాల బెడద నివారించవచ్చు.
4. విత్తన మోతాదు : ఎకరాకు 1.2 నుండి 2 కిలోలు అవసరం.
5. విత్తనాలు విత్తుట :
సిఫార్సు చేసిన పొగాకు వంగడములనే వాడాలి. 10 చ.మీ మడికి 4.0- 5.0 గ్రాముల విత్తనములు సరిపోతాయి. ఇంతకు మించితే నారు అధిక సాంద్రత వల్ల నాణ్యత తగ్గటమే కాక మాగుడు తెగులు సోకే ప్రమాదమున్నది. ఎత్తు పల్లములు లేకుండా చదును చేసిన మడిపై పళ్ళదంతెను ఉపయోగించి 5 సెం.మీ. ఎడం, 0.25 సెం.మీ. లోతు కలిగిన చాళ్ళను ఏర్పరుచుకోవాలి. పిమ్మట విత్తనములను ఇసుకతో కలిపి విత్తి, గుబురైన చివర్లు గల చీపురుతో చాళ్ళను మూసివేయాలి. దీనివల్ల 0.25 సెం.మీ. లోతులో విత్తనాలు పడి మొలకెత్తుటకు అనుకూలంగా ఉంటుంది. విత్తనము వేసి చాళ్లను మూసిన తర్వాత మడిపై 20-30 సెం.మీ. వ్యాసము కలిగిన సిమెంటు పైపును దొర్లించి మడిని గట్టిపరచాలి.
6. విత్తనాలు విత్తిన పిమ్మట తీసుకోవలసిన జాగ్రత్తలు :
అధిక వర్షపు తాకిడికి, మడి కోతను, నారుమొక్కలు కొట్టుకుపోవడాన్ని నివారించడానికి, మడిపై వరిగడ్డిని గాని లేక సరివి రెమ్మలనుగాని పరవాలి. నారుమళ్ళకు మైక్రోస్పింక్లర్లను అమర్చి, వాటి ద్వారా నీటిని అందించవలెను. మైక్రోస్పింక్లర్ల ద్వారా తడులు ఇవ్వటం వలన మంచి ఆరోగ్యవంతమైన పొగాకు నారును పెంచడమే కాకుండా కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చును. నారుకు మూడు వారాల వయసు వచ్చేసరికి పైన కప్పిన వరిగడ్డి / సరివి రెమ్మలను పలుచన చేసి, మరుసటి వారంలో పూర్తిగా తీసివేయాలి. మడి ఒత్తుగా ఉన్న ప్రదేశాలలో పలుచన చేసి, వాటిని వేరేచోట నాటాలి. ఈ ప్రక్రియ, నారు వయసు 3 వారాలున్నప్పుడే చేయాలి. నారుమడిలో కలుపు కనిపించిన వెంటనే తీసివేయటం ద్వారా ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చును. కొన్ని పైఆకులను తుంచుట (క్లిప్పింగ్) ద్వారా నారు మొక్కల అధిక పెరుగుదలను నివారించవచ్చును. నారు కాండము గట్టి పడుటకు నారుతీతకు 3-4 రోజుల ముందు తడి పెట్టుట ఆపివేయాలి.
7. పై పాటు ఎరువుల వాడకం, తీసుకోవలసిన జాగ్రత్తలు :
మొలకెత్తిన తరువాత 10 చ.మీ. మడికి 2 సార్లు 6 రోజుల వ్యవధిలో 25 గ్రాములు, ఆ తరువాత 3 సార్లు 6 రోజుల వ్యవధిలో 50 గ్రాములు చొప్పున ఆమ్మోనియమ్ సల్ఫేటును, 2 సార్లు 25 గ్రాముల చొప్పన పొటాషియం సల్ఫేటును వేయాలి. పిమ్మట నారు పెరుగుదలను బట్టి అవసరమైనప్పుడు పొగాకు శాస్త్రవేత్తల సలహా ప్రకారము మరికొంత ఎరువును వేయాలి. ఎరువు వేసిన తరువాత ఆకులపై పడిన ఎరువు తొలిగేటట్లు మళ్ళను జాగ్రత్తగా తడపాలి. ప్రతి నారుతీత తరువాత మిగిలిన మొక్కలు బాగా పెరగటానికి, 10 చ.మీ. మడికి 100 గ్రా. అమ్మోనియా సల్ఫేట్ను 50 గ్రాములు పొటాషియం సల్ఫేటును వేయాలి. నారు మళ్ళలో ఇతర పోషకాల లోపాలు గమనించినచో నారుమళ్ళ నిపుణులతో సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారించాలి.
డా.జి.ప్రసాద్ బాబు, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం,
డా.యం.అనురాధ, ప్రధాన శాస్త్రవేత్త,
డా.యం.శేషుమాధవ్, సంచాలకులు, కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