నేల ఉదజని సూచిక :-
భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, తటస్థ నేలలు లేదా చౌడు భూములుగా విభజిస్తారు. భూముల ఆరోగ్యం, మొక్కలకు అవసరమైన పోషకాల అందుబాటు, భూమిలోసూక్ష్మజీవుల పెరుగుదల, నీరు ఇంకే స్వభావాన్ని చాలా వరకు ఉదజని సూచిక ప్రభావితం చేస్తుంది.సాధారణంగా ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య గల భూములను తటస్థ భూములంటారు. ఇవి సాగుకు అత్యంత అనుకూలం. కాని అల్పంగా ఆమ్ల గుణం, స్వల్పంగా చౌడు గుణం గల భూముల్లో కూడా మంచి యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించే వీలుంటుంది.
ఆమ్ల భూములు :-
ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉన్న భూములను ఆమ్ల నేలలుగా చెబుతారు.ఇలాంటి భూముల్లో సేంద్రియ పదార్ధాలు కుళ్లడానికి, భూమిలోని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవుల చర్య బాగా తగ్గిపోతుంది. దీంతో మొక్కలకు ప్రధాన పోషకాల అందుబాటు తగ్గుతుంది. మొక్కల వేర్ల వృద్ధి కూడా తగ్గిపోతుంది. ఈ భూముల్లో మొక్కలకు భాస్వరం, సున్నం, మెగ్నీషియం, మాలిబ్డినం పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయి. ఇనుము, అల్యూమినియం వంటి సూక్ష్మ పోషకాలు మొక్కలకు అధికంగా లభ్యమై హానికలిగించే విధంగా మారుతాయి. ఆమ్ల నేలలను సాగుకు అనుకూలంగా మార్చేందుకు నేల ఉదజని సూచిక, నేల రకాన్ని బట్టి సున్నం సిఫార్సు చేస్తారు. పట్టిక-1లో సిఫార్సు చేసిన పొడి సున్నం మోతాదును విత్తనం విత్తకు ముందు లేదా నాట్లకు నేల రోజుల ముందు పొలమంతా సమంగా పడేలా చల్లి కలియదున్నుకోవాలి. పొలాన్నినీటితో తడిపితే రసాయన చర్య చురుకుగా జరుగుతుంది. సున్నాన్ని ఇతర రసాయన ఎరువులతో కలిపివాడరాదు. ఆమ్లత్వాన్ని కలిగించే.అమ్మోనియం సల్ఫేటు, అమ్మోనియం క్లోరైడ్ వంటి ఎరువులను ఈ భూములకు వాడరాదు. సరిగా కుళ్లని సేంద్రియ పదార్థాలను భూమికి వాడినప్పుడు అవి కుళ్లేటప్పుడు విడుదలయ్యే కొన్ని ఆమ్లాల వల్ల కూడా నేలలు ఆమ్లత్వాన్ని సంతరించుకొంటాయి. బాగా మగ్గిన పశువుల ఎరువునే వాడాలి. ఆమ్ల గుణం కలిగిన భూములకు 20:20:0, 28:28:0, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వంటి రసాయన ఎరువులను ఉపయోగించుకోవచ్చు. చక్కెర ఫ్యాక్టరీలలో లభించే ప్రెస్మడు కూడా వేసి ఆమ్ల భూములను బాగుచేయవచ్చు.
నిర్ధారణ :

