Insects in Sunflower: వేరుశనగ నూనె, నువ్వులనూనె కంటె కూడ ప్రొద్దు తిరుగుడు నూనె శ్రేష్ఠమైనది. దీని నుండి వనస్పతి కూడ తయా రు చేస్తారు. వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో కూడ ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. సువాసన కలిగిన లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, లినోలినిక్ ఆమ్లం లేక పోవటం వలన ప్రొద్దుతిరుగుడు పంట చాలా ఆదరణలోకి వచ్చింది. దీని నూనె గుండెపోటుగల వారికి మంచిది.
రసం పీల్చు పురుగులు :
పచ్చ దీపపు పురుగులు, తెల్ల దోమలు, తామర పురుగులు దీపపు పురుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, క్రమేపి ఆకు అంతా ఎర్రబడి, చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా మిథైల్ డెమెటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం బాగా తడిసేలా పిచికారి చేయాలి.
తెల్లదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు ఈ పంటను మొదటిదశ నుంచి ఆశిస్తాయి. పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉండి పసుపుపచ్చ లేక గోధుమ రంగులో, చీలిన రెక్కలతో ఉంటాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులను, పువ్వులను గోకి రసాన్ని పీలుస్తాయి.
Also Read: గోధుమ లో వచ్చే కాండం తుప్పు తెగులు
ముఖ్యంగా ఈ పురుగులు లేత భాగాల్ని ఆశ్రయించి పెరగటం వలన ఆకులు పెళుసుగా మారి మొక్క గిడసబారి పోతుంది. ఇవి ఆశించిన ఆకులపై పొడ లాంటి మచ్చలు ఏర్పడి ఆకులు పాలిపోయి ముడుచుకొని పోతాయి.
పరోక్షంగా ఇది నెక్రోసిస్ వైరస్ తెగులును వ్యాప్తి చేసి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. వీటిని అదుపు చేసే నిమిత్తం మందులు పిచికారి చేయడం కంటే కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తన శుద్ధి చేస్తే మంచిది. తద్వారా సహజంగా అదుపుచేసే మిత్రపురుగులు పైరులో వృద్ధి చెందుతాయి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయాలి.
Also Read: మామిడి రైతుల్ని నిండా ముంచిన తామర పురుగు..