తెలంగాణనేలల పరిరక్షణవ్యవసాయ పంటలు

నేలను పదిలం చేసే సేంద్రియ పదార్థం

0

 నిస్సారమైన భూమిని సారవంతంగా ఎలా మార్చాలి:

అధిక దిగుబడి సాధించాలంటే పోషకాల సమతుల్యంతో పాటు నేల భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఒకసారి నేల భౌతిక సమస్యలు ఉన్నట్లయితే ఆ నేలను తిరిగి పునరుద్దించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మనదేశంలో సుమారుగా 90 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో నేల భౌతిక సమస్యల ప్రభావం వలన పలు పంటలో దిగుబడులు తగ్గడం గుర్తించడం జరిగింది. ప్రధానంగా తక్కువ లోతుగల నేలలు 26.4 మి. హె  విస్తీర్ణంలోనూ, నేల గట్టి పడే సమస్య గల నేలలు 21.57 మి. హె విస్తీర్ణంలో, నీరు ఎక్కువగా ఇంకే నేలలు 13.75 మి. హె విస్తీర్ణంలోను, అడుగున గట్టిపరుగా పొరగల నేలలు 11.31 మి. హె విస్తీర్ణంలోను, పై పొర పెరకు కట్టడం 10.25 మి. హె విస్తీర్ణంలో మరియు నీరు నిలవ సమస్యల నెలలు 6.24 విస్తీర్ణంలో కలవు. ఈ నెల భౌతిక సమస్యలు సహజసిద్ధంగానే ఏర్పడవచ్చు లేదా వ్యవసాయం చేయ క్రమంలో నీటి కోత ప్రభావం వలన సేంద్రియ కర్బనంతో కూడిన ఉపరితల సారవంతమైన నేల కొట్టుకొని పోవడం తద్వారా నిస్సారవంతమైన క్రింది పొర బయటపడటం, తరతరాలుగా పంట మార్పిడి లేకుండా ఒకే పంట వేయడం అసమాతుల్య పోషక యాజమాన్యం అవలంభించడం, సేంద్రీయ ఎరువులు వాడకపోవడం, అసురక్షిత పొలాలు వంటి మొదలగు కారణాల వలన భౌతిక లక్షణాలు క్షీణించి తదనంతరం నిస్సారవంతమైన భూములుగా తయారవుతున్నాయి. అందువలన ఇటువంటి నిస్సారమైన భూముల గురించి తెలుసుకొని వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

1) నేల పై పొర పెంకు కట్టడం మరియు గట్టి పడే స్వభావం గల చల్కా భూములు: వర్షాధారం క్రింద సాగు చేసే ఎర్ర నేలల్లో ఈ సమస్య అధికంగా కలదు. కారణాలు ఏమనగా సాల్ట్ మరియు ఇసుక సమాన మోతాదులో ఉండటం మరియు తక్కువ సేంద్రీయ కార్బనం వుండటం వలన నేల నిర్మాణం సరిగ్గా లేకపోవడం మరియు ఐరన్, ఆల్యుమినియం ఆకైడైలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇటువంటి భూముల్లో విత్తిన 2 రోజుల్లో వర్షాలు పడి ఆగిపోతే నేలపై పెంకు ఏర్పడుట వల్ల వర్షాధారంగా పండించు సజ్జ, ప్రత్తి, వేరుశనగ, ఆముదం మరియు కంది వంటి పంటల్లో మొలక శాతం రాకపోవటం, వచ్చిన మొలక దెబ్బతినడం ద్వారా పొలంలో తగిన మొక్కల సాంద్రత లేక పంట దిగుబడి తగ్గును. ఈ భూముల్లో మెక్కల వేర్లు భూమిలోకి చొచ్చుకోని పోలేక పైరుకు తగినంత నీరు, గాలి, పోషకాలు అందవు. అంతే కాకుండా ఈ భూముల్లో నీటి ప్రవాహం వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొషకాల వినియోగాల సామర్థ్యం, నీటి వినియోగాల సామర్థ్యం తక్కువగా ఉంటాయి.