చౌడు లేదా క్షార భూములు :-
ఉదజని సూచిక తేలిక భూముల్లో 8.5 కన్నా, బరువు నేలల్లో 9 కంటే అధికంగా ఉండే భూములను చౌడు లేదా క్షార భూములుగా పేర్కొనవచ్చు ఈభూములు సాధారణం గా నలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి.ఈ నేలలు ఎండినప్పుడు గట్టిగా బండబారిఉండి, తడిగా ఉన్నప్పుడు మెత్త బడి కాలుపెడితే కూరుకుపోతుంది. తడిగా ఉన్నప్పుడు ఈ నేలను దున్నితే మట్టి చెక్కలుగా తిరగబడుతాయి. భూమిలో నీరు సరిగా ఇంకదు పొలం పై నిలిచే నీరు ఎప్పుడూ తేరుకోదు.మడ్డిగానే ఉంటుంది. నేలలో గాలి ప్రసరణ సరిగా ఉండదు. మొక్కల వేర్లు సరిగా అభివృద్ధిచెందవు. పోషకాలు కావాల్సినంత అందక మొక్కలు సరిగా పెరగవు. నేల గుణ గణాలు క్షీణించి మొక్కల పెరుగుదల సక్రమం గాఉండదు. సూక్ష్మ జీవుల చర్య కూడా సరిగా ఉండదు. భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, జింకు వంటి పోషకాలు మొక్కలకు సరిగా అందవు. భాస్వరం, జింకు లోపాలు అధికంగా కనిపిస్తాయి. మాలిబ్డినం అధికంగా లభ్యమై మొక్కలకు హాని కలిగించే స్థాయి కిచేరుకుంటుంది.
చౌడు భూములు నివారణ :-
చౌడు భూములను నీటి పారుదల ఉన్న చోట జిప్సం వాడి బాగు చేయవచ్చు. భూసార పరీక్షా కేంద్రాల్లో నేల ఉదజని సూచిక, నేల రకం ఆధారంగా జిప్సం మోతాదును సిఫార్సు చేస్తారు. జిప్సం వినియోగానికి చౌడు భూమిని 20-25 సెంట్ల చిన్న మడులుగా చేసి, సిఫార్సు చేసిన జిప్సం చల్లి కలియదున్ని, పొలానికి నీరు పెట్టాలి. నీరు పొలంలో ఇంకేలా చూడాలి. ఇలా 3-4 సార్లు పొలానికి నీరు ఇంకేలా చేసి, చివరగా నీటిని అధికంగా పెట్టిపొలాన్ని దున్నాలి. తర్వాత నీటిని తేరనిచ్చి మరుసటి రోజు మురుగు కాల్వల ద్వారా బయటకు తీసేయాలి. దీని వల్ల భూమిలోని చౌడు, జిప్సంతో రసాయన చర్య జరిగి, నీటిలో కరిగి, మురుగు నీటి ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
గమనిక :- చౌడు, లేదా క్షార భూములు బాగు చేయడానికి ఎకరానికి 20 కిలోల జిప్సం వాడాలి.

జిప్సంను సాధారణంగా నేల ఉదజని సూచిక 8.5 కు మించి ఉన్నభూములకు మాత్రం సిఫార్సు చేస్తారు. జిప్సం వాడి నేలను బాగు చేశాక పచ్చి రొట్ట నిచ్చే జనుము, జీలుగ, పైర్లను సాగు చేసి బాగా కలియ దున్నాలి. వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులను వేయాలి. పంటలకు సాధారణంగా సిఫార్సు చేసే ఎరువులకంటే 25 శాతం అధికంగా వేసుకోవాలి. ఈ భూములు భాస్వరం, జింకు ఎరువులకు బాగా స్పందిస్తాయి. ఉదజని సూచిక 8.5 కంటే తక్కువ, 8.0 కంటే ఎక్కువ ఉన్న తక్కువ క్షారభూములను అజాగ్రత్తచేస్తే అవి కూడా చౌడు భూములుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పొలాల్లో మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడకం, సిఫార్సుల కంటే అధికంగా భాస్వరం, జింకు ఎరువులను వాడుతూ క్రమం తప్ప కుండా భూసార పరీక్షలు చేయించుకొని ఉదజని సూచికలో మార్పు గమనిస్తుండాలి. ఆమ్ల గుణం కలిగిన అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ వంటి ఎరువులను వాడితే కొంత వరకు ఉదజని సూచికను తగ్గింవచ్చు.క్లుప్తంగా ఉదజని సూచిక (పి.హెచ్) గురించి చెప్పాలంటే ఇది భూమి రసాయన స్థితితో పాటు భౌతిక స్థితిని (నీరు ఇంకే స్వభావం,మురుగు పోయే లక్షణం), వివిధ పోషకాల లభ్యత, పంట పెరుగుదల, దిగు బడుల పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నమాట.




ఎన్ . తేజకుమార్, కె . రాఘవేంద్రచౌదరి, టి . శ్రీచందన,
వై . మౌనిక, phone : 99595 59201
Leave Your Comments