Green Bread Pea Cultivation: ప్రస్తుతం మన రైతాంగం అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడుతూ, సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వలన, పంట దిగుబడులు పెరగకపోగా భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి సుస్థిరమైన దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడుతూ, సేంద్రియ ఎరువులను పోషకాల యాజమాన్యంలో ఓ భాగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మికంపోస్టు లభ్యత నానాటి తగ్గిపోతున్న తరుణంలో రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగును పంటల సరళిలో భాగంగా చేసుకోవాలి.

Green Manure Cultivation
Also Read: Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!
పచ్చిరొట్ట పైర్లతో లాభాలు:
. భూమి భౌతిక, రసాయన, జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి.
. తక్కువ ఖర్చులో నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించే వీలు కలుగుతుంది.
. నేలకు నీటిని, పోషకాలను నిలుపుచేసుకునే శక్తి , పెరుగుతుంది.
. నేల గుల్లబారి, గాలి ప్రసరణ పెరగటంతో పాటు, మురుగునీటి వ్యవస్థ మెరుగు పడుతుంది.
. సేంద్రియ పదార్థం నేలకు అందటం వలన నెలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది, అనేక జీవరసాయన చర్యలు జరిగి, లభ్యంకాని స్థితిలో ఉన్న పోషకాలు మొక్కలకు అందుబాటులోకి వస్తాయి.
. పచ్చి రొట్ట పైర్ల సాగు వలన పంటలకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది.
. పచ్చిరొట్ట పైర్లను కలియదున్నటం వలన, తరువాత వేసే పంటలకు సిఫార్సు చేసిన నత్రజనిని 25 శాతం వరకు తగ్గించి వాడుకోవచ్చు.
. పచ్చిరొట్ట పైర్ల సాగు వలన చౌడు నేలలను కూడా పునరుద్ధించుకొని ఆనేలలు ఉత్పాదకతను పెంచుకోవచ్చు.
పచ్చిరొట్ట పైరుకు ఉండాల్సిన లక్షణాలు:
. త్వరగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇచ్చేలా ఉండాలి.
. పచ్చిరొట్ట పీచు పదార్థం తక్కువగా ఉండి, నెలలో కలియదున్నినప్పుడు త్వరగా కుళ్ళ భూమిలో కలిసేటట్లు ఉండాలి.
. పప్పుజాతి పంటలను ఎంపిక చేసుకొంటే వేరు బుడిపెల ద్వారా గాలిలోని నత్రజనిని స్వీకరిస్తాయి.
. ఎంపిక చేసుకునే పైరు లోతైన వేరు వ్యవస్థ కలిగి, నీటి ఎద్దడిని తట్టుకొని, త్వరగా పెరిగి, కలుపు మొక్కలను అరికట్టేలా ఉండాలి.
. అన్ని రకాలైన నేలల్లోనూ ఏపుగా పెరిగి, నమ్మకమైన పచ్చిరొట్ట దిగుబడినిచ్చేలా ఉండాలి.
పచ్చిరొట్ట పైర్లు- వాటి లక్షణాలు:
జీలుగ:
చౌడు భూములు, వరి పండిరచే భూములు అనుకూలం. తేలికపాటి, ఇసుకనేలల్లో సాగు చేయవచ్చు. వేరు బుడిపెలు ఎక్కువగా ఉండి, నత్రజని స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఎకరానికి 12-15 కిలోల విత్తనం అవసరం. దీనిని పూతదశలో కలియదున్నటం వలన ఎకరానికి 8 నుండి 10 టన్నులు పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టతో సుమారు 6 కిలోల నత్రజని, 1- 1.5 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాష్ ఉంటాయి.
జనుము:
అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా, పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 12-15 కిలోల విత్తనం చల్లుకోవాలి. పూతదశలో కలియదున్నుకోవాలి. ఎకరానికి సుమారు 4-6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 కిలోల పొటాష్ ఉంటాయి.