యాజమాన్య పద్ధతులు : ఇటువంటి సమస్య ఉన్న భూములల్లో ప్రతి సంవత్సరం పశువుల ఎరువు ఎకరాకు 4 టన్నుల చొప్పున విత్తే ముందు వేసుకోవాలి. నేలలను పంట అవశేషాలతో మల్చింగ్ పద్ధతిలో కప్పి ఉంచాలి. అంతేకాకుండా విత్తనం విత్తిన సాళ్ళ వెంబడి పశువుల ఎరువును వేయడం ద్వారా ఈ నేలల్లో మొలకశాతాన్ని పెంచవచ్చును. నేల పెంకు ఏర్పడిన వెంటనే గుంటక తోలడం ద్వారా కూడా మొలకశాతాన్ని పెంవచ్చును.

2) లోతు తక్కువ గల నేలలు:

నేల లోతు తక్కువగా ఉండటం (30 సెం.మీ కన్న తక్కువ) వలన నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది.

యాజమాన్య పద్ధతులు: ఇటువంటి భూముల్లో ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాలువలు నాగళ్ళతో లేదా పారలతో నిర్మించి పంటను బోదెల మీద నాటాలి. వీటితో పాటు ఎకరాకు 4టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువులు వేసి దిగుబడిని పెంచుకోవచ్చును.

3) తక్కువ నీటి నిలువ శక్తి గల భూములు:

వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండడంతో పాటు బంక మన్ను 20 శాతం కన్న తక్కువగా వుంటుంది. ఇలా ఉండటం వలన భూమిలో నీరు నిలువ ఉండక, పోషకాలు మొక్కలకు అందక దిగుబడి తగ్గుతుంది.

యాజమాన్య పద్ధతులు: ఇటువంటి సమస్య ఉన్న భూములలో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధికమించ్చును.

4) నేల లోపల గట్టి పొరలు:

ఉపరి తలం నుండి మీటరు వెడల్పున గుంట తవ్వుతు వెళ్ళిణ కొంత లోతున గట్టి పొరలు కనబడుతాయి. గట్టి పొరకు పైన, క్రింద మాములు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకి గట్టిగా తగులుతుంది.

యాజమాన్య పద్ధతులు: ఇటువంటి సమస్య ఉన్న భూముల్లో పెద్ద ట్రాక్టరుతో లోతు దుక్కులు చేసుకోవాలి. దానితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు మరియు 2 టన్నుల జిప్సం కూడా వేస్తే 10 నుండి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.

5) మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్య గల నేలలు:

మాగానిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువైన మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య. వరి తర్వాత అరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువలన వేసిన పంట సరిగ్గా మొలకెత్తదు.

యాజమాన్య పద్ధతులు: ఇటువంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్ళతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ లేదా పళ్ళదంత్తెతో దున్నితే పెద్ద పెళ్ళలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.

6) తీవ్ర వాలు గల నేలలు:

ఇటువంటి సమస్య ఉన్న భూములలో నేల కోత అధికంగా ఉండటమే కాకుండ భూసారం తగ్గటంతో పాటు నేల నీటి నిలువ శక్తి తగ్గి, చిట్ట పరిస్థితులు వేగంగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది.

యాజమాన్యం: 3,4 శాతం వరకు వాలు వున్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటరు సేద్యం చేయటం ద్వారా ఈ నేలలు ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు. కాంటురు సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా 50 నుండి 100 అడుగుల దూరంలో కాంటూరు “కీ” లైన్లను ఏర్పాటు చేయాలి. దీనికై చిన్న గట్టును ఏర్పాటు చూసుకోవాలి. దీనిపై చెట్టను పెంచుకోవచ్చును.

పైరు వేసిన 3-4 వారాల తర్వాత పెద్ద నాగళ్ళతో ప్రతి 3-4 మీటర్ల దూరంలో వర్షపు నీరు సంరక్షణకై వాలుకు అడ్డంగా లోతు నాగలి సాలు వేయాలి.

