వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నడం ద్వారా పంటను ఆశించి వివిధ రకాల చీడపీడలను నివారించవచ్చు. ముఖ్యంగా వేరు పురుగు, ఎర్ర గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, అనేక రకాల కీటకాల లార్వా, ప్యూపా కోశస్థ దశలను వేసవి దుక్కి దున్నడం వలన అవి బయటపడడం ద్వారా వీటిని పక్షులు తిని నాశనం చేస్తాయి. అంతే కాకుండా పంటను ఆశించే అనేక రకాల శిలీంధ్రాలను, కలుపు మొక్కలను నాశనం చేయవచ్చు. నేలను వేసవి దుక్కిలో దున్నిన తర్వాత పంటకు అనుగుణంగా నేలను తయారు చేసుకోవాలి. నేలను తయారు చేసుకున్న తర్వాత విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. సరైన నేలను, సరైన విత్తనాలను, సరైన మోతాదులో ఎంపిక చేసుకొని సరైన సమయంలో విత్తుకోవాలి. అయితే కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్ కర్నూల్ లో ఈ కింది విత్తనాలు లభిస్తాయి.
వరి పంట:
ఆర్.ఎన్. ఆర్. 15048 ( తెలంగాణ సోనా):
ఈ రకాన్ని ఆగష్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఎకరానికి 20 – 25 కిలోల విత్తనం సరిపోతుంది. పంట కాలం 120 రోజులు. దిగుబడి ఎకరానికి 2.8 క్వింటాళ్లు వస్తుంది. కిలో విత్తనం ధర రూ. 44/- మంచి ఫౌండేషన్ విత్తనం అందుబాటులో ఉంది.
పప్పు దినుసుల పంట:
కంది – పి. ఆర్. జి. 196:
ఈ రకం ఖరీఫ్ కాలానికి బాగా అనువైనది. ఎకరానికి 3 కిలోల విత్తనం సరిపోతుంది. పంట కాలం 135 – 140 రోజులు. గింజ ఎరుపు రంగు, దిగుబయి ఎకరానికి 8 క్వింటాళ్లు వస్తుంది. కిలో విత్తనం ధర రూ. 130/- ఈ రకం నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకోగలదు.
పెసర – డబ్ల్యూ. జి. జి. 42:
అతి తక్కువ వ్యవధిలో చేతికి వచ్చే పప్పు దినుసుల పంటలలో పెసర రకాలలో డబ్ల్యూ. జి. జి. 42 ముఖ్యమైనది. ఈ పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
ఎకరానికి 7 -8 కిలోల విత్తనం సరిపోతుంది. పంటకాలం 70 – 75 రోజులు. దిగుబడి 5 -6 క్వింటాళ్లు ఎకరానికి వస్తుంది. ఆకులు, కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఖరీఫ్ లో తొలకరి వర్షాలకు పెసర పంటను వేసుకొని పంట కాయలను కోసిన తర్వాత పెసర పంటను కలియదున్నుకోవడం ద్వారా నేలసారం పెరుగుతుంది. కిలో విత్తనం ధర రూ. 110/-
మినుము – పి. యు. 31:
ఈ రకం ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. కాయమీద సన్నని నూగు ఉంటుంది. కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. పంటకాలం 100 రోజులు, దిగుబడి 5 క్వింటాళ్లు ఎకరానికి వస్తుంది. విత్తనం ధర కిలోకి రూ. 130/-
పైన తెలిపిన విత్తనాలు (ఫౌండేషన్ విత్తనం) అన్ని కృషి విజ్ఞాన కేంద్రం, పాలెంలో లభిస్తాయి. ఆసక్తి కలిగిన రైతులు అందరూ మా దగ్గర నుండి విత్తనాలు తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, డా. టి. ప్రభాకర్ రెడ్డి – 7702366110 మరియు రాజశేఖర్ – 8247421216.
డా. టి.ప్రభాకర్ రెడ్డి, కె. రామకృష్ణ, ఎమ్. రాజశేఖర్, ఎల్. శ్రావిక, బి. రాజశేఖర్,
డా. ఎ. ఆది శంకర్ మరియు డా. అఫీషా జహాన్.