పిల్లి పెసర:
అన్ని రకాల నేలల్లోనూ సాగుచేయవచ్చు. చౌడు భూముల్లో సాగుకు అనుకూలం కాదు. పచ్చిరొట్టగాను, పశుగ్రాసంగా గాను ఉపయోగపడుతుంది. ఎకరానికి 6-8 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఎకరానికి సుమారు 4-6 టన్నుల పచ్చిరొట్టనిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్ట్టలో సుమారు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5-6 కిలోల పొటాష్ ఉంటాయి.
అలసంద:
పచ్చిరొట్ట ఎరువుగా, పశువుల మేతగా వాడవచ్చు. ఎకరానికి 10-12 కిలోల విత్తనం అవసరం. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎకరానికి 4-6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు 4-5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం ఉంటాయి.
పెసర:
తొలకరి వర్షాలకు విత్తనం చల్లుకొని, కాయలు కోసిన తరువాత, మిగిలిన రొట్టను భూమిలో కలియదున్నుకోవచ్చు. అవకాశం లేనప్పుడు పచ్చిరొట్టగా ఉపయోగించుకోవచ్చు. పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టలో సుమారు 5 కిలోల నత్రజని ఉంటుంది.
పచ్చిరొట్ట పైర్ల సాగు, నేలలో కలియ దున్నేటప్పుడు తీసుకోవాల్సిన మెళకువలు:
. పచ్చిరొట్ట పైరు కాలం 60-70 రోజులు ఉంటుంది. కాబట్టి రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి, పంట సరళిని బట్టి ప్రధాన పంట వేయటానికి కనీసం 60 రోజుల వ్యవధి ఉన్నప్పుడే పచ్చిరొట్ట పైర్లను సాగుచేయాలి.
. 60 రోజుల వ్యవధి ఉన్నప్పుడు కనీసం 45-50 రోజులకు పూత దేశలో పచ్చిరొట్ట పైర్లను కలియదున్ని 10-15 రోజుల పాటు కుళ్ళనిస్తే సేంద్రియ పదార్థంగా మారి, పోషకాలు తరువాత పంటకు అందుబాటులోకి వస్తాయి. పైరు ముదిరితే, పీచు పదార్థం పెరిగి, త్వరగా కుళ్ళదు.
. పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నినప్పుడు తగినంత తేమ ఉండేలా చూడాలి. కలియ దున్నిన తరువాత కుళ్ళేటప్పుడు కొన్ని రకాలైన ఆమ్లాలు తయారవుతాయి. కాబట్టి 2 వారాలు కుళ్ళిన తరువాతే ప్రధాన పంటల సాగు చేపట్టాలి. లేకుంటే ప్రధాన పైరు పెరుగుదల తగ్గే అవకాశం ఉంది.
. పచ్చిరొట్ట పైర్లకు ఎక్కువ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. కానీ విత్తనంతోపాటు 50 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్ఫైట్ వేస్తే, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, దాని వలన, పైరు త్వరగా పెరుగుతుంది. తేలికపాటి నేలల్లో పచ్చిరొట్ట పైర్లసాగు చేసేటప్పుడు ఎకరానికి 15 కిలోల యూరియాను పై పాటుగా వేస్తే పైరు త్వరగా పెరిగి, ఎక్కువ పచ్చిరొట్ట దిగుబడినిస్తుంది.
. పచ్చిరొట్ట ఎరువులను పూతదశలో సరైన సమయంలో కలియ దున్నినప్పుడు త్వరగా కుళ్ళి, భూసారం పెరుగుతుంది. తద్వారా తరువాత వేసే పంటలకు రసాయన ఎరువుల వాడన్ని 25 శాతం వరకు తగ్గించుకోవటంతో పాటు సుస్థిరమైన దిగుబడులు పొందవచ్చు.
డా. యం. రాంప్రసాద్, డా.యస్. మధు సూదన్‌రెడ్డి, డా.యం. మాధవి
మరియు బి. భాహ్వవి, యస్. భారతి, భాస్కర్ ప్రతాప్ సింగ్, కోమల్ వర్మ కె.లావణ్య
వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం.
Also Read: Betel Nut Farming: అధునాతన పద్ధతులలో వక్కసాగు.!