నేలల పరిరక్షణ

మేలైన పంట దిగుబడిలో పొటాషియం పాత్ర..

0

ప్రస్తుతం చాలా ప్రాంతాలలో అవసరం కంటే ఎక్కువగా నత్రజని ఎరువులను వాడడం, భాస్వరం ఎరువులను కొన్ని పంటలలో అవసరం కంటే అధికంగా కొంత మంది రైతులు అవసరం కంటే తక్కువగా వాడుతున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఐతే పొటాషియంలోని ప్రభావాన్ని వెంటనే గుర్తించి సకాలంలో నివారించలేకపోవడంతో రైతులు పంటల ఉత్పాదకతను కూడా ప్రమాదంలో నెట్టుతున్నాయి.
వరి, మొక్కజొన్న తదితర ప్రధాన ఆహార పంటలతోపాటు చాలా పంటలు ఒక టన్ను ఉత్పత్తికి ఎకరానికి సుమారు 8 నుండి 12 కిలోల పొటాషియం పోషకాలన్ని నేల నుండి గ్రహిస్తున్నట్లు వివిధ పరిశోధనలతో తెలియడం మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పొటాషియం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొన్ని భూసార పరీక్ష ఫలితాలలో, నేలల్లో పొటాషియం సాధారణ స్థాయికి పడిపోయినట్లు తెలియజేస్తున్నాయి.
పొటాషియం మొక్కలలో జరిగే జీవరసాయనిక క్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడిన పదార్థాలను ఇతర భాగాలకు చేర్చుటలో, పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం, ఎంజైములను క్రియాశీలకం చేయటంలో తోడ్పడుతుంది.
ధాన్యం పంటలలో కాండం గట్టిపడటంతో తోడ్పడి పంట పడిపోవడాన్ని నిరోధిస్తుంది. పైరు శక్తిని పెంపొందించి తెగుళ్ళు, పురుగులను తట్టుకొనేటట్లు చేస్తుంది. ధాన్యపు పంటలలో పూర్తిగా నిండి గట్టి గింజలు బరువైన గింజలు ఏర్పడుతాయి. దుంప జాతుల్లో పిండి పదార్థం అధిక స్థాయిలో ఉండి మంచి సైజు కలిగి ఉంటాయి. పంటలు వర్షాభావ పరిస్థితులను, చలి వాతావరణంలో, పంటలలో పంచదార శాతం, రస నాణ్యత పెంచుతుంది. పప్పు జాతి పైర్లలో నత్రజని స్థిరీకరణలో తోడ్పడుతుంది. నీటి ముంపు పరిస్థితుల్లో ఇనుపధాతువు అధికమగుట వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మొక్కలలో నూనె పదార్థాలు, పిండి పదార్థాల తయారీలో పొటాష్ కీలకపాత్ర పోషించుట వలన అధిక నూనె శాతం సాధించుటకు తగు స్థాయిలో పొటాష్ ఎరువులు వాడాలి.
మాగాణి పొలాల్లో తెట్టు/ పాచి పారుకుపోవడంను నిరోధిస్తుంది. పొటాష్ వాడకంలో ఫలసాయంపై తోట ధృడంగా, బలంగా తయారై ఒరిపిడిని బాగా తట్టుకొని నిల్వ సమయం పెంచుటలోనూ, రవాణాలో చెడిపోకుండా సహాయపడుతుంది. వివిధ పంటలలో నత్రజని, భాస్వరం, గంధకం, జింక్ వంటి పోషకాలను బాగా వినియోగించుటలో పొటాషియం తోడ్పడుతుంది.
పొటాష్ లోపం:
పొటాషియం లోప లక్షణాలు మొదట ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకులు అంచుల వెంబడి ఆకుపచ్చరంగు కోల్పోయి క్రమేపి పసుపు రంగులోకి మారి కాలినట్లు కనిపిస్తుంది. తరువాత ఆకు అంతా మాడిపోయినట్లుంటాయి. కాండం బలహీనంగా కనిపిస్తుంది. మొక్కలు ఎదుగుదల లేక పొట్టిగా పొదలాగా కనిపిస్తాయి. పంటలలో చీడపీడల తాకిడి అధికంగా ఉండి ఉత్పత్తి, నాణ్యత కుంటుపడుతుంది. పంటలలో పొటాష్ ఎరువులు వాడినంతనే మొక్కలలో తేజస్సు వచ్చి పంట పెరుగుదల, పెరిగితే పొటాషియం లోపం అంతర్గతంగా ఉందని గ్రహించవచ్చు.
నేలలో లభ్యమయ్యే పొటాషియం హెక్టారుకు 120 కిలోల కంటే తక్కువగా ఉంటే పొటాషియం స్థాయి తక్కువగా 120 – 250 కిలోలు ఉంటే మధ్యస్థంగా, 280 కిలోల కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా నిర్ధారించారు. తగు రీతిన సిఫారసు మేరకు పొటాషియం ఎరువులో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (60% పొటాషియం), సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (50% పొటాషియం) లను వాడుకోవాలి. పొటాషియం ఎరువులు వాడిన ముడి పదార్థాన్ని బట్టి ఎరుపు, తెలుపు, ఊదా ఇంకా మిశ్రమ రంగుల్లో కూడా లభిస్తాయి.
అదే విధంగా కొన్ని ఎరువులు పొడి రూపంలో కొన్ని పలుకులుగా కూడా లభ్యమౌతున్నాయి. పంటలు జీవితకాలం మొత్తం పొటాష్ ను గ్రహిస్తాయి. కానీ పంట చురుకుగా పెరిగే దశ, గింజ తయారీదనంలో పొటాషియం అవసరం ఎక్కువగా ఉంటుంది. పంట తొలిదశలో సుమారు 30 శాతం తరువాత సుమారు 70% కావున బరువైన నేలల్లో ఒకేసారి దుక్కి లేదా దమ్ము లేదా విత్తి/ నాటు సమయంలో వేసుకోవచ్చు. తేలిక నేలల్లో 2 – 3 దఫాలుగా యూరియాతో కలిపి వేసుకోవచ్చు. పొగాకు, మిరప, బంగాళాదుంప, కాఫీ, నిమ్మ మరియు ద్రాక్ష వంటి పంటలకు సల్ఫేట్ ను వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువుల ద్వారా కూడా పొటాష్ అందించవచ్చు. కాని వాటిలో పొటాషియం శాతం కొంత తక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో, ద్రావకం ఎరువుల రూపంలో కూడా మార్కెట్ చేస్తున్నాయి. తగిన సాంకేతిక సలహాలతో వాటిని కూడా వినియోగించవచ్చు. భూసార పరీక్ష ఆధారంగా పంటకాలం, సీజన్ ను బట్టి వివిధ పంటలలో ఎకరానికి 16 – 48 కిలోల పొటాష్ అవసరమౌతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కావున ఇంత ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుతం నానాటికి ఖరీదవుతున్న పొటాషియం నిచ్చే ఎరువులపై సరైన అవగాహనతో వినియోగిస్తే నాణ్యమైన అధిక దిగుబడి తక్కువ ఖర్చుతో పొందవచ్చు.

                              పి. లక్ష్మణ్ రావు, డి. స్రవంతి, కె.విజయ గౌరి, ఎమ్. ఎమ్. కాడ సిద్దప్ప,                                 ఎమ్. రామ్ ప్రసాద్, ఆల్దాస్ జొనయ్య , వ్యవసాయ కళాశాల, అశ్వారావు పేట.

Leave Your Comments

అల్లం పంట సాగు – ఉపయోగాలు

Previous article

విత్తనాలను నిల్వ సమయంలో ఆశించు పురుగులు – యాజమాన్యం

Next article

You may also like