గతంలో వ్యవసాయమంటే..ఒకే పొలం – ఒకే పంట అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. పరిస్థితుల ప్రభావం, ప్రకృతి ప్రభావం ఏదైనా కానీ సాగులో నష్టాలు చవిచూస్తే దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి పెట్టుబడులు కూడా దక్కవు. కానీ కాలంతో పాటే సాగులోనూ గణనీయమైన మార్పు వచ్చింది. అందుకోసం రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలి. రోజు రోజుకు వ్యవసాయ రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నేల అనుకూలతను బట్టి వాణిజ్య పంట టేకు పంటపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశముంది. ప్రభుత్వం ఇందుకు ప్రొత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు టేకు, మామిడి ఇతర మొక్కలను అందించింది. రెండేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకం కింద నర్సరీల్లో టేకు, ఇతర మొక్కలను పెంచి రైతులకు అందజేస్తుంది. మన తెలుగు రాష్ట్రంలో టేకు మొక్కల పెంపకానికి అన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉండడంతో చాలామంది రైతులు టేకు మొక్కలను ప్రధాన పంటగా సాగు చేపడుతున్నారు. మార్కెట్లో నాణ్యమైన టేకు కలపకు మంచి డిమాండ్ ఉంది. అదే క్రమంలో డిమాండ్ కు తగ్గట్టుగా కలప దొరకటం లేదు. దీంతో చాలా మంది ఇంటి సామాగ్రి కోసం ఇతర కలపపై అధారపడాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో టేకు సాగు రైతులకు లాభసాటిగా మారింది.
టేకు సాగు విధానం..
టేకు సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. టేకు పంటకి ఎక్కువ ఎరువు అవసరం పడుతుంది. అందుకు ముందే మనం ఎరువును ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను నాటడానికి ఒక నెల ముందు 500 GM NPK ని 15 KG ఆవు పేడతో కలిపి మట్టిలో చల్లాలి. నాటడానికి ఒక నెల ముందు గుంతలను తయారు చేస్తారు. నాటడానికి తీసుకువచ్చిన మొక్కలు సుమారు రెండు సంవత్సరాల వయస్సు ఉండాలి ఎందుకంటే రెండేళ్ల మొక్క బాగా పెరుగుతుంది. ఇకపోతే టేకు సాగుకు ముందు పొలాలను బాగా దున్నాలి. పాత పంట అవశేషాలను తొలగించాలి. తర్వాత, పొలంలో 8 నుంచి10 అడుగుల దూరం రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతైన గుంతలను సిద్ధం చేయాలి.
అమ్మకం ఎలా ..
మొక్కల ఎదుగుదల తర్వాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది.స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని, చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తర్వాత రేంజి పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు, పట్టా భూమిలోనివా., లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధ్రువీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత ప్రయోజనం చేకూరుతుంది. చెట్లను కొనుగోలు చేసేందుకు చాలామంది గుత్తే దారులు అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళ్తారు.
ఆదాయం …
టేకు మొక్కల పెంపకంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తున్నది. 12 ఏండ్లకు అవి 10 అడుగులు పెరుగుతాయి. ఆ తర్వాత మూడేండ్లకు కలప చేతికి వస్తుంది. అప్పుడు టేకును మార్కెట్‌కు తరలించి విక్రయిస్తే మంచి ఆదాయం సమకూరుతుంది. ఇతర పంటలతో పోల్చితే టేకుతో అధిక లాభాలు గడించవచ్చు.