7) చౌడు నేలలు: (ఇవి ప్రధానంగా రెండు రకాలు)

1) తెల్లచౌడు లేదా పాల చౌడు నేలలు: వేసవి కాలంలో కొన్ని నేలలు ఉపరితలంపైన తెల్లటి పొరలాగా నీటిలో కరిగే లవణాలతో పెరుకోని ఉంటుంది. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగ్గా మొలకెత్తవు. మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపైన పేరుకొన్న ఉప్పును పారతో చెక్కి తీసి వేయాలి. అంతేకాకుండా పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోని 15 సెం.మీ. లోతు నీరు నిలువ ఉండేటట్లు సాగు నీటిని పెట్టాలి. ఇలా ఆ నీటిని 4 లేక 5 రోజులు నిలువ ఉంచి భూమిలో ఇంకనియాలి. తర్వాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసి వేయాలి. ఈ విధంగా 3-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ వంటి పంటలను పెంచి 45-50 రోజుల తర్వాత భూమిలో కలియదున్నడం ద్వార కూడా చౌడును నివారించవచ్చును.

2) కారు చౌడు నేలలు: ఈ కారు చౌడు నేలల్లో వేసవి కాలంలో పైన నలువు లేక బూడిద రంగు పొరను చూడవచ్చు. వీటిలో మార్పిడి జరిగే సోడియం 15 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా, నీరు త్వరగా భూమిలోకి ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. సేద్యానికి అనుకూలంగా ఉండదు. ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి మొదటగా పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకోని మడుల నుండి మురుగు నీరు పోయేలా లోతైన కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వేసుకోవాలి. భూసార పరిక్ష అందుబాటులో లేనప్పుడు ఎకరకాఉ సుమారుగా 1.2 నుండి 1.6 టన్నుల జిప్సాన్ని ఒకే దఫాగా వేయాలి. అంతేగాకుండా చెఱకు ఫ్యాక్టరీలలో వ్యర్ధ పదార్థాంగా మిగిలే ప్రెస్ మడ్ కూడా జిప్సంకు బదులుగా వాడవచ్చు.

8) ఆమ్ల నేలలు:

ఈ నేలలు ఉదజని సూచిక 6.5 కన్న తక్కువగా ఉంటుంది. పైన చూడటానికి ఈ నెలలు తెలికగా, ఎర్రగా కనబడుతాయి. ఈ నేలలను బాగు చేయడానికి సున్నం లేదా ఉక్కు పరిశ్రమలో వ్యర్థ పదార్ధంగా మిగిలే బేసిక్ స్లాగ్ మరియు ప్రెస్ మడ్ ను వాడవచ్చును. భూసార పరీక్ష అందుబాటులో లేనప్పుడు ఎకరాకు 2-3 క్విం. పొడి చేసిన సున్నాని సాళ్ళల్లో వేస్తే సరిపోతుంది.

9) సున్నం అధికంగా గల నేలలు:

ఈ నేలలను గుర్తించడం చాలా తేలిక. ప్రత్యేక రూపంలో ఉన్న సున్నాన్ని చూడగానే తేలికగా గుర్తింవచ్చు. ఈ నేలల్లో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాటు సర్వసమాన్యంగా కనిపిస్తాయి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి పంట నష్టాన్ని తగ్గింవచ్చు. అంతేకాకుండా ఈ నేలల్లో జనుము, జీలుగును పచ్చి రొట్టె పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగెలా చేస్తే సున్నాపు దుష్ప్రభావాలు కొంతవరకు తగ్గిపోతాయి.

ಇ. స్వామి, భూసార పరీక్ష నిపుణులు,డిడియస్ – కృషి విజ్ఞాన కేంద్రం, డిడ్డి గ్రామము, జహీరాబాద్ – 502228

ఫోన్ నెం. 9676136128

Leave Your Comments

వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం

Previous article

వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా బయో గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటు: వ్యవసాయ మంత్రి తుమ్మల

Next article

You may also like