మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

వర్షాభావ పరిస్థితుల్లో పంటల్ని ఇలా సంరక్షించుకోండి !

0

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో ఒక వైపు పంటలు దెబ్బతింటే,మరోవైపు ఉభయ అనంతపురం,కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిసస్థితులవల్ల మెట్ట పంటల సాగు సజావుగా జరగడం లేదు. వేసిన పైర్లు ఎండుముఖం పడుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వర్షాధార పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
ఉభయ అనంతపురం,కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గత 20-25 రోజులగా వర్షాభావ పరిస్థితులు నెలకోవడం వల్ల వర్షాధార పంటలు(వేరుశనగ, కంది, ఆముదం) బెట్టకు గురికావడం జరుగుతుంది. కావున కొంత వరకు ఈ బెట్టను అధిగమించడానికి రైతులు 19:19:19 ఎరువు 10 గ్రా.చొప్పున ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి.నీటి వసతి గల రైతులు కీలక దశలో పంటకు ఒక రక్షక తడి (20 మి.మీ) ఇవ్వాలి. నీటి కుంటల్లో కానీ లేదా కాలువలు లేదా గొట్టపు బావుల్లోని నీటిని ఉపయోగించుకొని ఒక తడి నీరు పెట్టాలి.

  • కంది, ఆముదం పంటల్లో వత్తుగా ఉన్న మొక్కలను పలుచన చేయాలి. కంది పంటలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ; ఆముదములో 60 సెం.మీ దూరం ఉండేటట్లు పాటించాలి.అంతర సేద్యము ద్వారా కలుపును  నివారించుకోవాలి.
  •  రైతులు వర్షాధార పంటలో గుంటకతో అంతర సేద్యం చేసుకోవాలి. పంట వ్యర్థాలతో నేలకు ఆచ్చాధన కల్పించడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • రైతులు ఆగస్టు మాసంలో ప్రత్యామ్నయ పంటలు వేయటానికి సన్నద్ధం కావాలి. వర్షాధార ఎర్ర నేలల్లో కంది, జొన్న, కొర్ర (సుర్యనంది, మహానoది), సజ్జ, అలసంద, ఉలవ, ఆముదము, పెసర (ఐ.పియo-2-14, డబ్ల్యు.జి.జి-42), అనుముల పంటలు, వర్షాధార నల్లరేగడి నేలల్లో కంది, ఆముదము, పత్తి పంటలను ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.
    వేరుశనగ:
    రైతులు వర్షాధార వేరుశనగ పంటలో నీటి సంరక్షణ సాళ్ళను (కన్సర్వేషన్ ఫర్రోస్ –తల్లి చాళ్ళు లేదా గొడ్డు చాళ్ళు) ప్రతి 3.6 మీటర్లకు ఒక సాలు చొప్పున పంట విత్తేటప్పుడు లేదా విత్తిన 20-30 రోజులకు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ సాళ్ళు వేయడం వల్ల బెట్ట సమయంలో పంటకు నీటి సంరక్షణకు ఉపయోగపడటమే గాక అధిక వర్షం కురిసినప్పుడు మురుగు నీరు పోయే కాలువలుగా ఉపయోగపడతాయి. వర్షపు నీరు ఈ సాళ్ళలో ఇంకడం వలన పైరు త్వరగా బెట్టకు గురికాదు.
  •  ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వేరుశెనగలో రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు,శనగ పచ్చ పురుగు ఆశించడానికి అనుకూలం. రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడానికి వేరుశెనగ పొలంలో జిగట అట్టలు (10 ఎకరానికి), ఫెరోమోన్ ట్రాప్స్ (4 ఎకరానికి) అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మి.లీ./లీటరు లేదా లామ్డసైహలోత్రిన్ 0.6 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు నివారణకు పంట విత్తిన 10-15
    రోజులలోపు ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను
    ఆకర్షించాలి. ఎకరాకి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. 5 శాతం వేప గింజల కషాయంను గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేక వేపనూనె 5.0 మి.లీ. /లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలకు ఏమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ./ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

పత్తి:
ప్రస్తుతం పత్తి పంట కొన్ని ప్రాంతాల్లో మొలక దశ నుంచి పూత దశలో ఉంది. పత్తి విత్తిన రైతులు విత్తిన 20-30 రోజులప్పుడు గొర్రు, గుంటకలతో అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేయాలి. అధిక సాంద్రత ఉంటె పలుచన చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పిల్చు పురుగుల ఉధృతికి అనుకూలంగా ఉన్నాయి.తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులను అదుపు చేయాటానికి వేప నూనె 5.0 మి.లీ.లేదా 5 % వేప గింజల కషాయాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పొలంలో పసుపు రంగు జిగట అట్టలు (10 ఎకరానికి), త్రిప్స్ ఉధృతిని గమనించడానికి ఎకరాకు 10 బ్లూ స్టికీ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలి.
పురుగుల ఉధృతిని బట్టి అసిఫెట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా
థయామిథాక్సామ్ 25 WG 0.2 లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా.చొప్పున లీటరు
నీటికి కలిపి వాతావరణ పరిస్థితులు గమనించి పిచికారి చేయాలి. పత్తిలో మెగ్నీషియం లోపాన్ని సవరించడానికి 10 గ్రా.మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి 45 మరియు 75 రోజుల దశలో పిచికారి చేయాలి.

Cotton growers make room for more corn and wheat

మొక్కజొన్న:
మొక్కజోన్నలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. పురుగు ఉనికిని
గుర్తిoచడానికి ఎకరానికి 4 ఫిరమోన్ ఎరలు ఏర్పాటుచేయాలి. ఒక ఫిరమోన్
ఎరలో 10 పురుగులు పడినట్లయితే వెంటనే లీటరు నీటికి 5 మి.లీ వేపనూనె కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉదృతిని బట్టి లీటరు నీటికి 2 గ్రా.థయోడికార్బ్ లేదా 0.4 గ్రా. ఇమామేక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేయాలి.

Corn | History, Cultivation, Uses, & Description | Britannica

ఆముదం:
ఆముదం పంటలో వత్తుగా ఉన్న మొక్కలను పలుచన చేయాలి.మొక్కకు
మొక్కకు 60 సెం.మీ దూరం ఉండేటట్లు పాటించాలి. అంతర సేద్యము ద్వారా కలుపును నివారించుకోవాలి. అలగే 30 మరియు 60 రోజులకు ఒకసారి 13 కిలోల యూరియా తేమ ఉన్న సమయంలో వేసుకోవాలి. అక్కడక్కడ పొగాకు లద్దెపురుగు ఆశిస్తోంది. దీని నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మీ.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

దానిమ్మ:
ప్రస్తుత వాతవరణ పరిస్థితులలో దానిమ్మలో బాక్టీరియా ఆకుమచ్చ
తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగులు సోకిన పండ్లు తీసి కాల్చివేయాలి.

Pomegranate Contract Farming at Rs 55 in Indore | ID: 2851035013191

తెగులు : లక్షణాలు గమనిoచిన వెంటనే చెట్టుపై లీటర్ నీటికి 0.5 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ మరియు 3 గ్రా. కాపరాక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయల పంటలు:
రైతులు కూరగాయల పంటలను ముఖ్యంగా మిరప నాట్లు వేసే ముందు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ మరియు కార్బెండజిమ్ 3 గ్రా.చొప్పున కలిపిన మందు ద్రావణoలో వేర్లు ముంచి నాట్లు వేసుకోవాలి. టమాటో పంటలో పూత రాలడాన్ని నివారించట్టానికి ప్లానో ఫిక్స్ 4.5 లీటర్ల నీటికి 1 మి.లీ.చొప్పున కలిపి పిచికారి చేయాలి.

పశువులు:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పశువులకు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తికి అనుకూలం.వ్యాధి సోకిన పశువులను మిగిలిన పశువులతో వేరుపర్చాలి. ఆరోగ్యకరంగా ఉండే పశువులను వ్యాధి సోకిన వాటితో కాలవ కుండా జాగ్రత్త వహించాలి.వ్యాధి నివారణకు యాంటిబయోటిక్స్ మందులు వాడాలి. టీకాలు వేయించాలి.

డా. ఎం. విజయ్ శంకర్ బాబు,
డా. జి. నారాయణ స్వామి,
డా. జి.డి. ఉమాదేవి,
వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం

Leave Your Comments

సుస్థిర దిగుబడుల కోసం  వివిధ మెట్ట పంటల్లో ఎరువుల వాడకం  

Previous article

వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు పాటించండి !

Next article

You may also like